ఇక ఆర్గానిక్‌ శ్రీవారి లడ్డూ

ABN , First Publish Date - 2022-04-10T07:51:25+05:30 IST

శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక పూర్తిగా సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేయనున్నట్టు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.

ఇక ఆర్గానిక్‌ శ్రీవారి లడ్డూ
స్టాల్స్‌లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న జవహర్‌రెడ్డి

సేంద్రీయ ఉత్పత్తులతో లడ్డూ తయారీకి టీటీడీ సుముఖం

రాయలసీమ ఆర్గానిక్‌ మేళాలో ఈవో జవహర్‌రెడ్డి 


తిరుపతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ ప్రసాదం ఇక పూర్తిగా సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేయనున్నట్టు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.  శనివారం తిరుపతిలోని ఇస్కాన్‌ మైదానంలో గోఆధారిత వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్‌ సంయుక్తంగా మూడ్రోజులపాటు నిర్వహించిన రాయలసీమ సేంద్రియ మేళాలో ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన ఆర్గానిక్‌ శనగపప్పును సేంద్రియ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తీవ్ర వర్షాల కారణంగా కేవలం రెండు వేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. భవిష్యత్‌లో సేంద్రియ రైతులు సహకరిస్తే శ్రీవారి భక్తులకు అందించే అన్నప్రసాదాలు కూడా సేంద్రీయ ఉత్పత్తులతోనే తయారు చేస్తామన్నారు. ఎస్వీ గోశాలలోనూ త్వరలో చిన్న నెయ్యి తయారీ యూనిట్‌, పంచగవ్య ఉత్పత్తులతో గోఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తామన్నారు. ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోశాలలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వివరించారు. టీటీడీ దేశీ ఆవుల పెంపకంపై దృష్టి సారించిందన్నారు. సేంద్రియ మేళా ముఖ్య నిర్వాహకుడు కుమారస్వామి, సేంద్రియ రైతులు, సహజ వ్యవసాయ నిపుణులు పాల్గొన్నారు. అంతకుముందు 70 స్టాల్స్‌ను ఈవో సందర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు నుంచి వచ్చిన స్టాల్‌ నిర్వాహకులతో మాట్లాడి.. ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నారు. ఆదివారంతో ఈ మేళా ముగియనుంది. 

Updated Date - 2022-04-10T07:51:25+05:30 IST