సారు.. తీరే వేరు!

ABN , First Publish Date - 2020-07-06T10:46:43+05:30 IST

అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయంలోని ఓ అధికారి తీరే వేరు. కార్యాలయానికి వస్తారు ..

సారు.. తీరే వేరు!

 కార్యాలయానికి వస్తారు.. పనిచేయరు..

తన పనులు మరో అధికారికి అప్పగింత..

అన్నీ తానే చేస్తున్నట్లు ఫీలింగ్‌ 

స్వకార్యాలకే పరిమితమవుతున్న వైనం..


అనంతపురం రూరల్‌, జూలై 5: అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయంలోని ఓ అధికారి తీరే వేరు. కార్యాలయానికి వస్తారు కానీ, పనులు ముట్టుకోరు. ఆయన పనులను కార్యాలయంలోని మరో అధికారికి అప్పగించారు. స్వకార్యాలకే పరిమితమవుతున్నారు. అంతటితో ఆగని ఆయన కార్యాలయంలోని పనులన్నీ తానే చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుతో కార్యాలయంలోని ఉద్యోగులు నివ్వెరపోతున్నారు. ఇటీవల ఓ అధికారి సస్పెండ్‌ కావటంతో ఆయన స్థానంలో ఓ అధికారిని జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడికి బదిలీ చేశారు. ఆయన వచ్చినప్పట్నుంచి తన లోకమే వేరు అన్న విధంగా వ్యవహరిస్తున్నట్లు కార్యాలయంలో చర్చించుకుంటున్నారు.


వస్తారు.. పనులు ముట్టరు..

ఆయన కార్యాలయానికి వస్తున్నారు. అక్కడే ఉంటారు కూడా. మధ్యాహ్నం భోజనం మినహా కార్యాలయం వదిలి వెళ్లట్లేదు. ఒక్కోసారి భోజనానికి కూడా కార్యాలయ సమీపంలోని హోటల్‌కు వెళ్తుంటారు. తిరిగి వచ్చి, సీట్లో కూర్చుంటారు. రాత్రి 9గంటల వరకు కార్యాలయంలోనే ఉంటున్నారు. అయినా పనులు మాత్రం చేయటం లేదని ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. గతంలో ఆ సీటులో అధికారులెవరూ అంత సమయం కూర్చున్న దాఖలాల్లేవని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఇళ్ల పట్టాల పంపిణీ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు మొత్తం ఆ పనిలోనే నిమగ్నమవుతున్నారు. మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఇక కార్యాలయంలో నిత్య కార్యక్రమాలు, కోర్టు సంబంధిత పనులు మాత్రం చేస్తున్నారు. వీటిని కార్యాలయంలోని రికార్డు అసిస్టెంట్లు చేస్తారు. వాటిని పరిశీలించి, తప్పులను సరిదిద్దటమే అధికారి పని. సదరు అధికారి మాత్రం తన సీటు వదిలి రావటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.


దీనికితోడు లేఔట్ల పనులు కార్యాలయంలోని ఉన్నతాధికారులే చూసుకుంటున్నారు. మరి ఈయన మాత్రం కార్యాలయం విడిచి వెళ్లట్లేదు. నిత్యం కార్యాలయంలో ఉంటున్నా.. అందుకు సంబంధించిన పనులు మాత్రం చేయట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమయం కేటాయించటం లేదన్న విమర్శలున్నాయి. వచ్చిన ఆ సమస్యలన్నింటినీ మరో అధికారికి అప్పగించేశారు. ఒకవేళ ఎవరైనా ఆయన వద్దకెళ్తే కస్సు.. బుస్సుమంటున్నారని చెప్పుకొంటున్నారు.


స్వకార్యాలకే పరిమితం..

కార్యాలయంలోని పనుల కంటే.. సొంత పనులకే సదరు అధికారి సమయం మొత్తం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కార్యాలయంలో ఉన్నారంటే.. ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారే వాలిపోతున్నట్లు చెబుతున్నారు. వారికే సమయం కేటాయిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. సదరు అధికారి గతంలో కలెక్టరేట్‌లో పనిచేయటమే ఇందుకు ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎవరికి ఏ భూ సమస్య వచ్చినా ఈయన వద్దకే వస్తున్నారన్న వాదనలున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వాటికి సంబంధించిన ఫైళ్లు సిద్ధం చేయటం, వాటిని ఉన్నతాధికారులకు పంపి చక్కబెడుతున్నట్లు చర్చ సాగుతోంది. అందుకు తగ్గ ప్రతిఫలం తీసుకుంటున్నట్లు తెలిసింది.


రూరల్‌ మండలంలోని సోములదొడ్డి గ్రామ సర్వే నెంబరు 112-సిలోని 2.86 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలు ఇళ్లు కట్టుకున్నారు. స్థానిక అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై, కొన్నింటిని తొలగించారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఇళ్లు కట్టుకుని పట్టాలు మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు కూడా వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సూచించింది. ఇంతవరకు బాగానే ఉంది. అదే సర్వే నెంబరు 112-డిలో 1.25 ఎకరాల భూమిని మరో వ్యక్తి ఆక్రమించాడు. ఆ భూమి జోలికి వెళ్లకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పినట్లు కార్యాలయంలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇలా స్వలాభం తెచ్చిపెట్టే పనులను మాత్రం చేస్తూ.. కార్యాలయానికి సంబంధించిన వాటిని పట్టించుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో పనులు కాకపోతే ఉన్నతాధికారులపై చెబుతూ.. ప్రజలను వారిపై ఉసిగొలుపుతున్నారన్న విమర్శలున్నాయి. ఇటీవలి పరిణామాలే ఇందుకు నిదర్శనం. కార్యాలయానికి ఉన్నతాధికారి ఇటీవల పదోన్నతిపై వచ్చారు. అప్పటికే చాలామంది రైతులు భూసమస్యలపై ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, పరిష్కారానికి ఎదురు చూస్తున్నారు.


ఉన్నతాధికారి తాను కొత్తగా వచ్చాననీ,  ఏదైనా సంతకం చేస్తే తాను ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనీ, మరోసారి దరఖాస్తు చేసుకుంటే, పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులకు చెప్పారు. ప్రజలు,  రైతులకు ఉన్నతాధికారి చెప్పిన విషయాలను చెప్పి, పని పూర్తయ్యేలా చేయించొచ్చు. సదరు అధికారి మాత్రం మరో విధంగా ఉన్నతాధికారిపై చెప్పి రైతులు, ప్రజలతో పెద్ద రాద్దాంతమే చేయించినట్లు కార్యాలయంలోని ఉద్యోగులే మాట్లాడుకోవటం గమనార్హం. ఆయన తీరుతో ఉద్యోగులు, సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. పైస్థాయి అధికారి కావటంతో మిన్నకుండి పోతున్నారు. ఏదేమైనప్పటికీ సదరు అధికారి తీరుతో ఉద్యోగులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - 2020-07-06T10:46:43+05:30 IST