సర్కారీ చదువులకు సంకెళ్లు

ABN , First Publish Date - 2022-07-05T19:51:13+05:30 IST

గత మూడేళ్లుగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కొరకు పోరాడని ఉపాధ్యాయ వర్గం ఆ పాపాన్ని ఇప్పుడు పెరిగిన పని గంటల రూపంలో ఎదుర్కోవాలి. ఉపాధ్యాయులు వేతన సంతృప్తి కొరకు

సర్కారీ చదువులకు సంకెళ్లు

గత మూడేళ్లుగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కొరకు పోరాడని ఉపాధ్యాయ వర్గం ఆ పాపాన్ని ఇప్పుడు పెరిగిన పని గంటల రూపంలో ఎదుర్కోవాలి.  ఉపాధ్యాయులు వేతన సంతృప్తి కొరకు మాత్రమే కాదు. వృత్తి సంతృప్తి కొరకు, అంటే మెరుగైన బోధనా పరిస్థితుల కొరకు కూడా పోరాడాలని గ్రహించేవరకు విద్యావ్యవస్థకు నిష్కృతి లేదు.


మంత్రుల అలసత్వం, అధికారుల అత్యుత్సాహం, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకూడదనే రాజకీయ నిర్ణయం... ఇవే ప్రభుత్వం తీసుకువస్తున్న పాఠశాల విద్యా సంస్కరణలకు ప్రాతిపదికలు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలలో సుమారు 30వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడం మాత్రమే కాదు మొత్తానికి మొత్తం మిగులు చూపించాలనే ప్రయత్నం కూడా గట్టిగా జరుగుతున్నది. విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ వివిధ సందర్భాల్లో ఇచ్చిన వెసులుబాటులు నామమాత్రమే. విధానపరమైన నిర్ణయాలలో ఎటువంటి మార్పు ఉండదని మంత్రి తెగేసి చెప్పారు. ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్‌ పాఠశాలలుగా కుదించి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు బదిలీ చేయడం, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి 6, 7, 8 తరగతులను తొలగించి ప్రాథమిక పాఠశాలలుగా కుదించడం, ఉన్నత పాఠశాలలలో సమాంతర మాధ్యమ విభాగాలను రద్దుచేయడం, ఆచరణలో తెలుగు, ఉర్దూ మాధ్యమాలను రద్దు చేయడం, తమిళ్‌, ఒరియా, కన్నడ వంటి మైనర్‌ మాధ్యమాలను రద్దుచేయడం వంటి విధానపరమైన నిర్ణయాలలో ఎటువంటి మార్పు లేదు. ఇక విధానేతర నిర్ణయాలలో– మొదట పెంచుతామన్న ఒక వారంలో ఉపాధ్యాయులు బోధించవలసిన పీరియడ్స్‌ గరిష్ఠ పరిమితిని మంత్రిగారు కాస్త తగ్గించడానికి అంగీకరించారు. హామీ జీవోగా మారేసరికి ఎన్ని మలుపులో చెప్పలేం. ఉన్నత పాఠశాలలలో హెచ్‌.యం; పి.డి పోస్టులను కొనసాగిస్తామని మంత్రిగారు అంగీకరించారు. కాని 6 నుంచి 10 వరకు తరగతులు ఉన్న ఉన్నత పాఠశాలలలో ప్రస్తుతం ఉన్న కనీస పోస్టులు 9 కొనసాగిస్తామని హామీ ఇవ్వలేదు. ఉన్నత పాఠశాలలకు అదనంగా 3, 4, 5 తరగతులు కలుస్తున్న దగ్గర కనీసం ముగ్గురు ఉపాధ్యాయులను అదనంగా ఇస్తామని హామీ ఇవ్వలేదు.


విషయాన్ని జీవోల వారీగా పరిశీలిద్దాం. గత సంవత్సరం డిసెంబరు 24న జీవో 84 ఇచ్చారు. ఇది 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాల నుంచి ఒక కిలోమీటరు దూరపరిమితిలో ఉన్న ఉన్నత పాఠశాలలకు బదలాయించే అవకాశం కల్పిస్తుంది. అదే రోజు జీవో 85 ఇచ్చారు. దీని ద్వారా 3, 4, 5 తరగతుల విద్యను ఆవాస ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలకు కూడా బదలాయించడానికి అవకాశం ఏర్పడింది. ఈ రెండు జీవోలు బాలలకు ప్రాథమిక విద్యను దూరం చేస్తున్నాయి. ఇంకా, జూన్‌ 10వ తేదీన జీవో నెంబరు 117 ఇచ్చారు. ఈ జీవో సమాంతర మాధ్యమానికి, మైనరు మాధ్యమాల కొరకు ప్రత్యేక సెక్షన్‌ల ఏర్పాటుకు ఇంతవరకు ఉన్న అవకాశాలను ఆచరణలో రద్దుచేస్తుంది. ఇంకా ఈ జీవో తరగతి గదిలో విద్యార్థుల గరిష్ఠ పరిమితిని, వారంలో ఉపాధ్యాయులు బోధించాల్సిన పీరియడ్ల గరిష్ఠ పరిమితిని పెంచివేసింది. అందుకే ఈ జీవోలపై ఇటు విద్యార్థి సంఘాలు, అటు ఉపాధ్యాయ సంఘాలు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. విద్యారంగ సంస్థలు బలమైన ఉద్యమాలకు సిద్ధం అవుతున్నాయి.


మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్య 1 నుంచి 5వ తరగతి వరకు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ కూడా పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నారు. అయితే అందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి, వాటినుంచి 3, 4, 5 తరగతులను తొలగిస్తున్నారు. దీని వలన 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠశాల దూరమవుతుంది. ఇక పూర్వ ప్రాథమిక విద్యా బోధన కోసం తగిన అర్హతలు, శిక్షణ కలిగిన ఉపాధ్యాయులను నియమించడం లేదు. అంగన్‌ వాడీ వర్కర్లకు ఆ బాధ్యత అప్పజెప్పుతున్నారు. 1, 2 తరగతులు బోధించడానికి ఒక యస్‌.జి.టి మాత్రమే ఉంటాడు. అలాంటప్పుడు ఈ ఫౌండేషన్‌ పాఠశాలల్లో అందగల విద్యా ప్రమాణాల గురించి ఏం మాట్లాడగలం? 


ఇంకా, ప్రాథమికోన్నత పాఠశాలలు చాలా వరకు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ జీవో కింద చాలా ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా కుదిస్తారు. 6, 7, 8 తరగతులు చదివే అమ్మాయిలు చదువు కొనసాగించడానికి ఇతర గ్రామాలలోని ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో తమ ఆవాస ప్రాంతం నుండి కనీసం పది కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. ఇది బాలికా విద్యకు ప్రతికూలమైన నిర్ణయం.  


జూన్‌ 10వ తేదీన ఇచ్చిన జీవో 117 అనేక విషయాలతో కూడుకుని ఉంది. దీని ఫలితంగా ఉన్నత పాఠశాలలలో తలెత్తే సమస్యలను అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు ప్రస్తావించాలి. ఒక సందర్భం చూద్దాం. ఒక ఉన్నత పాఠశాలలో రెండు మాధ్యమాలు ఉంటే, 2017 ప్రసన్న కుమార్‌ కమిటీ నివేదిక ప్రకారం, మొదటి మాధ్యమానికి 9 పోస్టులు, రెండవ మాధ్యమానికి అదనంగా నాలుగు సబ్జెక్టు పోస్టులు ఇస్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న విధానం. వేలాది ఉన్నత పాఠశాలలలో తెలుగు, ఉర్దూ వంటి సమాంతర మాధ్యమాలు, తమిళ, ఒరియా వంటి మైనరు మాధ్యమాలు ఉన్నాయి. ఈ 117 జీవో ద్వారా సమాంతర, మైనరు మాధ్యమాలను రద్దుచేస్తూ ఆ మాధ్యమాలకై కేటాయించిన నాలుగు పోస్టులూ అవసరం లేదని పరిగణిస్తున్నారు. ఆ విధంగా సుమారు పది వేల ఉపాధ్యాయ పోస్టులను మిగులు తేలుస్తున్నారు. అయితే, మాధ్యమాలు రద్దయినా విద్యార్థులు ఆ పాఠశాలల్లోనే కొనసాగుతారు. వారిని ఏం చేయాలి? రెండు సెక్షన్ల విద్యార్థులను ఒక్క సెక్షన్‌లో కూర్చోబెట్టడం దీనికి పరిష్కారంగా ప్రభుత్వం భావించింది. సెక్షన్‌లు తగ్గించినప్పుడు సెక్షన్‌లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అందుకే సెక్షన్‌లో ఉండగల విద్యార్థుల గరిష్ఠ సంఖ్యను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విభాగాలలో వరుసగా 30, 35, 40 నుంచి 45, 52, 60కి పెంచారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ‘విద్యాహక్కు చట్టం 2009’ క్రిందకు వస్తాయి. విద్యాహక్కు చట్టం ప్రకారమే గతంలో సెక్షన్‌ గరిష్ఠ పరిమితిని 30, 35గా నిర్ణయించారు. మరి ఇప్పుడు దానిని 45, 52గా మారిస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. బాధితులు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు ‘కథ అడ్డం తిరిగితే అట్నుంచి నరుక్కొస్తార’నుకోవాలి. 9, 10 తరగతులలో సెక్షన్‌ గరిష్ఠ పరిమితి 60 నిర్దేశించారు. ఇది సమగ్ర శిక్షా అభియాన్‌ నిబంధనలకు విరుద్ధం. అంతేకాదు, తరగతి గదిలో 60 మంది కూచుంటే చివర కూచున్న వారికి బోర్డు కనిపించదు, పాఠం వినిపించదు. అల్లరి ఎవరు చేస్తున్నదీ టీచరుకు తెలియదు.


విద్యార్థుల నమోదు గణనీయంగా కలిగిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఈ జీవో 117 వలన తీవ్రంగా నష్టపోతాయి. అన్ని ఉన్నత పాఠశాలలలో 3, 4, 5 తరగతులు కలపడం లేదు. విలీనాలు లేని, వందలాది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల (6 నుంచి 10 తరగతులు) నుంచి ఒక ఉదాహరణ తీసుకుందాం. 2017లో ప్రసన్న కుమార్‌ కమిటీ సిఫారసులు మేరకు ఇచ్చిన జీవో 29, సవరణ జీవో 42 ప్రకారం 561–600మంది విద్యార్థులున్న ఏక మాధ్యమ ఉన్నత పాఠశాలలో ఒక హెచ్.ఎమ్, ఒక పి.డి పోస్టులతో కలిపి 23 పోస్టులు మంజూరు చేసేవారు. ఇందులో రెండవ మాధ్యమం ఉంటే 8 పోస్టులు అదనం. అంటే మొత్తం 31 పోస్టులు. మరి ఇప్పుడు 117 జీవో కారణంగా రెండవ మాధ్యమం ఉండబోవడం లేదు. ఈ జీవో ప్రకారం, 600 మంది విద్యార్థులున్నందుకు సెక్షన్‌కు 60 మంది చొప్పున 10 సెక్షన్‌లను ఏర్పాటు చేస్తారు. అంటే తరగతికి రెండు సెక్షన్‌లు అనుకోవచ్చు. రెండు తరగతులలో మూడవ సెక్షన్‌ కూడా ఏర్పాటు చేశారనుకుందాం. అంటే ఆ పాఠశాలలో 12 సెక్షన్‌లు ఉంటాయి. 12 సెక్షన్‌లున్న ఆ పాఠశాలకు జీవో 117లో ఇచ్చిన పట్టిక ప్రకారం ఒక హెచ్‌.ఎమ్, ఒక పి.డి.లను కలుపుకుని 15 పోస్టులు వస్తాయి. అంటే 600 నమోదు ఉన్న ఉన్నత పాఠశాలల్లో పోస్టులు 31 నుంచి 15కి తగ్గిపోతాయి. ఈ కారణంగా విజయవంతంగా నడుస్తున్న ఈ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అడుగంటిపోతాయి. ఈ జీవో 117 ప్రభుత్వ విద్యకు ఉరితాడే! గత మూడేళ్లుగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కొరకు పోరాడని ఉపాధ్యాయ వర్గం ఆ పాపాన్ని ఇప్పుడు పెరిగిన పనిగంటల రూపంలో ఎదుర్కోవాలి. ఉపాధ్యాయులు వేతన సంతృప్తి కొరకు మాత్రమే కాదు, వృత్తి సంతృప్తి కొరకు, అంటే మెరుగైన బోధనా పరిస్థితుల కొరకు కూడా పోరాడాలని గ్రహించేవరకు విద్యా వ్యవస్థకు నిష్కృతి లేదు.


-రమేష్‌ పట్నాయక్‌

కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటి,

అధ్యక్షవర్గ సభ్యులు, అఖిలభారత విద్యాహక్కు వేదిక

Updated Date - 2022-07-05T19:51:13+05:30 IST