Jul 7 2021 @ 00:53AM

ఇక రద్దీని బట్టి.. సినిమా టికెట్‌ ధరలు!

ఒకే ధరకు స్వస్తి 

ఎగ్జిబిటర్ల వినతిపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం


రాష్ట్రంలోని సినిమా థియేటర్ల టికెట్ల ధరలు ఇక రద్దీ ఆధారంగా మారతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి నాటి చంద్రబాబు సర్కారు ఎగ్జిబిటర్లకు అనుమతివ్వలేదు. దాంతో వారు కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుని ధరలు పెంచుకున్నారు. కొన్ని నెలల క్రితం విడుదలైన వకీల్‌ సాబ్‌ సినిమా విషయంలో ఎగ్జిబిటర్లు ఎంత బతిమాలినా రాష్ట్రప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచడానికి ససేమిరా అంది. ఆ తర్వాత పలువురు సినీ పెద్దలు థియేటర్లలో టికెట్ల ధరలు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా అనుమతించాలని కోరారు. కర్ణాటకలో శుక్ర, శని, ఆదివారాల్లో టికెట్‌ ధరలు రెట్టింపు ఉంటాయి. సోమ, మంగళవారాల్లో ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితంగా ఇస్తారు. బుధవారమైతే ఒకటికి రెండు ఫ్రీ ఆఫర్‌ ఉంటుంది. ఏపీ, తెలంగాణలో పెద్ద సినిమాలకు అదనపు ఆటలు, రెండు వారాల వరకూ రెట్టింపు ధరలు అనుమతివ్వాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విన్నవించడం లేదా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవడం జరుగుతోంది. మిగతా సమయాల్లో ప్రభుత్వ ఫిక్స్‌డ్‌ ధరలు ఏ, బీ, సీ సెంటర్లలో ఉంటాయి. ఇకపై రాష్ట్రంలో ఈ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.