‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌ ఎడిటర్‌..సీనియర్‌ జర్నలిస్ట్‌ రామకృష్ణ కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-06T09:13:01+05:30 IST

సీనియర్‌ పాత్రికేయుడు, ‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌ ఎడిటర్‌ భళ్లమూడి రామకృష్ణ (54) ఇక లేరు. నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది

‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌ ఎడిటర్‌..సీనియర్‌ జర్నలిస్ట్‌ రామకృష్ణ కన్నుమూత

మూడు దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో కృషి

సహోదోగ్యులు, పాత్రికేయ మిత్రుల కన్నీటి నివాళి


హైదరాబాద్‌ సిటీ, మే 5 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ పాత్రికేయుడు, ‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌ ఎడిటర్‌ భళ్లమూడి రామకృష్ణ (54) ఇక లేరు. నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినప్పటికీ ఉపయోగం లేకపోయింది. గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ప్రింట్‌ మీడియాలోనే కాక, ఎలకా్ట్రనిక్‌ మీడియాలోనూ సత్తా చాటిన రామకృష్ణస్వస్థలం.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలి. అదే ప్రాంతంలోని సంస్థానం హైస్కూల్లో ఆయన పాఠశాల విద్య పూర్తిచేశారు. స్థానిక మహారాజా కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం భువనేశ్వర్‌లోని ఉత్కళ్‌ యూనివర్సిటీ నుంచి భౌతికశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పొందారు. రామకృష్ణ తండ్రి నారాయణరావు కాలేజీ లెక్చరర్‌గా, ఇంగ్లిషు భాషపై సాధికారత కలిగిన వ్యక్తిగా బొబ్బిలివాసులకు సుపరిచితులు. తన తండ్రి ప్రోత్సాహంతోనే రామకృష్ణ తెలుగు, ఆంగ్ల భాషా సాహిత్యాలను ఆసక్తిగా చదివారు. ఆపై పాత్రికేయ వృత్తిపై మక్కువతో 1993లో ఈనాడులో చేరారు. అనంతరం ఈటీవీ, ఎన్టీవీ, ఐ న్యూస్‌, వీ6 తదితర వార్తాచానళ్లలో అవుట్‌పుట్‌ ఎడిటర్‌గా సేవలందించారు. ఆంగ్ల పత్రికలైన డెక్కన్‌ క్రానికల్‌, హాన్స్‌ ఇండియాలో రామకృష్ణ కొంతకాలం పనిచేశారు. 


నాలుగేళ్లుగా ‘ఆంధ్రజ్యోతి’లో న్యూస్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషలపై అపారమైన పట్టు ఉండడంతో.. ఒకవైపు అంతర్జాతీయ వ్యవహారాలపై చక్కటి విశ్లేషణలు చేస్తూనే మరోవైపు సహస్రావధానాల గురించి కూడా అంతకు మించిన సాధికారికతతో వ్యాసాలు రాసేవారు. ఆంగ్ల సాహిత్యంపైనా ఆయనకు మంచి అభినివేశం ఉంది. రామకృష్ణకు భార్య వందన, కుమార్తె శ్రీలాస్య ఉన్నారు. రామకృష్ణ తల్లి వైజాగ్‌లోని తన పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నారు. కరోనా కష్టకాలంలో తన చిన్నకొడుకుని చివరిసారిగా చూసుకోలేని ఆ తల్లి గుండెకు పెద్దకష్టమే ఎదురైంది. రామకృష్ణ భౌతికకాయానికి హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశానవాటికలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. తెలుగు, ఆంగ్ల పాత్రికేయ రంగంలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రామకృష్ణ మృతి పట్ల ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం, ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌, సిబ్బంది సంతాపం తెలిపారు. రామకృష్ణ సహోద్యోగులతో పాటు బూదరాజు రాధాకృష్ణ శిష్యబృందం, అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ విశ్రాంత పీఆర్వో ఎస్‌.రాము ఆయనకు నివాళులర్పించారు. ఆయనతో తమకున్న ఆత్మీయానుబంధాన్ని గుర్తుచేసుకొని, కన్నీటిపర్యంతమయ్యారు. భళ్లమూడి రామకృష్ణ మృతి పట్ల ప్రెస్‌క్లబ్‌ కార్యనిర్వాహక వర్గం సంతాపం ప్రకటించింది. మరోవైపు.. ‘ఆంధ్రజ్యోతి’ ఖమ్మం యూనిట్‌ కార్యాలయంలో టెక్నికల్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఆదిరాజు సూర్యమోహన్‌ కరోనాతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. 

Updated Date - 2021-05-06T09:13:01+05:30 IST