GHMC కార్మికులను నిలువునా దోచేస్తున్నారు.. విధులకు హాజరైనా ఏంటిది..!?

ABN , First Publish Date - 2022-04-25T18:19:28+05:30 IST

జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య కార్మికులను కొందరు నిలువు దోపిడీ చేస్తున్నారు. తమకు మామూళ్లు ఇవ్వకుంటే..

GHMC కార్మికులను నిలువునా దోచేస్తున్నారు.. విధులకు హాజరైనా ఏంటిది..!?

  • వేతనంలో కోత


జీహెచ్‌ఎంసీలో పారిశుధ్య కార్మికులను కొందరు నిలువు దోపిడీ చేస్తున్నారు. తమకు మామూళ్లు ఇవ్వకుంటే.. విధులకు హాజరైనా గైర్హాజరు వేస్తూ వేతనాల్లో కోత పెడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


  • సాంకేతిక సమస్యలు.. ఇతరత్రా కారణాలు సాకు
  • వేతనంలో రూ.5 వేల నుంచి రూ.6 వేలు కట్‌
  • వేలి ముద్రలు పడకున్నా విధులకు రానట్టే
  • యంత్రం పని చేయకున్నా అంతే
  • అక్రమాలకు చెక్‌ పేరిట అరాచకం
  • కొందరు ఏఎంఓహెచ్‌ల తీరుపై ఆరోపణలు

హైదరాబాద్‌ సిటీ : అంబర్‌పేటలోని ఓ ప్రాంతంలో పని చేసే పారిశుధ్య కార్మికురాలు వీక్‌ ఆఫ్‌ మినహా అన్ని రోజులూ విధులకు హాజరైంది. కానీ వేతనంలో రూ.3 వేలకుపైగా కోత విధించారు.  ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో ఓ కార్మికురాలు రెండు రోజులు సెలవు పెట్టింది. కానీ ఐదు రోజుల వేతనం రాలేదు.  ఇవి రెండే కాదు.. జీహెచ్‌ఎంసీలోని మెజార్టీ సర్కిళ్లలో పారిశుధ్య కార్మికుల ఇబ్బందులివి. విధులకు హజరవుతున్నా.. వేతనాల్లో కోత విధిస్తుండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకిలా జరుగుతోందని ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు లేరు. సాంకేతికత అమలు పేరిట అధికారులు సాగిస్తున్న దందా ఇది. నిర్ణీత సమయం కన్నా రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. వేలి ముద్రలను యంత్రం గుర్తించకున్నా.. పండగలు, ఆదివారాల్లో రెండు పూటలా హాజరు తీసుకోకున్నా.. విధులకు గైర్హాజరైనట్లు పరిగణిస్తూ వేతనాల్లో కోత పెడుతున్నారు. కొన్ని గ్రూపుల సభ్యులకు మాత్రం ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. వారికి మాత్రం పూర్తిస్థాయిలో వేతనాలు జమవుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది, అసలు మతలబేంటీ, కాయకష్టం చేసుకునే కార్మికులకు ఎందుకీ అన్యాయం అన్నది ప్రశ్నార్థకంగా మారింది.


రెండు, మూడు నిమిషాలు ఆలస్యమైనా..

గ్రేటర్‌లో 18 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులున్నారు. 930 మంది శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఎ్‌ఫఏ) కార్మికుల పనితీరును పర్యవేక్షించడంతోపాటు.. నిత్యం రెండుసార్లు బయోమెట్రిక్‌ యంత్రం ద్వారా హాజరు తీసుకుంటారు. ఆ వివరాలు ఆటోమేటిక్‌గా కేంద్ర కార్యాలయంలోని ఐటీ విభాగంలో నమోదవుతాయి. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య, రెండో విడతగా మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్య హాజరు తీసుకోవాలన్నది నిబంధన. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్మికులు పని చేయాలి. ప్రధాన రహదారులపై మధ్యాహ్నం నుంచి పని చేసే కార్మికులకు మధ్యాహ్నం 2 నుంచి 3, రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య హాజరు తీసుకుంటారు. నిర్ణీత సమయం దాటిన(ఉదయం 6, మధ్యాహ్నం 1) అనంతరం యంత్రం పని చేయదు. పలు సర్కిళ్లకు సుదూర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుంటారు.


సమయానికి బస్సులు లేక రెండు, మూడు నిమిషాలు ఆలస్యమైనా మొదటి దఫా హాజరు వేసుకునే అవకాశం ఉండడం లేదు. కొందరు కార్మికుల వేలిముద్రలు సరిగా లేక యంత్రం గుర్తించడం లేదు. వేలి ముద్రలు పని చేయని కార్మికుల ఫొటోలను రెండు పర్యాయాలు తీసి అధికారులుండే గ్రూపులో పోస్ట్‌ చేస్తే గతంలో హాజరు వేసేవారు. ఆలస్యంగా వచ్చిన వారికి సంబంధించి ఉదయం తీసిన ఫొటో, రెండో విడత హాజరు ఆధారంగా విధులకు హాజరైనట్టు పరిగణించే వారు. దసరా, దీపావళి, రంజాన్‌ తదితర పండుగలు, ఆదివారం ఒకేసారి హాజరు తీసుకున్నా గతంలో ఆమోదించే వారని కార్మికులు చెబుతున్నారు.


గత రెండు నెలలుగా పరిస్థితి పూర్తిగా మారింది. విధులకు హాజరైనా ఆయా కారణాలతో కార్మికులకు గైర్హాజరు వేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో యంత్రం  పని చేయకున్నా అదే పరిస్థితి. దీంతో కొందరు కార్మికులకు ప్రతి నెలా రూ.3 నుంచి రూ.5 వేల వరకు వేతనాల్లో కోత పడుతోంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఇప్పటికే వేతనాల చెల్లింపు బిల్లులు సిద్ధమయ్యాయి. మే 1, 2 తేదీల్లో ఖాతాల్లో జమకానున్నాయి. అయితే కొన్ని సర్కిళ్లలో భారీగా కోతలు విధించినట్లు సమాచారం. రూ.14 వేలకుగాను రూ.8-10 వేలు మాత్రమే చెల్లించాలని నిర్ణయించడం గమనార్హం. మార్చి నెలలోనూ రూ.1000 నుంచి రూ.3వేలు కొందరు కార్మికులకు కట్‌ చేశారు.


అడిగిన మొత్తం ఇవ్వకుంటే..

బోగస్‌ కార్మికుల ఏరివేత, పారిశుధ్య నిర్వహణ మెరుగపర్చేందుకు బయో మెట్రిక్‌ యంత్రం హాజరు విధానం అమలు చేస్తున్నారు. గతంలో కొందరు శానిటరీ సూపర్‌ వైజర్లు, ఎస్‌ఎఫ్‌ఏలు విధులకు రాని కార్మికులకు హాజరు వేసేవారు. బంధువుల పేర్లను కార్మికులుగా చూపి వేతనాలు కాజేసేవారు. ఇందులో ఏఎంఓహెచ్‌, డీసీ, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు వెళ్లేవి. ఫిర్యాదులు అందడంతో ఈ అక్రమా లకు బయోమెట్రిక్‌ హాజరు ద్వారా చెక్‌ పెట్టే ప్రయత్నం చేశా రు. ఈ నిర్ణయం మంచిదే అయినా సాంకేతిక, ఇతరత్రా కారణాల సాకుతో విధులకు వచ్చిన వారి వేతనాలు కట్‌ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో గ్రూప్‌ నుంచి ప్రతి నెలా రూ.1000 ఇవ్వాల్సిందే అని అల్టిమేటం జారీ చేస్తోన్న కొందరు ఏఎంఓహెచ్‌లు.. అడిగిన మొత్తం ఇవ్వని ఎస్‌ఎఫ్‌ఏల పరిధిలోని కార్మికులకు హాజరు వేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ’కేంద్ర కార్యాలయంలోని ఐటీ విభాగానికి డబ్బులు పంపాలి. అప్పుడే హాజరు సక్రమంగా పడుతుంది. మీరు ఇవ్వనంత కాలం ఈ కోతలు తప్పవు’ అని ఏఎంఓహెచ్‌ ఒకరు ఎస్‌ఎఫ్‌ఏతో పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2022-04-25T18:19:28+05:30 IST