ఆంధ్ర ఊటీ

ABN , First Publish Date - 2022-04-22T05:15:26+05:30 IST

ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఉన్న హార్సిలీహిల్స్‌ కొత్తజిల్లా ఏర్పాటుతో అన్నమయ్య జిల్లాలో కలిసింది.

ఆంధ్ర ఊటీ
హార్సిలీహిల్స్‌ వ్యూ

నాటి ఏనుగు మల్లమ్మ కొండే నేటి హార్సిలీహిల్స్‌

రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన వేసవి విడిది కేంద్రం

అన్నమయ్య జిల్లాలోకి...


బి.కొత్తకోట, ఏప్రిల్‌ 21 : ఆ ప్రాంతం సముద్ర మట్టానికి 4312 అడుగుల ఎత్తులో ఉంది.ఎండా కాలంలోను ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉండడంతో పాటు పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు, అందమైన ప్రదేశాలతో ఆంధ్ర ఊటీగా పేరుగాంచింది. చలికాలంలో అతి తక్కువగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు, వేసవి కాలంలో 32 డిగ్రీలు దాటని ఉష్ణోగ్రతలతో చల్లని గాలులు, పచ్చని చెట్లు, కొండలు, లోయలు, ఇలా ఎన్నో ప్రత్యేకతలు గల ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఉన్న హార్సిలీహిల్స్‌ కొత్తజిల్లా ఏర్పాటుతో అన్నమయ్య జిల్లాలో కలిసింది. టూరిజానికి మంచి ఆదాయాన్ని ఇచ్చే హార్సిలీహిల్స్‌ ఆదాయ పరంగాను, సుదీర్ఘ చరిత్ర రాష్ట్రంలోనే ఎత్తయిన ప్రాంతంగా అన్నమయ్య జిల్లాకు మణిహారంగా ఉంటుందనడంలో సందేహం లేదు. తంబళ్లపల్లె నియోజక వర్గం బి.కొత్తకోట మండలంలో ఉన్న హార్సిలీహిల్స్‌ పూర్వపు పేరు ఏనుగు మల్లమ్మ కొండ. కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయం నేటికీ ప్రసిద్ధి. అయితే 1858లో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వంలో కడప కలెక్టర్‌గా ఉన్న సర్‌ హార్సిలీ తరచూ ఈ కొండకు వచ్చే వారని, ఇక్కడి వాతావరణం నచ్చడంతో ఆయన అప్పటిలోనే వేసవి విడిది కేంద్రంగా చేసుకుని అతిథి గృహాలను నిర్మించారు. 1859లో ఆ అతిథి గృహాల సమీపంలో ఆయన నాటిన నీలగిరి మొక్క నేడు మహావృక్షంగా పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. దీనికి భారత ప్రభుత్వం 1995లోనే మహావృక్ష పురస్కారం అందించింది. హార్సిలీకి 1864 మే 31న కొడుకు జన్మించి అదేరోజే మృతి చెందాడు. జూనియర్‌ హార్సిలీ సమాది హిల్స్‌పై ఇప్పటికీ ఉంది. అప్పటి కడప జిల్లా కలెక్టర్‌ హార్సిలీ వలన కొండ బయటి ప్రపంచానికి తెలియడంతో నాటి నుంచి ఏనుగు మల్లమ్మ కొండ హార్సిలీహిల్స్‌గా పిలువబడుతోంది. హార్సిలీహిల్స్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేసవి విడిది కేంద్రంగా గుర్తించి 1961వ సంవత్సరంలో రాష్ట్ర గవర్నర్‌ విడిది కోసం హిల్స్‌పై ఆత్యాధునిక సౌకర్యాలతో గవర్నర్‌ బంగ్లా నిర్మించారు. అప్పటి నుంచి పలుమార్లు వేసవి కాలంలో రాష్ట్ర గవర్నర్లు ఇక్కడికి వచ్చి విడిది చేసి వెళ్లేవారు 2000 సంవత్సరం నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హార్సిలీహిల్స్‌ అంచెలంచలుగా అభివృద్ధి చెందింది. పర్యాటకులు బస చేయడానికి ప్రస్తుతం హార్సిలీహిల్స్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెస్టారెంటు, ఫంక్షన్‌హాల్‌తో పాటు 60 అతిథి గదులు ఉన్నాయి. ఇంకా రైల్వే, పోలీస్‌, అటవీశాఖలకు అతిథి గృహాలు ఉన్నాయి. వీటికి తోడు ప్రైవేటు అతిథి గృహాలు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాల్‌లు ఉన్నాయి.పర్యాటకులకు కనువిందు చేసే ప్రకృతి అందాలతో పాటు వీక్షించేందుకు అటవీ శాఖ, టూరిజం ఆధ్వర్యంలో మినీ జూపార్క్‌, మొసళ్లపార్క్‌, మ్యూజియం, గార్డెన్స్‌, చిల్రన్స్‌ పార్క్‌, అడ్వెంచర్‌ పార్క్‌, స్విమ్మింగ్‌ పూల్‌, మసాజ్‌ సెంటర్లు, అందమైన ప్రకృతి అందాలను చూసేందుకు వ్యూపాయింట్స్‌ ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. మదనపల్లె నుంచి హార్సిలీహిల్స్‌కు బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మదనపల్లె హార్సిలీహిల్స్‌ 29 కిలోమీటర్లు కాగా బి.కొత్తకోట నుంచి హార్సిలీహిల్స్‌ 27 కిలోమీటర్లు. హార్సిలీహిల్స్‌ నుంచి బెంగళూరుకు 160 కిలోమీటర్లు కాగా 140 కిలోమీటర్ల దూరంలో తిరుపతి, 127 కిలోమీటర్ల దూరంలో కడప ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి హార్సిలీహిల్స్‌ 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న హార్సిలీహిల్స్‌ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 



Updated Date - 2022-04-22T05:15:26+05:30 IST