Abn logo
Apr 16 2021 @ 23:28PM

దారుణం

ఇక రైతుకు సహకారం అనుమానమే

రుణాల మంజూరుకు కొత్త నిబంధనలు

వాణిజ్య బ్యాంకులకు మించి అమలు

ఈసీ, ఒరిజినల్‌ వన్‌బీ, అడంగళ్‌, డిక్లరేషన్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం నకలు

సహకార సంఘాలకు సమర్పించాలి

అన్నదాతకు తప్పని పాట్లు 


చోడవరం, ఏప్రిల్‌ 16: సాగులో అన్నదాతకు అండగా నిలిచి, వడ్డీ వ్యాపారుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రాథమిక సహకార పరపతి సంఘాలను ఏర్పాటుచేసింది. ఏటా రైతులకు వ్యవసాయ రుణాలను అందిస్తూ, పంట చేతికందిన తరువాత తక్కువ వడ్డీతో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ వస్తోంది. అయితే తాజాగా సహకార రుణానికీ వాణిజ్య బ్యాంకులను మించిన విధంగా నిబంధనలు విధించడంతో ఇక రైతుకు రుణం లభించడం దుర్లభమనే వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకూ సహకార సంఘాల పరిధిలోని రైతులకు అర్హత మేరకు ఎంత రుణం ఇవ్వవచ్చో కార్యదర్శులు లెక్కకట్టి...పంట కాలానికి ముందు బ్యాంకు అధికారులకు అందజేసేవారు. దాని ఆధారంగానే సహకార సంఘాల నుంచి రైతులు రుణం తీసుకోవడం, తిరిగి చెల్లించడం జరుగుతోంది. రైతుల క్రెడిట్‌ లిమిట్‌ ఆధారంగానే కేంద్ర సహకార బ్యాంకు సంఘాలకు రుణం మంజూరుచేసేది. రైతుకు వున్న భూ విస్తీర్ణాన్ని బట్టి అధికారులు 7 శాతం వడ్డీకి  రుణం అందించేవారు. ఇందులో 1.75 శాతం సహకార సంఘం, 5.75 శాతం కేంద్ర సహకార బ్యాంకుకు జమయ్యేది. ప్రభుత్వం పావలా వడ్డీ రాయితీని అందిస్తే అది నేరుగా రైతు ఖాతాకు చేరేది. 


బెంబేలెత్తిస్తున్న కొత్త నిబంధనలు 

రైతులకు రుణాలు అందించే విషయంలో ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రుణం కావలసిన ప్రతి రైతు ఈసీ (ఎంబరెన్స్‌ సర్టిఫికెట్‌), వన్‌బీ, అడంగళ్‌, డిక్లరేషన్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం నకలు సహకార సంఘాలకు సమర్పించవలసి ఉంటుంది. పట్టాదారు పాస్‌ పుస్తకం వరకూ ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, ఈసీ, అలాగే డిజిటల్‌ సంతకంతో కూడిన వన్‌బీ, అడంగళ్‌ను సమర్పించడం అంత తేలిక కాదు. డిజిటల్‌ సంతకంతో ఒరిజినల్‌ వన్‌బీ కోసం రైతు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడం వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. అలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈసీ చేతికి రావాలంటే అంత సులభం కాదు. ఒకే సర్వే నంబర్‌లో ఎక్కువ మంది రైతులు ఉండి, అందులో ఎవరైనా రైతుకు సంబంధించిన భూ వివాదం ఉంటే, మిగిలిన రైతులకు ఈసీ రావడం చాలాకష్టం. అలాగే రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భూమి తనఖా పత్రం సకాలంలో చేతికి అందడం కూడా అనుమానమే. ఈ పత్రాలన్నీ రైతులు తెచ్చుకోవాలంటే తక్కువలో తక్కువగా కనీసం రూ.2 వేల నుంచి 3 వేల రూపాయలపైబడి ఖర్చవుతుంది. అంత ఖర్చు పెట్టి...ఆ పత్రాలన్నీ సహకార సంఘాలకు ఇచ్చినా...అధికారులు ఓకే చేస్తేనే రైతుకు రుణం మంజూరవుతుంది. ఇవన్నీ పూర్తయ్యి, రుణం వచ్చేది అనుమానమేనన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతున్నది. ఇప్పటివరకూ క్షేత్రస్థాయిలో పంటలతో సంబంధం లేకుండా సహకార సంఘాలు రైతులకు భూపరిమితిని బట్టి ఉదారంగా రుణాలు ఇచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం ఈ క్రాప్‌లో నమోదైన పంట ప్రకారం రుణం మంజూరుచేస్తామని చెబుతుండడంతో సంఘాల నుంచి ఆశించిన స్థాయిలో రుణం దక్కడం అనుమానమేనంటున్నారు. తాజా షరతులతో గతంలో రూ.లక్ష రుణం తీసుకున్న రైతుకు ఇప్పుడు అందులో సగం కూడా అందే అవకాశం లేదంటున్నారు. 


మళ్లీ వడ్డీ వ్యాపారుల చెంతకు

సహకార సంఘాల నుంచి రుణం మంజూరు కానిపక్షంలో రైతులు పెట్టుబడుల కోసం మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దీనివల్ల సహకార సంఘాల ప్రాథమిక లక్ష్యం దెబ్బతింటుంది. వెబ్‌ల్యాండ్‌లో వివరాల ఆధారంగా రుణ మంజూరు ప్రక్రి యను సులభతరం చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement