TDP కార్యాలయంపై దాడి.. కర్త, కర్మ, క్రియ ఇతనేనా..!?

ABN , First Publish Date - 2021-10-21T06:49:54+05:30 IST

బెజవాడలో రౌడీ సంస్కృతి.. ఒకనాటి మాట.

TDP కార్యాలయంపై దాడి.. కర్త, కర్మ, క్రియ ఇతనేనా..!?
టీడీపీ కార్యాలయంపై దాడి చేసినవారిలో వైసీపీ కార్పొరేటర్‌ అరవ సత్యం

  • దౌర్జన్య రాజ్యం!
  • అంతరించిన నేర సంస్కృతికి మళ్లీ ప్రాణం
  • వైసీపీ హయాంలో రౌడీయిజానికి ఊపిరి
  • బెజవాడలో రెచ్చిపోతున్న రౌడీ మూకలు
  • రాజకీయాల ముసుగులో అరాచకవాదులు
  • టీడీపీ కార్యాలయంపై దాడితో తెరపైకి రౌడీ రాజకీయం
  • దాడిలో కీలక పాత్రధారి వైసీపీ కార్పొరేటర్‌
  • ప్రెస్‌మీట్‌ రద్దు చేసుకుని దాడులకు తెగబడిన వైనం

బెజవాడలో రౌడీ సంస్కృతి.. ఒకనాటి మాట. రెండు ముఠాల నడుమ ఆధిపత్య పోరు.. దానిలో భాగంగా జరిగిన అల్లర్లు.. దానికి పరాకాష్ఠగా జరిగిన హత్యలు.. అన్నింటినీ విజయవాడ నగరం దాదాపు మరచిపోయింది. వ్యాపారులను బెదిరించి వసూళ్లు చేయడం, ఖరీదైన స్థలాలను కబ్జా చేయడం.. ఇవన్నీ మూడున్నర దశాబ్దాల క్రితం బెజవాడలో సాగిన అకృత్యాలు. కాలంతో పాటే ఆ సంస్కృతి అంతరించింది. ముఠాల పోరుతో బలపడినవారు కాలగర్భంలో కలిసిపోయారు. అంతా ప్రశాంతం అనుకుంటున్న తరుణంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రౌడీ శక్తులు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. అరాచక రాజకీయాలతో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విజయవాడ నగరంలో మళ్లీ ముఠాలు ఊపిరి పోసుకోవడం మొదలుపెట్టాయి. రౌడీలు కాలర్‌ ఎగరేయడం ప్రారంభించారు. అధికార పార్టీ నాయకులు వారిని చేరదీయడం మొదలుపెట్టారు. దీంతో మళ్లీ బెజవాడలో రౌడీ రాజకీయం ఊపిరి పోసుకోవడం మొదలైంది. బెజవాడలోనే కాదు చుట్టుపక్కల ఎక్కడ గొడవ జరిగినా బెజవాడ రౌడీల పాత్ర ఉంటోంది. దానికి నిదర్శనమే కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి.. తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపైన, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటిపైన జరిగిన దాడులు. వీటన్నింటిలోనూ రాజకీయం ముసుగులో ఉన్న విజయవాడ రౌడీలదే కీలకపాత్ర. ఒకప్పుడు రౌడీషీట్లు ఉన్న వారే ప్రస్తుతం నాయకులుగా చెలామణి అవుతూ దౌర్యన్య రాజకీయాలు చేస్తున్నారు. 


ఆధారాలివే..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలు అధికార పార్టీ నాయకుల నిజ స్వరూపాన్ని వెల్లడిస్తున్నాయి. విజయవాడ 18వ డివిజన్‌ నుంచి వైసీపీ కార్పొరేటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న అరవ వెంకట సత్యనారాయణ అలియాస్‌ అరవ సత్యంతోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిలో పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న దేవినేని అవినాష్‌కు అత్యంత సన్నిహితులైన అరవ సత్యం, జోగరాజు (గాంధీ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌)తోపాటు బచ్చు మాధవి తదితరులు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిలో కీలకంగా వ్యవహరించినట్టు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. అరవ సత్యంపై గతంలో రౌడీషీట్‌ ఉండేది. తర్వాత దాన్ని తొలగించారు. ఆయన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. అరవ సత్యానికి సుమారు ఆరు నెలల క్రితం ప్రమాదంలో కాలు విరిగింది. ఈ కారణంగా ఇంట్లోనే ఉంటూ.. తన అనుచరుల ద్వారా వన్‌టౌన్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి యనమలకుదురులో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి వీఎంసీలో వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న అరవ సత్యం మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వీఎంసీలోని తన చాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉంది.


ఈ మేరకు వీఎంసీ పీఆర్వో నుంచి మీడియాకు మంగళవారం మధ్యాహ్నం 2.24గంటలకు సమాచారం వచ్చింది. కొద్దిసేపటికే సమావేశం రద్దు చేసినట్టు మరో సమాచారం పంపారు. అంటే ఆ సమయంలోనే వైసీపీ పెద్దల నుంచి అందిన ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయం.. పట్టాభి ఇంటిపై దాడులకు వ్యూహరచన చేసుకునేందుకే విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు స్పష్టం అవుతోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న దేవినేని అవినాష్‌ పర్యవేక్షణలోనే ఆయనకు అత్యంత సన్నిహితులైన అరవ సత్యం, బచ్చు మాధవి తదితరులు ఈ దాడులకు పక్కాగా ప్రణాళికలు వేసుకున్నట్టు తెలుస్తోంది.


బెజవాడలో భయం.. భయం

తాజా పరిణామాలు విజయవాడ నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో రాజకీయ నాయకుల అండతో మళ్లీ రౌడీలు కాలర్లు ఎగరేస్తున్నారు. నగరంలో చిరువ్యాపారాలు చేసుకునే చాలా మంది రాజకీయ నాయకుల అండతో మళ్లీ రౌడీల అవతారమెత్తుతున్నారు. వసూళ్లు, కబ్జాలకు పాల్పడుతున్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంపై దాడిలో పాల్గొన్న ఎస్‌.కె.సైదా పానీపూరీ బండి నడుపుతూ, ఎస్‌.కె.బాబు సెల్‌ఫోన్లకు మరమ్మతులు చేసుకుంటూ బతుకు వెళ్లదీస్తుంటారు. వీరంతా రాజకీయ నాయకుల అండ చూసుకుని ఇప్పుడు రౌడీల అవతారమెత్తారు. తాజా పరిణామాలతో ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరం మళ్లీ అరాచక రాజకీయాలకు నెలవుగా మారిపోతుందేమోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-10-21T06:49:54+05:30 IST