అంతా మా ఇష్టం!

ABN , First Publish Date - 2022-05-19T03:53:35+05:30 IST

అది మూడన్నరేళ్ల క్రితం పూర్తి కావాల్సిన రోడ్డు.. కానీ నేటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు దఫాలు గడువు పొ

అంతా మా ఇష్టం!
నెల్లూరు - కోడూరు రోడ్డులో జరుగుతున్న పనులు


ఆర్‌అండ్‌బీ శాఖలో అధికారుల తీరు

నెల్లూరు - కోడూరు రోడ్డుకు అంచనాల పెంపు

సీసీ రోడ్డుకు కూడా వెట్‌మిక్స్‌..!

ఖజానాపై రూ.88 లక్షల భారం

నెల్లూరు, మే 18 (ఆంధ్రజ్యోతి) :

అది మూడన్నరేళ్ల క్రితం పూర్తి కావాల్సిన రోడ్డు.. కానీ నేటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే నాలుగు దఫాలు గడువు పొడగించారు. కానీ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ పనికి అంచనా పెంచడంతో పాటు సీసీ రోడ్డుకు కూడా వెట్‌మిక్స్‌ వేస్తారట.. ఫలితంగా దాదాపు రూ.88 లక్షల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడింది. ఇది ఎవరి స్వప్రయోజనాల కోసమోనని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఇదీ నెల్లూరు - కోడూరు మధ్య జరుగుతున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు నిర్మాణ తీరు. 


నెల్లూరు-కోడూరు మధ్య (అల్లీపురం మీదుగా) రోడ్డు దారుణంగా దెబ్బతినింది. దీంతో గత ప్రభుత్వంలో సింగిల్‌ లేన్‌గా ఉన్న రోడ్డును డబుల్‌ లేన్‌గా మార్చతూ జీరో కిలో మీటర్‌ నుంచి 6/4 కిలోమీటర్‌ వరకు అభివృద్ధికి రూ.10 కోట్లతో టెండర్లు పిలిచారు. అందులో 1.70 కిలోమీటర్లు సీసీ(సిమెంటు) రోడ్డు కాగా మిగిలినది బీటీ(తారు) రోడ్డు. 2017లో టెండర్‌ పిలవగా ఓ సంస్థ 4.69 శాతం ఎక్సెస్‌కు పనులు దక్కించుకుంది. అగ్రిమెంట్‌ పూర్తి చేసుకుంది. దీని ప్రకారం 2018 అక్టోబరులోపు రోడ్డు నిర్మాణం జరిగిపోవాలి. కానీ ఆ లోపు పనులు పూర్తి కాకపోవడంతో ఆరు నెలల పాటు గడువు పొడగింపు (ఈవోటీ) ఇచ్చారు. ఇలా నాలుగు సార్లు ఈవోటీలు ఇవ్వగా గతేడాది అక్టోబరుతో చివరి ఈవోటీ గడువు ముగిసింది. అయినప్పటికీ పనులు పూర్తి కాలేదు.  ఇప్పుడు మరో ఈవోటీ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 

వెట్‌మిక్స్‌ పేరుతో పెంపు

ఏ వర్కుకైనా ఒకసారి అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాక దాని ప్రకారమే నడుచుకోవాలి. కానీ నెల్లూరు-కోడూరు రోడ్డు పనుల్లో అధికారులు నిబంధనలను పక్కన పెట్టి అంతా మాఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ రోడ్డులో భారీ గుంతలు ఏర్పడ్డట్లు చూపిస్తూ అదనంగా వెట్‌మిక్స్‌ వేయాలని నిర్ణయించి వర్కు అంచనాకు అదనంగా మరో రూ.88 లక్షలు పెంచారు. టెండర్‌ పిలిచినప్పుడు 5,670 క్యూబిక్‌ మీటర్లు వెట్‌మిక్స్‌ అంచనా వేయగా తాజాగా దానిని 10,258 క్యూబిక్‌ మీటర్లకు పెంచారు. అందులోనూ వెట్‌మిక్స్‌ ఉపయోగించని సీసీ రోడ్డుకు వెట్‌మిక్స్‌ వేసేలా అంచనాలు తయారు చేయడం విడ్డూరంగా ఉంది. గతేడాది వరదలొచ్చే సమయానికి కాంట్రాక్టర్‌కు గడువు ముగిసింది. అందులోనూ నెల్లూరు - కోడూరు రోడ్డు పెద్దగా వరదల ప్రభావానికి గురికాలేదు. అయినప్పటికీ వెట్‌మిక్స్‌ రూపంలో అంచనా పెంచడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా అర్థాంతరంగా అంచనాలు పెంచడం నిబంధనలకు విరుద్ధమని పలువురు అధికారులు సూచించినప్పటికీ ఇద్దరు అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ఎస్టిమేషన్‌ తయారు చేసినట్లు ఆర్‌అండ్‌బీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లా సర్కిల్‌ కార్యాలయంలో సరైన పద్ధతిలో ఈ ఫైల్‌ నడవలేదని, రాష్ట్ర ఉన్నతాధికారుల ద్వారా ఈ అంచనాలను ఆమోదించేశారని సమాచారం. ఈ తప్పిదాలన్నింటికీ వివరణ కోరుతూ సర్కిల్‌ కార్యాలయం నుంచి నెల్లూరు డివిజన్‌ కార్యాలయానికి మార్చిలో మెమో వెళ్లిందని, కానీ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలియదని పలువురు ఉద్యోగులు గుసగుసలాడుకుంటుండడం కొసమెరుపు. 


సైట్‌ కండిషన్స్‌ బట్టి మార్పు 

నెల్లూరు-కోడూరు రోడ్డుకు సంబంధించి ఎస్టిమేషన్లలో మార్పు చేయలేదు. మొదట వర్కింగ్‌ ఎస్టిమేషన్‌ రూ.10 కోట్లకు అప్రూవల్‌ చేశారు. దానిని తర్వాత రూ.10.60 కోట్లతో సవరించారు. ఆ మొత్తానికి లోబడే సైట్‌ కండీషన్స్‌ను బట్టి ఇప్పుడు మార్పులు చేశాం. వెట్‌మిక్స్‌ పెంచినా రోడ్డుకే వాడుతారు. ఏడాదన్నరగా పేమెంట్‌ కాకపోవడంతో పని జరగలేదు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఆరోపణలన్నీ అవాస్తవం. 

- రామాంజనేయులు, ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి ఎస్‌ఈ













Updated Date - 2022-05-19T03:53:35+05:30 IST