అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రవాసులు.. ప్రపంచవ్యాప్తంగా..

ABN , First Publish Date - 2020-07-05T02:25:53+05:30 IST

ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పోరాటం

అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రవాసులు.. ప్రపంచవ్యాప్తంగా..

కాలిఫోర్నియా: ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పోరాటం 200 రోజులకు చేరుకుంది. ఇదే సమయంలో ప్రపంచదేశాల్లోని ఏపీకి చెందిన ప్రవాసీయులు రైతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా నగరాల్లోని ప్రవాసీయులు శనివారం రైతులకు మద్దతుగా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల పోరాటం 200 రోజులకు చేరడంతో.. తాము కూడా రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టామని తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా దేశాల్లోని ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ప్రవాసీయులు రైతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూనే 15 నుంచి 20 మందితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. రాజధాని అంశంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని ప్రవాసులుగా తాము కోరుతున్నామని జయరాం కోమటి తెలిపారు. కాగా.. అమెరికాతో పాటు యూకే, ఐర్లాండ్, కువైట్, దక్షిణ ఆఫ్రికా, ఫ్రాన్స్, జర్మని, ఆస్ట్రియా, కెనడా, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని ప్రవాసీయులు రాజధాని రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు ముందుకొచ్చారు.

Updated Date - 2020-07-05T02:25:53+05:30 IST