ఎమ్మెల్సీ అనంతకు సజ్జల అండ

ABN , First Publish Date - 2022-05-24T08:33:27+05:30 IST

దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ సీహెచ్‌ అనంత ఉదయ్‌ భాస్కర్‌ను సీఎం ముఖ్య సలహాదారుడు

ఎమ్మెల్సీ అనంతకు సజ్జల అండ

ఉదయ్‌ భాస్కర్‌ ఓ డ్రగ్‌ డాన్‌

జగన్‌... అదానీని కలవడానికి దావోస్‌ వెళ్లాలా!

రాజ్యసభకు అర్హులు రాష్ట్రంలోనే లేరా?: లోకేశ్‌

విజయవాడ, మే 23(ఆంధ్రజ్యోతి): ‘‘దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ సీహెచ్‌ అనంత ఉదయ్‌ భాస్కర్‌ను సీఎం ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కాపాడుతున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ద్వారా సజ్జలను అనంత కలిశారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. విజయవాడ బీసెంట్‌ రోడ్డులోని ఒకటవ అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు వాయిదాకు ఆయన హాజరయ్యారు. అనంతరం కోర్టు వెలుపల లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ ఓ డ్రగ్‌ డాన్‌. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.2 కోట్లు, రెండు ఎకరాల భూమి ఇచ్చి కేసును మాఫీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దావో్‌సలో జరుగుతున్న సదస్సులో ఏపీ రాజధాని ఏది? అని అడిగితే జగన్‌ ఏం సమాధానం చెబుతారు? అదానీని కలవడం కోసం దావోస్‌ వెళ్లాల్సిన పనిలేదు’’ అన్నారు.  ‘‘వైసీపీ ప్రభుత్వం ఏం సామాజిక న్యాయం సాధించిందని మంత్రులు బస్సు యాత్ర చేస్తున్నారు? రాజ్యసభ సీట్లను పొరుగు రాష్ట్రం వారికి ఎందుకు ఇచ్చారు? ఇంతకుముందు ఉత్తరాది వారికి ఇస్తే, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీలను తెలంగాణ వారికి ఇచ్చారు. రాష్ట్రంలో రాజ్యసభకు వెళ్లే అర్హత ఉన్న వాళ్లు లేరా? జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు కనీసం టీఎంసీలు అంటే ఏమిటో తెలియదు’’ అని లోకేశ్‌ విమర్శించారు. 


కొవిడ్‌ కేసులో కోర్టుకు... జూలై 28కి వాయిదా

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని నమోదైన కేసులో లోకేశ్‌ విజయవాడలోని మొదటి అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సోమవారం హాజరయ్యారు. ఆయనతోపాటు కొల్లు రవీంద్ర, కార్పొరేటర్‌ జాస్తి సాంబశివరావు, యువనేత దేవినేని చందు కూడా కోర్టుకు వచ్చారు. వాయిదాకు పట్టాభి హాజరుకాలేదు. న్యాయమూర్తి జూలై 28కి వాయిదా వేశారు.

Updated Date - 2022-05-24T08:33:27+05:30 IST