KCR సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. GHMC అలసత్వం.. థీమ్ ఇదేం జాము..!?

ABN , First Publish Date - 2022-05-01T13:43:19+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే విషయాల్లోనూ జీహెచ్‌ఎంసీ అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. క్రమం తప్పకుండా

KCR సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. GHMC అలసత్వం.. థీమ్ ఇదేం జాము..!?

  • నత్తనడకన పార్కుల అభివృద్ధి
  • అధికారుల నిర్లక్ష్యమే కారణం  
  • మూడేళ్లు దాటినా కనిపించని పురోగతి
  • ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చినవి 19 మాత్రమే 
  • టెండర్‌ దశలోనే కొన్ని పార్కులు

హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే విషయాల్లోనూ జీహెచ్‌ఎంసీ అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. క్రమం తప్పకుండా ఉన్నతస్థాయి సమీక్షలు జరిగే పనులు తప్ప.. మిగతా విషయాలను అంతగా పట్టించుకోవడం లేదు. ఇందుకు థీమ్‌ పార్కుల అభివృద్ధిలో జరుగుతోన్న జాప్యమే నిదర్శనం. మహానగరంలో 57 థీమ్‌ పార్కులను దశల వారీగా అభివృద్ధి చేయాలని నాలుగేళ్ల క్రితం నిర్ణయించారు. ఇందుకు రూ.131 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. రెండేళ్లలో పార్కుల అభివృద్ధి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 


అయితే, ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చినవి కేవలం 19 మాత్రమే. పార్కుల్లో పాత్‌ వేలు, ఇతరత్రా సివిల్‌ పనులు ఇంజనీరింగ్‌ విభాగం చేస్తుండగా.. ప్లాంటేషన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటివి అర్బన్‌ బయో డైవర్సిటీ అధికారులు చేస్తున్నారు. ఎక్కువ సమయం పట్టే సివిల్‌ పనుల ఆలస్యంతో ప్రజలకు పార్కులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి. నత్తకు నడక నేర్పుతోన్న పనులు ఇలానే సాగితే.. మరో రెండేళ్లయినా పూర్తయ్యే పరిస్థితి లేదని యూబీడీ విభాగం వర్గాలూ అంగీకరిస్తున్నాయి. కరోనా ప్రభావంతో కొన్ని రోజులు పనులపై ప్రభావం పడినా.. ఆ తర్వాత కూడా పుంజుకున్న దాఖలాలు లేవు. సివిల్‌ పనులు ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించినవి అని యూబీడీ అధికారులు, ఈ పనులు అంత ముఖ్యమా అన్న ధోరణిలో ఇంజనీరింగ్‌ అధికారులు వ్యవహరిస్తుండడంతో పనుల్లో పురోగతి నామమాత్రంగా ఉంది.


ఇంకా టెండర్‌ దశలో..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నివేదికలో హైదరాబాద్‌లో పచ్చదనం 148 శాతం పెరిగిందని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల వల్లే ఈ పెరుగుదల అన్నది అధికారుల అభిప్రాయం. మొక్కలతోపాటు వివిధ థీమ్‌లతో పార్కులు అభివృద్ధి చేయాలని 2019లో నిర్ణయించారు. ఢిల్లీ, బెంగళూరు, ఇండోర్‌లో పర్యటించిన అధికారుల బృందం ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా థీమ్‌లను డిజైన్‌ చేసింది. ప్రతిపాదిత పార్కుల్లో సగం పూర్తయినా నగరంలో గ్రీనరీ మరింత పెరిగేది. 


ఇప్పటికే ఉన్న పార్కుల్లో కొంత మేర స్థలంలో సందర్శకులను ఆకట్టుకునేలా, వాకర్లకు ఉపయోగపడేలా, పిల్లలు ఆడుకునేలా థీమ్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఖాళీ స్థలాల్లో ఈ తరహా పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికీ దాదాపు 15కుపైగా పనులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తి కాలేదని ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌బీనగర్‌ జోన్‌లో అత్యధికంగా 16, ఖైరతాబాద్‌లో 15, శేరిలింగంపల్లిలో 11, సికింద్రాబాద్‌లో 8,  కూకట్‌పల్లిలో 6, చార్మినార్‌లో మూడు థీమ్‌ పార్కులున్నాయి. శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌, ఎల్‌బీనగర్‌,  ఖైరతాబాద్‌ జోన్లలో పలుపార్కులు అందుబాటులోకి వచ్చాయి.


ఇవీ థీమ్‌లు..

సైన్స్‌ 

ఎకో 

బతుకమ్మ

వండర్‌ 

నాలెడ్జ్‌

జపనీస్‌

మొఘల్‌ గార్డెన్‌

నిజాం శాంతి 

ఫౌంటెయిన్‌ 

రాక్‌ గార్డెన్‌ 

పంచతత్వ


ప్రతిపాదిత థీమ్‌ పార్కులు - 57

పూర్తయినవి - 19

Updated Date - 2022-05-01T13:43:19+05:30 IST