అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్‌

ABN , First Publish Date - 2021-10-19T06:20:02+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల కుప్పగా మారుతోందని మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు.

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిన రాజప్ప

అభివృద్ధి శూన్యం... అటకెక్కుతున్న సంక్షేమం

మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప


అనకాపల్లి, అక్టోబరు 18: ఆంధ్రప్రదేశ్‌ అప్పుల కుప్పగా మారుతోందని మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. ఈ నెల 20వ తేదీన అనకాపల్లిలో ప్రారంభంకానున్న టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, విభజన తరువాత కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎంతో విజన్‌తో పాలన అందించారన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ఇప్పుడు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారన్నారు. రోడ్లు ధ్వంసమయ్యాయని, కనీసం మరమ్మతులు చేసే పరిస్థితి కూడా లేకపోయిందని చెప్పారు. సంక్షేమం కూడా అటకెక్కుతోందన్నారు. జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని జూన్‌కు వాయిదా వేయడాన్ని బట్టి రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. వైసీపీ నాయకుల కంపెనీలో వెయ్యి కోట్ల రూపాయలు దొరికాయంటే నిధులు పక్కదారి పడుతున్న విషయం స్పష్టమవుతోందన్నారు. కార్పొరేషన్లు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అధికారికంగా రెండున్నర గంటలు, అనధికారికంగా ఆరేడు గంటలు విద్యుత్‌ కోత విధించి ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మాట్లాడుతూ, అనకాపల్లిలో కార్యాలయం ప్రారంభంతో టీడీపీకి పూర్వవైభవం తథ్యమన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను చూస్తే వైసీపీ శేణులకు వణుకు పుడుతోందన్నారు. అందువల్లే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ అడ్డుకోవడం, ఇబ్బందులకు గురిచేయడం చేస్తున్నారని విమర్శించారు. 20వ తేదీన అనకాపల్లిలో అడ్డుకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ చంద్రబాబుపై వ్యక్తగత ఆరోపణలు చేస్తున్నారని, అది మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చినరాజప్ప, వెంకన్నలను శాలువలు కప్పి సత్కరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు కోట్ని బాలాజీ, డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, మాదంశెట్టి నీలబాబు, బొద్దపు ప్రసాద్‌, పచ్చికూర రాము, బీఎస్‌ఎంకే జోగినాయుడు, రేఖా రమణమూర్తి, సిరసపల్లి సన్యాసిరావు, శంకర్ల పద్మలత, కోట్ని రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:20:02+05:30 IST