ఇక బంగారు భారత్‌!

ABN , First Publish Date - 2022-02-22T06:56:56+05:30 IST

తెలంగాణ తరహాలో దేశమంతా అభివృద్ధి చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి

ఇక   బంగారు భారత్‌!

  • బంగారు తెలంగాణ తరహాలో నిర్మిస్తాం.. అందుకోసమే జాతీయ రాజకీయాల్లోకి
  • అన్నింటా తెలంగాణ నంబర్‌ వన్‌
  • దేశం కోసం పోరాటానికి వెళుతున్నా
  • రాష్ట్ర ప్రజల దీవెనలు కావాలి
  • అమెరికా కంటే గొప్ప దేశం కావాలి
  • విదేశీయులకు మనం ఉపాధి కల్పించాలి
  • కుల, మత విద్వేషాలతో ఉపాధికి గండి
  • ఈ రాజకీయాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి
  • 75 ఏళ్లలో లేనంతటి దుర్మార్గపు పాలన
  • మోదీ సర్కారుపై సీఎం కేసీఆర్‌ నిప్పులు
  • బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన
  • సంగారెడ్డి జిల్లాకు రూ.140 కోట్లు
  • 24 గంటల్లో జీవో విడుదలకు ఆదేశం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి)

తెలంగాణ తరహాలో దేశమంతా అభివృద్ధి చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రానున్న రోజుల్లో తాను జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు చెప్పారు. అందుకు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. వలస పాలనను బద్దలు కొట్టి స్వరాష్ట్రం సాధించామని, అభివృద్ధి పథంలో దూసుకుపోయి బంగారు తెలంగాణ నిర్మించుకున్నామని చెప్పారు. రాష్ట్రం ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదని.. దేశాన్ని కూడా బంగారు భారతదేశంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.


75 ఏళ్లలో లేనంత దుర్మార్గపు పాలన ఇప్పుడు కేంద్రంలో సాగుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు. కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టి రాజకీయాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. కుల, మత రాజకీయాలపై  ప్రతీ గ్రామంలో చర్చ జరగాలని ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ఐటీ రంగంలో అభివృద్ధి చెందడంతో 15 లక్షల మంది  ఉద్యోగాలు చేసుకుంటున్నారని ప్రస్తావించారు. జహీరాబాద్‌ సమీపంలో నిమ్జ్‌ ఏర్పాటైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కులాలు, మతాల పేరిట విద్వేషాలు రగిలించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పరిశ్రమలు వస్తాయా..? అని ప్రశ్నించారు.


తెలంగాణ తరహాలో ఇండియాను అభివృద్ధి చేసే అంశంపై జాతీయ రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నామని చెప్పారు. భారత్‌ను అమెరికా కన్నా గొప్ప దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లడం కాదని, ఇతర దేశాల వారికి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. దేశం కోసం పోరాటానికి బయల్దేరుతున్నానని, ప్రజల దీవెనలు కావాలని కోరారు.


దేశంలోనే నెంబర్‌వన్‌

తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నామని ప్రస్తావించారు. ఆసరా పెన్షన్‌ రూ.2 వేలు, ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష, విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసం అంబేద్కర్‌, జ్యోతిబాపూలే పేరిట రూ.20 లక్షల స్కాలర్‌షిప్‌ ఇస్తున్న ప్రభుత్వం మరేదీ లేదని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అడిగి తెలుసుకున్నారని కేసీఆర్‌ వెల్లడించారు. తమ సరిహద్దు గ్రామాల ప్రజలు రైతు బంధు, రైతు బీమా కావాలని అడుగుతున్నారని ఆయనే చెప్పారని ప్రస్తావించారు.


కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావస్తున్నదని, సంగారెడ్డి జిల్లాకు నీళ్లు తీసుకువచ్చి సస్యశ్యామలం చేయనున్నామని కేసీఆర్‌ ప్రకటించారు. 4 లక్షల ఎకరాల సాగునీరు ఇచ్చేందుకు రూ.4 వేల కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశామని వివరించారు. ఆందోల్‌ నియోజకవర్గంలోనే 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎత్తిపోతల పథకాలను ఏడాదిన్నరలో పూర్తి చేయించి పొలాలకు నీరు చేరేలా చూడాలని హరీశ్‌రావుకు సూచించారు.


హరీశ్‌ బాగా హుషారు

మంత్రి హరీశ్‌రావు బాగా హుషార్‌గా ఉన్నారని కేసీఆర్‌ ప్రశంసించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల శంకుస్థాపనకు రావాలని తనను కోరారని, నిధులేమీ అడగనని కూడా చెప్పారని ప్రస్తావించారు. తీరా సభకు చేరుకున్నాక కోరికల చిట్టాతో దుకాణం పెట్టిండని చమత్కరించారు. హరీశ్‌ కోరిక మేరకు సంగారెడ్డి, జహీరాబాద్‌ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున, జిల్లాలోని మిగిలిన 6 మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాలోని 699 పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున రూ.140 కోట్లను విడుదల చేస్తూ రేపే జీవో విడుదల చేస్తామన్నారు. వచ్చే వారం మళ్లీ వస్తానని, సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీని ప్రారంభిస్తానని చెప్పారు. 





కేసీఆర్‌ అడుగు పెడితే సస్యశ్యామలమే: హరీశ్‌ 

రామాయణంలో రాముడు అడుగు పెడితే రాయి మనిషిగా మారినట్టు సీఎం కేసీఆర్‌ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సస్యశ్యామలం అవుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. 2-3 ఏళ్లకోసారి భారీ వర్షాలు వస్తే మంజీరా నీళ్లు గోదావరిలో కలుస్తున్నాయని, గోదావరికి చేరిన నీళ్లను వెనక్కి మళ్లించి జిల్లాకు సరఫరా చేస్తున్న భగీరథుడు కేసీఆర్‌ అని పేర్కొన్నారు. గోదావరి నీటిని మల్లన్నసాగర్‌ ద్వారా సింగూరులోకి నింపుతామని చెప్పారు.





గుండెపోటుతో ఇద్దరు మృతి

నారాయణఖేడ్‌: సీఎం కేసీఆర్‌ సభకు వస్తున్న ఇద్దరు గుండెపోటుతో మృతి చెందారు. అందోల్‌ నియోజకవర్గం రేగోడు మండలం పెద్దతండాకు చెందిన శాంతాబాయి(42), టేక్మాల్‌ మండలం ఎల్లంపల్లికి చెందిన కొండిలింగం సీఎం సభకు పెట్టిన బస్సుల్లో వస్తూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించారు.

Updated Date - 2022-02-22T06:56:56+05:30 IST