శ్రీలంక బాటలో ఆంధ్ర!

ABN , First Publish Date - 2022-07-14T08:28:39+05:30 IST

శ్రీలంక బాటలో ఆంధ్ర!

శ్రీలంక బాటలో ఆంధ్ర!

జగన్‌ది కక్షపూరిత పాలన.. అప్పుల ఊబిలో రాష్ట్రం.. పరిస్థితి ఆందోళనకరం

8 లక్షల కోట్ల రుణ భారం.. అభివృద్ధి జరగడం లేదు.. రోడ్ల పరిస్థితి దారుణం

పెట్టుబడులు రావడం లేదు.. ఉపాధీ లేదు.. ఏ వర్గమూ సంతోషంగా లేదు

భవిష్యత్‌లోనూ జనసేనతో పొత్తు.. మా టార్గెట్‌ కూడా 175 స్థానాలే

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ సీనియర్‌ నేత పురందేశ్వరి


న్యూఢిల్లీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం జగన్‌ కక్షపూరిత పరిపాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అప్పులు, ఉచిత పథకాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి శ్రీలంక పరిణామాలను తలపిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. బుధవారం ఢిల్లీలో ఆమె ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్య విశేషాలివీ..


తెలంగాణ మీద చూపినంత శ్రద్ధ.. కేంద్రం, బీజేపీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌పై ఎందుకు పెట్టడం లేదు..?

పురందేశ్వరి: దీనిని అంగీకరించను. ఈ మఽధ్యే అల్లూరి జయంతి వేడుకల కోసం ప్రధాని మోదీ వచ్చారు. గతంలో మా జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వచ్చారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం చాలా వరకు సహకారం అందించింది. నిజంగా రాష్ట్రంపై దృష్టి లేకపోతే అంత సహకరించరు కదా..!


ముఖ్యమంత్రి జగన్‌ పాలన ఎలా సాగుతోంది..? అభివృద్ధి ఎలా జరుగుతోంది..? 

రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని నేను భావించడం లేదు. రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది! ఇది మేం చెబుతున్న మాట కాదు.. ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవు. కక్షపూరితంగా పరిపాలన జరుగుతుందన్న భావనతో పెట్టుబడులు పెట్టినవారు వెనక్కి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కొత్త పెట్టుబడులు రావడంలేదు. దీంతో ఉపాధి అవకాశాలు కూడా సరిగా లేవు. ఏ వర్గాన్ని చూసినా సంతోషంగా ఉన్నారని నేను భావించడంలేదు. రాష్ట్రం సరైన దిశలో వెళ్తోందన్న భావన నాకైతే లేదు. 


రాష్ట్రంలో అవినీతి, మద్యం, ఇసుక మాఫియా సమస్యలపై బీజేపీ నిలదీయడం లేదు..!

ప్రతి విషయం మీదా బీజేపీ స్పందిస్తూనే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చాలా సార్లు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆందోళనలు, నిరసనలూ చేపట్టాం. మూడు నెలలుగా పేదలకు ఉచిత రేషన్‌ బియ్యం అందడం లేదనే విషయంపై ఈ మఽధ్య పధాధికారుల సమావేశంలో చర్చించాం. అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలు, అవీనితి, ఇసుక మాఫియా మీద ఆందోళనలు చేశాం. మద్యం మీద కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్నాం. అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇచ్చి రూ.2 వేలు కోత విధిస్తున్నారు, పురుషులకు తాగుడు అలవాటున్న ఇళ్లలో మిగిలిన రూ.13 వేలు కూడా ప్రభుత్వం పెంచేసిన మద్యానికి వెళ్లిపోతోంది. ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు అన్నారు. కానీ.. వారు అడుగడుగునా చలాన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకుంటున్నారు. మద్యం షాపుల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ జరగాలి. దశల వారీగా మద్యపాన నిషేధం తీసుకొస్తామన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు..? వైన్‌, లిక్కర్‌ షాపుల సంఖ్య తగ్గించామని జగన్‌ చెబుతున్నారు. మరోవైపు.. వాటి రేట్లు పెంచేసి దాన్ని ఆదాయ మార్గంగా చూసుకుంటున్నారు. వీటన్నిటి మీద మా పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. ప్రశ్నిస్తూనే ఉంది. 


అప్పులు, ఉచిత పథకాలే శ్రీలంక దుస్థితికి కారణమని ప్రపంచం కోడై కూస్తోంది. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌ ఎలా ఉండబోతుంది?

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సుమారు రూ.8 లక్షల కోట్ల రుణ భారం ఉంది.  అద్భుతంగా ఆలోచించి ఆదాయం పెంచుకునే అవకాశముందా అంటే ఎక్కడా కనిపించడంలేదు. పరిస్థితి కచ్చితంగా ఆందోళనకరంగానే ఉందని భావిస్తున్నా.


జగన్‌ బీజేపీకి సహకరించడం వల్లే కేసుల నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలన్నాయి..!

చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ నమ్ముతోంది. అమిత్‌ షా, నడ్డా పదే పదే ఇదే  చెబుతున్నారు. అగ్రనాయకత్వం నుంచి కింది వరకు కల్పించుకుని.. ఈ కేసు ప్రొసీజర్‌ను ఆపండని గానీ.. జాప్యం చేయండని గానీ ఎప్పుడూ చెప్పిన నేపథ్యం లేదు. 


175 స్థానాలు గెలవవడమే లక్ష్యమని ప్లీనరీలో జగన్‌ ప్రకటించారు. బీజేపీ టార్గెట్‌ ఎంత..?

మా టార్గెట్‌ కూడా 175 స్థానాలే. టార్గెట్‌ చెప్పకోవడంలో ఏముంది..? ఎంత వరకు సాధ్యమవుతుందనేది మేం ఆలోచించుకుంటాం. అంతర్గతంగా మాట్లాడుకుని ఎలా, ఏ కార్యచరణతో ముందుకు వెళ్లాలో మా అధిష్ఠానం నిర్ణయిస్తుంది. 


వైసీపీ, టీడీపీ మధ్య బీజేపీ ఎదగడం సాధ్యమేనా..?

ప్రజలే అంతిమ నిర్ణేతలు. అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజల్లో ఆందోళన పెరుగుతున్నదనేది వాస్తవం. టీడీపీ బలీయమమైన పార్టీ.. నాయకులు కూడా ఉన్నారు. బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే.. మణిపూర్‌, యూపీని తీసుకోండి. అసలు సాధ్యం కాదని భావించిన రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఒకసారి కాదు రెండుసార్లు వచ్చింది. అసాధ్యమంటూ ఉండదు. కార్యచరణతో ముందుకెళ్తాం. 


భవిష్యత్‌లో టీడీపీతో పొత్తుండే అవకాశం ఉందా..? జనసేనతో కొనసాగుతుందా..? 

పొత్తుల గురించి మేం కాదు.. మా పార్టీ అగ్రనాయకత్వం ఆలోచిస్తుంది. మా దృష్టి అంతా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపైనే. రాష్ట్రంలో పార్టీ ఎదగలేదనడం సరికాదు. ఆత్మకూరు, బద్వేలులో 14, 15 శాతం ఓట్లు సాధించాం. దీనిని బట్టి చూస్తే ఎదిగామనే అనుకుంటున్నాం. జనసేనతో ఇప్పటికే పొత్తు ఉంది. ముందు నుంచీ ఉంది, భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. 


ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కేంద్రం ధారాదత్తం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..?

ప్రైవేటు వ్యక్తులను పిలిచి ఇది మీరు తీసుకోండని మేం వాళ్ల చేతుల్లో పెట్టట్లేదు కదా..! దానికో ప్రొసీజర్‌ ఉంది. ఎయిర్‌ ఇండియాను టాటా సంస్థ వాళ్లు తీసుకున్నారు. వాళ్లకు అది బిడ్‌లో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ‘గవర్నమెంట్‌ హాజ్‌ నో బిజినెస్‌ టు డూ బిజినెస్‌ (వ్యాపారం చేసే పని ప్రభుత్వానిది కాదు)’ అని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. ఆయన బీజేపీ కార్యకర్తగా ఆ మాట చెప్పలేదు.. దేశ ప్రధానిగా చెప్పారు. 


విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలనే ఆలోచనను కేంద్రం విరమించుకుందా.. కొనసాగుతోందా.?

అది ప్రభుత్వ నిర్ణయం. జాతీయ విధానం. ఒక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీనే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించలేదు కదా..! మా తరఫున ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాం. ఎలా చేస్తే బాగుంటుందో చెప్పాం. వాళ్లు ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. మంత్రి మారారు. ఉక్కు శాఖను జ్యోతిరాదిత్య సింధియాకు ఇచ్చారు. ఆయన్ను కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం.

Updated Date - 2022-07-14T08:28:39+05:30 IST