స్త్రీవాద కథాసాహిత్యంలో కొత్త ఆశ ‘ఐదో గోడ’ కథలు

ABN , First Publish Date - 2021-11-07T16:17:02+05:30 IST

‘ఐదో గోడ’ కథాసంపుటి ద్వారా రచయిత్రి కల్పనా రెంటాల భిన్నమైన శిల్పాన్ని, కొత్తదైనటువంటి వస్తువును ఇచ్చి, స్త్రీవాద కథా సాహిత్యానికి ఆశను కల్పిస్తున్నారని కేంద్ర సాహిత్య అకాడమీ

స్త్రీవాద కథాసాహిత్యంలో కొత్త ఆశ ‘ఐదో గోడ’ కథలు

వైవిధ్యభరితమైన కథలుగా అభివర్ణించిన ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌ 


హైదరాబాద్‌ సిటీ: ‘ఐదో గోడ’ కథాసంపుటి ద్వారా రచయిత్రి కల్పనా రెంటాల భిన్నమైన శిల్పాన్ని, కొత్తదైనటువంటి వస్తువును ఇచ్చి, స్త్రీవాద కథా సాహిత్యానికి ఆశను కల్పిస్తున్నారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా అన్నారు. ‘ఐదో గోడ’ కథల ప్రేరణతో మళ్లీ పునరుత్పత్తి రాజకీయాల మీద తెలుగులో మరిన్ని కథలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఛాయా పబ్లికేషన్స్‌ ప్రచురించిన కల్పనా రెంటాల కథలు ‘ఐదో గోడ’ పుస్తకాన్ని ఆన్‌లైన్‌ వేదికగా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావంతో ఒక సందిగ్ధ స్థితిలోకి జారిన మనుషుల పట్ల మనమెలా ప్రవర్తించాలో ‘టూ డాలర్స్‌ ప్లీజ్‌’ కథ ద్వారా రచయిత్రి కళ్లకు కడతారని పేర్కొన్నారు.


‘ఐదో గోడ’ సంపుటిలోని కథలన్నీ భవిష్యత్తులో వెలువడే స్త్రీవాద కథాసాహిత్యానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నాయన్నారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్త్రీవాదానికి సంబంధించిన అనేక అంశాలు ‘ఐదో గోడ’ కథల్లో ఉన్నాయన్నారు. అందులో ప్రతీ కథలోని వాతావరణాన్ని వర్ణించడం పట్ల రచయిత్రి చూపిన శ్రద్ధ ప్రత్యేకమైందని, కథలన్నీ వైవిథ్యంగా ఉన్నాయని తెలిపారు. సమకాలీన స్త్రీవాద కల్పానిక సాహిత్యానికి ప్రతీకగా నిలిచే ఈ కథల్లో ఇదివరకు ఎవరూ స్పృశించని, స్పృశించడానికి సంకోచించిన అనేక అంశాలు ఉన్నాయన్నారు. ‘ఐదో గోడ’లోని ప్రతి కథనూ కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత చైతన్య పింగళి విశ్లేషించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కాత్యాయినీ విద్మహే, ఛాయా మోహన్‌, రచయిత్రి కల్పనా రెంటాల, ప్రముఖ కవి అఫ్సర్‌, చంద్ర కన్నెగంటి పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-07T16:17:02+05:30 IST