ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ‘అమ్మ ఒడి’ ఇచ్చేది ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2021-10-12T14:14:59+05:30 IST

అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇక నుంచి విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యాసంవత్సరం మధ్యలో ఇస్తున్నారు. 2020-21విద్యా సంవత్సరానికి ఈ ఏడాది..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి ‘అమ్మ ఒడి’ ఇచ్చేది ఎప్పుడంటే..!

జూన్‌లో ‘అమ్మ ఒడి’

విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇవ్వాలని నిర్ణయం

విద్యాకానుకపై డిసెంబరు నాటికి వర్క్‌ ఆర్డర్‌

అన్ని పాఠశాలలకూ సీబీఎస్ఈ అఫిలియేషన్‌

ఎయిడెడ్‌ విలీనంపై బలవంతం లేదని చెప్పాలి: సీఎం

ఈ ఏడాది అమ్మ ఒడి ఎప్పుడిస్తారో స్పష్టత కరవు


అమరావతి(ఆంధ్రజ్యోతి): అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇక నుంచి విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యాసంవత్సరం మధ్యలో ఇస్తున్నారు. 2020-21విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జనవరిలో అమ్మ ఒడి సాయం అందించారు. వచ్చే ఏడాది నుంచి అలా కాకుండా విద్యాసంవత్సరం ప్రారంభం(జూన్‌)లోనే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ప్రస్తుత విద్యాసంవత్సరానికి(2021-22) యథావిధిగా వచ్చే జనవరిలోనే ఇస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.


‘సాధారణంగా జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైతే ఏప్రిల్‌ వరకూ కొనసాగుతాయి. ఆ విద్యాసంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభం(జూన్‌)లోనే అమ్మ ఒడిని అందించాలి. అమ్మఒడి ఇవ్వాలంటే పిల్లలకు 75శాతం హాజరు తప్పనిసరి అని నిబంధన పెట్టాం. 2020, 2021 సంవత్సరాలలో కొవిడ్‌ వల్ల ఆ నిబంధన అమలు సాధ్యం కాలేదు. జనవరిలో అమ్మ ఒడి ఇస్తే ఆ తర్వాత పాఠశాలలు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే 2022 నుంచి మాత్రమే అమ్మఒడి పథకానికి హాజరు నిబంధనను వర్తింపచేయాలి. పిల్లలను చదువుల బాట పట్టించాలన్నదే అమ్మ ఒడి ఉద్దేశమని, ఈ పథకానికి సంబంధించిన స్ఫూర్తిని కొనసాగించాలి’ అని సీఎం చెప్పారు.


మరోవైపు ప్రతి పాఠశాలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా క్రీడా మైదానం ఉండాలని స్పష్టం చేశారు. క్రీడా మైదానం లేనిచోట్ల భూసేకరణ చేసి ఆ సదుపాయం కల్పించాలన్నారు. కాలక్రమేణా ప్రీ హైస్కూల్‌ స్థాయివరకు క్రీడామైదానం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. 


నిర్వహణ ఖర్చులు లక్షకు పెంచాలి..

ప్రతి పాఠశాలకు నిర్వహణ ఖర్చులను పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడు రూ.75వేల వరకు ఇస్తుండగా, దాన్ని రూ.లక్షకు పెంచాలన్నారు. విద్యాకానుక పై డిసెంబరు నాటికి వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలు పాఠశాలకు వెళ్లేనాటికి విద్యాకానుక అందించాలన్నారు. పిల్లలకు ఇచ్చే స్పోర్ట్స్‌ డ్రస్‌, షూలను పరిశీలించారు. కాగా, పాఠశాలల పనితీరుపై సోషల్‌ ఆడిట్‌ ద్వారా ర్యాంకులు ఇస్తామని అధికారులు ప్రతిపాదించగా, దీనిపై ఉపాధ్యాయులందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. ఎక్కడ వెనుకంజలో ఉన్నామో తెలుసుకోవడం కోసమే ర్యాంకింగ్‌లు అని, ఉపాధ్యాయులను తొలగించడానికో, వారిని అభద్రతా భావానికి గురిచేయడం కోసమో కాదన్నారు. సంస్కరణలు, మార్పులు తీసుకురావాలంటే తొలుత వాటి వెనకున్న లక్ష్యాలు, ఉద్దేశాలను ఉపాధ్యాయులకు స్పష్టంగా చెప్పాలన్నారు.


ఉపాధ్యాయుల మ్యాపింగ్‌ను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని, సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని ఆదేశించారు. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం విషయంలో ఎవరూ బలవంతం చేయడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రభుత్వానికి అప్పగిస్తే నడుపుతామని, లేకుంటే వారే ప్రైవేటుగా నడుపుకోవచ్చని వివరించాలన్నారు. పాఠశాలల్లో ఆగస్టులో హాజరు 72 శాతం ఉంటే, అక్టోబరు నాటికి 85 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు 91 శాతం ఉందన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-12T14:14:59+05:30 IST