కంపెనీ కంట్లో ‘ఇసుక’!

ABN , First Publish Date - 2022-08-12T08:40:22+05:30 IST

కంపెనీ కంట్లో ‘ఇసుక’!

కంపెనీ కంట్లో ‘ఇసుక’!

3 జిల్లాలను దున్నేస్తున్న ‘ఒక్కడు’

సర్కారు ఆదాయానికి గండి

ఆ ‘ఒక్కడికి’ తోడుగా ఎస్‌ఈబీ సీఐ

సీఎం ఆంతరంగికుడి పేరు చెప్పి దందా

ప్రశ్నించే ఉద్యోగులకు బెదిరింపులు

పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలింపు

బల్క్‌ పేరుతో రెట్టింపు ధరలు

భరించలేక లారీ డ్రైవర్ల ఆందోళన 

ఒకేసారి 65 కొత్త లారీలు కొనుగోలు!

మైనింగ్‌ ఉన్నతాధికారి కుమార్తె వివాహానికి రూ.కోటి చదివింపులు


ఒకే ఒక్కడు! మూడు జిల్లాల పరిధిలో ఇసుక సామ్రాజ్యాన్ని ఏలేస్తున్నాడు. కొలువు ఇచ్చిన కంపెనీ కంట్లోనే ఇసుక చల్లుతున్నాడు. ప్రజలకు చెందిన వనరులను దోచేస్తున్నాడు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికీ గండి కొడుతున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే... ముఖ్యమంత్రికి బాగా ఆంతరంగికుడికి తాను సన్నిహితుడినని బెదిరిస్తాడు. ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి లక్షల రూపాయల ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నాడు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం తన ఇసుక విధానంలో భాగంగా... రీచ్‌లను ఒక కంపెనీకి అప్పగించింది. ఇసుకను ఏ ధరకు అమ్మాలో కూడా నిర్దేశించింది. కానీ... ఒకేఒక్కడు అటు సర్కారు, ఇటు తన సొంత కంపెనీ కళ్లలో ‘ఇసుక’ చల్లుతున్నాడు. ఇసుక తవ్వకాలు, సరఫరా సక్రమంగా సాగేలా పర్యవేక్షించేందుకు జేపీ వెంచర్స్‌ నియమించిన ఉద్యోగి ‘సర్వం నేనే’ అంటూ చెలరేగిపోతున్నాడు. అతని అసలు పేరు ఒకటి. కానీ... ఇసుక వ్యాపారంలో మాత్రం లోకాలనేలే ఈశ్వరుడిగా సుపరిచితుడు. ఉద్యోగ రీత్యా నిత్యం సీఎంకు సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తికి తాను అనుచరుడినని, ఆయన అండదండలు పుష్కలంగా ఉన్నాయంటూ అధికారులను భయపెట్టి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల పరిధిలో ఆయన చెప్పిందే రేటు! ఈ మూడు జిల్లాల అధికారులు ఆయన చెప్పింది వినాల్సిందే. హైదరాబాద్‌, చెన్నై నగరాలకు అక్రమంగా తరలిస్తున్న దందాలో కీలక పాత్ర ఇతనిదేనని చెబుతున్నారు. అటు దుర్గి, ఇటు చిత్తూరు బోర్డర్‌లలో తన సోదరులనే పెట్టి అక్రమ దందాను బహిరంగంగానే సాగిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. దీనికి పల్నాడు జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ నేత అండదండలు ఉన్నట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా కోసం తాజాగా ఒకేసారి 65కుపైగా కొత్త లారీలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తాజాగా తాడేపల్లిలో భారీ ఖర్చుతో జరిపిన ఆయన కుమారుడి పుట్టినరోజు వేడుకకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సైతం హాజరయ్యారు. మైనింగ్‌ శాఖలో ఒక ఉన్నతాధికారి వివాహ ఖర్చుల కోసం ఇతను కోటి రూపాయలు చదివించారని ప్రచారం జరుగుతోంది. 


జీరో బిల్లింగ్‌తో కొల్లగొడుతూ...

ఇసుక తవ్వకాలకు వీరికి మైనింగ్‌ బిల్లులతో పనేలేదు. కాంట్రాక్టు సంస్థ పేరుతోనే బిల్లులు ముద్రించి వాటినే వే బిల్లుల కింద ఇస్తున్నారు. వీటితోకూడా సంబందం లేకుండా జీరో బిల్లింగ్‌ పేరుతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. జేపీ వెంచర్స్‌ పేరుతో బిల్లులు ముద్రించి చేతితో రాసి ఇస్తున్నారు. ఈ అక్రమ దందాతో అటు ప్రభుత్వ ఆదాయానికీ, ఇటు కాంట్రాక్టు సంస్థకూ తీవ్రనష్టం వాటిల్లుతోంది. మరోవైపు, నది నుంచి స్టాక్‌ పాయింట్‌కు ఇసుక తరలించే బాధ్యత వజ్ర ట్రాన్స్‌పోర్ట్‌, వర్ష ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలకు అప్పగించారని చెబుతున్నారు. అవి కూడా ఆయన సొంత వ్యక్తుల కంపెనీలే కావటంతో నది నుంచి తరలించే ఇసుక కోసం ఒక బిల్లు రాసి, దానిపై అదేరోజు ఇసుక లోడులు ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుని, చివరి లోడు స్టాక్‌ పాయింట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణ ఉంది. డెల్టా ప్రాంతంలో అక్రమ తరలింపులకు ఓ ఎస్‌ఈబీ సీఐ అండగా నిలిస్తే, అమరావతిలో అతని సొంత సోదరుడే ఉద్యోగిగా ఉండి దందా నడుపుతున్నాడని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. నది నుంచి తోలిన ఇసుకను నేరుగా అమ్మకాలు జరపకుండా ఇతరులకు బల్క్‌గా అమ్మేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇసుక టన్ను రూ. 500 చొప్పున బయటివారికి ఇచ్చేస్తున్నామని కాంట్రాక్టు సంస్థకు ఇండెంట్‌ పంపి, ఇతను మాత్రం టన్ను రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముకుంటున్నాడు. కొల్లిపర మండలం మున్నంగి దగ్గర కృష్ణా నదికి వరద వస్తుందన్న కారణంతో భారీ ఇసుక గుట్టలను ఒడ్డుకు తోలారు. ఒక్కొక్కరికి వెయ్యి నుంచి 2వేల టన్నులు బల్క్‌గా ఇచ్చేసినట్టు చూపించి, తనకు ఇష్టమొచ్చిన ధరకు అమ్మకాలు చేస్తున్నాడు. టన్ను ఇసుకకు రూ.900 రేటు నిర్ణయించటంతో మున్నంగిలో లారీ డ్రైవర్లు, కొనుగోలుదారులు ధర్నాకు దిగారు. రీచ్‌లోకి వెళ్లటానికి లేకుండా లారీలు అడ్డుగాపెట్టి రోజంతా నిరసన చేపట్టారు. కాకానిలోని ఎన్నారై ఆసుపత్రి స్టాక్‌ పాయింట్‌కు తాళ్లాయపాలెంలో బల్క్‌ మాయతో వినియోగదారునిపై అదనంగా 200పైనే భారంవేసి, ఆ డబ్బు కంపెనీకీ, ప్రభుత్వ ఖజానాకు కాకుండా సొంత ఖాతాకు జమ చేసుకున్నారు. 


కన్నెత్తి చూడని ఎస్‌ఈబీ 

వల్లభాపురం దగ్గర అశోక్‌రెడ్డి అనే వ్యక్తి పేరుపై బుసక తవ్వకాలకు అనుమతి తీసుకున్నామని అఽధికారులకు చెప్పి ఇసుక తరలిస్తున్నా ఎస్‌ఈబీ అటువైపు కన్నెత్తి చూడలేదని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. అక్రమ ఇసుక తరలింపుల కోసం బయటి లారీలు పెడితే గుట్టు బయటపడుతుందని తాజాగా గుంటూరు జిల్లాలో 25, కృష్ణాజిల్లాలో 40కొత్త లారీలు దింపేశారని, ఇది బయటకు పొక్కడంతో అసలు విష యం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్న వ్యవహారంలో ఇతని పాత్రే కీలకం. హైదరాబాద్‌, చెన్నై నుంచి రాష్ట్రానికి వచ్చే బాడీ లారీల్లో ఇసుక నింపేసి పట్టాలు కప్పి సరిహద్దులు దాటిస్తున్నారు. దుర్గి వంటి స్టాక్‌ పాయింట్‌లకు ఇసుక తరలిస్తున్నట్టు చూపించి, తెలంగాణ లారీలకు సరిహద్దుల్లోనే లోడ్‌చేసి పంపుతున్నారని సమాచారం. రోజుకు వందల సంఖ్యలో లారీల ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి.  

Updated Date - 2022-08-12T08:40:22+05:30 IST