అనంతపురం జిల్లా అలజడి రేపిన జంట హత్యలు

ABN , First Publish Date - 2021-06-20T17:50:27+05:30 IST

అనంతపురం యల్లనూరు మండలం ఆరవీడులోని బీరప్పస్వామి మాన్యం వివాదం జంట హత్యలకు దారి తీసింది.

అనంతపురం జిల్లా అలజడి రేపిన జంట హత్యలు

తాడిపత్రి: అనంతపురం యల్లనూరు మండలం ఆరవీడులోని బీరప్పస్వామి మాన్యం వివాదం జంట హత్యలకు దారి తీసింది. భూ వివాదం నేపథ్యంలో ఆరవీడు గ్రామానికి చెందిన మామా అల్లుళ్లు రాజగోపాల్‌ (55), నా రాయణప్ప (40) హతమయ్యారు. ఈ సంఘటన అచ్యుతాపురం వద్ద శనివారం జరిగింది. హతులు, నిందితులు ఇరు వర్గాలు వైసీపీకి చెందిన వారే కావటం గమనార్హం పూర్తి వివరాల్లోకి వెళితే


వివాదం ఇదీ...

పోలీసులు తెలిపిన మేరకు.... మండలంలోని ఆరవీడులో 60ఎకరాల బీరప్పస్వామి మాన్యం ఉంది. ఈ మాన్యం కురుబ సామాజిక వర్గానికి చెందిన వారి ఆధీనంలో ఉంది. అదే గ్రామానికి చెందిన ఉప్పర సామాజిక వర్గానికి చెందిన నాగేష్‌ ఏడాదిన్నర కిందట మాన్యానికి చెందిన సర్వే నెంబర్‌ 324లో 4ఎకరాల భూమిని ఆక్రమించాడు. ఈ విషయంపై కురువ కులస్థులు తహసీల్దార్‌ రమాదేవి, పోలీసులకు ఫిర్యాదుచేశారు. వివాద పరిష్కారంలో వారు తాత్సారం చేయటంతో నాగేష్‌ అక్రమించిన భూమిలో అభివృద్ధి పనులు చేపట్టాడు. దీంతో కురువ కులస్థులు మరోసారి పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.


వారు నాగేష్‌ను పిలిపించి వివాదాస్సద భూమిలో ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టరాదని హెచ్చరించారు. ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని నాగేష్‌ ఆక్రమించిన భూమిలో రాత్రికి రాత్రే చీనీచెట్లు నాటాడు. దీంతో కురువ కులస్థులందరూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. అయినా రెవెన్యూ, పోలీసులు మళ్లీ జాప్యం చేస్తుండటాన్ని సహించలేని రాజగోపాల్‌, నారాయణప్ప మరికొందరు  రాత్రికి రాత్రే ఆక్రమించిన భూమిలో నాటిన చీనీచెట్లను తొలగించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని చావబాదారు. అనంతరం అదే భూమిలో నాగేష్‌ చేత చీనీ చెట్లు నాటించడం పలు విమర్శలకు తావిచ్చింది. ఆక్రమించిన భూమిలో తిరిగి చీనీచెట్ల ఎలా నాటిస్తారం టూ పోలీసుల తీరుపై కురువ కులస్థులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  నాటిన చీనీచెట్లకు నీటితడుల కోసం  నారాయణప్పకు ప్రభుత్వం ఇ చ్చిన 2 సెంట్ల స్థలంలో రాత్రికి రాత్రే నాగేష్‌ బోరువేశాడు. అనుమతి లేకుం డా తనస్థలంలో బోరు ఎలా వేస్తాడంటూ నారాయణప్ప దాన్ని పూడ్చి వేశాడు.


ఈ విషయంపై నాగేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోజు రోజుకు నాగేష్‌ ఆగడాలు మితిమీరిపోతుండటంతో నారాయణప్ప మామ రాజగోపా ల్‌ తనవద్ద నాగేష్‌ ఆక్రమించిన భూమికి సంబంధించిన రికార్డులు ఉ న్నాయంటూ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ రికార్డులను పరిశీలించిన రెవెన్యూ అధికారులు భూ వివాదాన్ని పరిష్కరించేందుకు వారంరోజుల గడువు కోరారు. ఈ సమయంలో ఎస్‌ఐగా ఉన్న వెంకటప్రసాద్‌ బదిలీపై వెళ్లారు. తనకు ముందునుంచి అనుకూలంగా ఉన్న ఎస్‌ఐ బదిలీ కావడంతోపాటు ఆక్రమించిన భూమికి సంబంధించిన రికార్డులను రాజగోపాల్‌ చూపించడంతో తన చేతి నుంచి రూ.లక్షల విలువైన భూమి చేయి దాటిపోతుందన్న దుగ్ధతో మామాఅల్లుళ్లను చంపేందుకు నాగేష్‌ పథకం రూపొందించాడు.


పథకం అమలు ఇలా...

మాన్యం వివాదానికి సంబంధించి మాట్లాడేందుకు మామాఅల్లుళ్లు రాజగోపాల్‌, నారాయణప్పను బదిలీపై వచ్చిన ఎస్‌ఐ మస్తాన్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలుస్తున్నాడంటూ కానిస్టేబుల్‌ వారికి సమాచారం ఇచ్చాడు. దీంతో శనివారం ఉదయం వారు ఎస్‌ఐని కలిసేందుకు యల్లనూరు వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాగేష్‌ అనేక కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవరాజు, మరికొందరి సాయంతో అచ్యుతాపురం-ఆరవీడు మధ్యలో మామాఅల్లుళ్లను హతమార్చేందుకు పన్నాగం పన్నారు. ఇందులో భాగం గా ఒక గ్రూపును తిరుమలాపురం క్రాస్‌ వద్ద నిఘా పెట్టారు. మరోగ్రూపులో ప్రధాన నిందితులైన నాగేష్‌.. మరికొందరితో కలిసి అచ్యుతాపురం వద్ద రోడ్డు పక్కన మాటు వేశాడు.


ఎస్‌ఐతో మాట్లాడిన అనంతరం మామాఅల్లుళ్లు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో తిరుమలాపురం క్రాస్‌ నుంచి అచ్యుతాపురం మీదుగా ఆరవీడుకు వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. తిరుమలాపురం క్రాస్‌ వద్ద ఉన్న ఒక గ్రూపు సెల్‌ఫోన్‌ ద్వారా అచ్యుతాపురం వద్ద మాటువేసిన నాగేష్‌ గ్రూపునకు వారి సమాచారమందించింది. ద్విచక్రవాహనం ఆరవీడుకు 10 కిలోమీటర్ల దూరంలోని అచ్యుతాపురం సమీపానికి రాగానే దుండగులు మరో వాహనంతో దాన్ని ఢీకొట్టారు. దీంతో మామాఅల్లుళ్లు రోడ్డుపై పడ్డారు. ఇదే అదునుగా భావించిన నిందితులు వేటకొడవళ్లు, ఇతర ఆయుధాలు, బండరాళ్లతో రోడ్డుపై పడ్డ అల్లుడు నారాయణప్పతోపాటు తప్పించుకొనే ప్రయత్నం చేసిన మామ రాజగోపాల్‌పై విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. అనంతరం పరారయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు హత్యా స్థలానికి చేరుకుని బోరుమన్నారు.


తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి హత్యా స్థలానికి చేరుకుని, బాధితులను పరామర్శించారు. డీఎస్పీ చైతన్య, రూరల్‌ సీఐ మల్లికార్జునగుప్తా, ఎస్‌ఐ మస్తాన్‌.. సిబ్బందితో హత్యాస్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఈ సమయంలో పోలీసులపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతూ శాపనార్థాలు పెట్టారు. పోలీసుల పక్షపాతంతో వ్యవహరించి నాగేష్‌కు కొమ్ముకాచారని ఆరోపించారు. పోలీసుల అండ చూసుకుని, నాగేష్‌ రెచ్చిపోయి తమవారిని హతమార్చాడని వాపోయారు. శవాలను తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా ఆరవీడులో ప్రతీకార దాడులు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-06-20T17:50:27+05:30 IST