మాదిగలకు నమ్మకద్రోహం.. బీజేపీకి తగదు

ABN , First Publish Date - 2022-07-01T07:12:16+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1996లో తిరుపతిలో ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసింది.

మాదిగలకు నమ్మకద్రోహం.. బీజేపీకి తగదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1996లో తిరుపతిలో ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసింది. 1999లో నాటి రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌ ఆమోదముద్రతో ఎస్సీ వర్గీకరణ అమలుకావడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది. 2004లో ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత పార్లమెంట్‌లో చట్టం కోసం మొదలైన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఎమ్మార్పీఎస్‌ ఉద్యమానికి అండగా నిలిచింది. 2004లో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడానికి బీజేపీ మద్దతు తెలిపింది. 2014 ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ హైదరాబాద్‌కు ప్రచారానికి వచ్చినపుడు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. తెలంగాణ ఏర్పడిన తరువాత భద్రాచలంలో జరిగిన సమావేశంలో కూడా ఎస్సీ వర్గీకరణను బలపరుస్తూ తీర్మానం చేశారు. 2016లో సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో త్వరలోనే ఎస్సీ వర్గీకరణ జరుగబోతుందని బహిరంగంగా ప్రకటించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేకసార్లు మాదిగ దండోరా ఉద్యమ వేదికల మీదకు వచ్చి వర్గీకరణను బలపరిచారు. దీంతో బీజేపీ మీద మాదిగల్లో సహజంగానే నమ్మకం ఏర్పడింది. అయితే వెంకన్న సాక్షిగా తిరుపతిలో చేసిన తీర్మానాన్ని, రాముడి సాక్షిగా భద్రాచలంలో చేసిన తీర్మానాలను బీజేపీ ‘గంగ’లో కలిపేసింది.


బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది ఏండ్ల కాలంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. 2011లో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఎస్సీ వర్గీకరణపై తమ వైఖరి చెప్పాలని కోరుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. ఇప్పుడు పార్లమెంట్‌లో ఈ అంశం లేవనెత్తిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం పాత సమాధానమే చెప్తూ కాలం గడుపుతోంది. దీనిని బట్టి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కావాలనే విస్మరించినట్లు కనపడుతోంది. ఎస్సీ వర్గీకరణ చేయడానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక సాకు మాత్రమే. నిజానికి వర్గీకరణ జరగడానికి మూడు మార్గాలు ఉన్నాయి. 1) రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించడం 2) ఇప్పటికే అసెంబ్లీలలో తీర్మానం చేసిన రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణను వర్తింపజేస్తూ చట్టం చేయడం 3) ఎస్సీ వర్గీకరణ న్యాయ సమ్మతమేనని అయిదుగురు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన సిఫారసులపై ఏడుగురు లేదా తొమ్మిది మంది జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయడం. ఈ మూడు మార్గాల్లో ఏ మార్గాన్ని అనుసరించినా సమస్య పరిష్కారమవుతుంది. కానీ అసలు సమస్య బీజేపీ చిత్తశుద్ధిలోలోపమే.


పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ ఉండి కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా బీజేపీ దారుణంగా మాదిగలను మోసం చేసింది. ఒకవేళ వర్గీకరణను విస్మరిస్తే దళితుల్లో ఎదిగిన కులాలు తమ వైపు వస్తాయనే ఆలోచన బీజేపీకి ఉంటే అది దురాశే అవుతుంది. దేశంలో రిజర్వేషన్ల ద్వారా ఎదిగిన దళిత కులాలు బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉత్తరాదిలోనైనా, దక్షిణాదిలోనైనా ఆయా సమూహాల రాజకీయ కార్యకలాపాలే అందుకు సాక్ష్యం. ఎస్సీ రిజర్వేషన్లలో తమ వాటా దక్కని కులాలు ఆశతో బీజేపీ వైపు చూశాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ల వల్ల నష్టపోయి వర్గీకరణ కోరుతున్న మాదిగ, ఉపకులాల జనాభా ఎక్కువగా ఉంది. తెలంగాణలో అయితే విస్మరించలేనంత అత్యధిక జనాభా ఉన్నది. తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసేన్ని ఓట్లు ఉన్నాయి. కనుక మాదిగ, ఉప కులాలను దూరం చేసుకుని తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశపడితే గాలిలో మేడలు కట్టినట్లే అవుతుంది.


2017, 2022 ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై హామీ ఇచ్చి, ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి రాజకీయ లబ్ధి కూడా పొందింది. ఎస్సీ వర్గీకరణపై ఆశ కలిగిస్తే ఎక్కడైనా సరే ప్రజలు అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు దేశంలో పరిష్కారం జరగవలసిన సమస్యల్లో ప్రథమ స్థానంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉంది. ఎస్సీ వర్గీకరణ చేయడమంటే రిజర్వేషన్లను పెంచడం కాదు, పంచడమే. దీనికి ఆర్థిక భారం లేదు, దీనితో ఇతర వర్గాలకు జరిగే నష్టం లేదు. ఆలస్యం చేయకుండా పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదించాలి. ఒక్కటి మాత్రం నిజం ఎస్సీ వర్గీకరణను పక్కన పెడితే దేశాన్ని సాంఘికంగా సంస్కరించే చారిత్రక అవకాశాన్ని బీజేపీ జారవిడుచుకున్నట్లే. ఇది బీజేపీ చరిత్రకు, రాజకీయ భవితకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇకనైనా ఎస్సీ వర్గీకరణ జరగడానికి అనుకూలంగా హైదరాబాద్‌లో జూలై 2, 3 తేదీలలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ తగిన నిర్ణయం తీసుకోవాలి.


గోవిందు నరేష్‌ మాదిగ

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2022-07-01T07:12:16+05:30 IST