AnandMahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్ అంటే ఈమాత్రం ఉంటదిగా.. ఈ ఫొటోలోని మహిళ ఎవరంటే..

ABN , First Publish Date - 2022-05-02T19:37:37+05:30 IST

ఓ మహిళా ఉద్యోగి గురించి ఆనంద్ మహీంద్రా పంచుకున్న విషయం ఆలోచింపజేసింది. తాజాగా.. ఆయన ట్విట్టర్‌లో MondayMotivation హ్యాష్‌ట్యాగ్‌తో..

AnandMahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్ అంటే ఈమాత్రం ఉంటదిగా.. ఈ ఫొటోలోని మహిళ ఎవరంటే..

ఆడవారు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడుతున్నా ఇప్పటికీ వారిని వంటింటి కుందేలు అంటూ చులకన చేసి చూస్తున్న రోజులివి. కానీ.. జీవితంలో ఎదిగే విషయంలో మగాళ్లకు మేమేం తక్కువ కాదని నిరూపించిన ఓ మహిళ గురించి ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. స్వశక్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి లింగ భేదం ఏమాత్రం అడ్డుకాదని రుజువు చేసిన ఓ మహిళా ఉద్యోగి గురించి ఆయన పంచుకున్న విషయం ఆలోచింపజేసింది. తాజాగా.. ఆయన ట్విట్టర్‌లో MondayMotivation హ్యాష్‌ట్యాగ్‌తో మహీంద్రా సంస్థ చీఫ్ కస్టమర్, బ్రాండ్ ఆఫీసర్ ఆషా ఖర్గా పోస్ట్ చేసిన వీడియోను ట్యాగ్ చేశారు.


ఆషా ఖర్గా పోస్ట్ చేసిన వీడియో ఎంతో స్పూర్తిదాయకంగా ఉంది. తమ సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి గురించి ఆషా ఖర్గా తన ట్వీట్‌లో వివరించారు. ఆ ఉద్యోగి పేరు అనుష్క పాటిల్. మహీంద్ర XUV700 ప్రాసెసింగ్ యూనిట్‌లో టీమ్ లీడ్‌గా పనిచేస్తున్నారు. 700 మందికి పైగా పురుష ఉద్యోగులకు ఆమె లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం మహీంద్ర నాసిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరిన అనుష్క పాటిల్ తన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఒక మహిళ 700 మంది పురుష ఉద్యోగులను ఏకతాటిపై నడిపి సంస్థ ఉన్నతికి పాటుపడటం మామూలు విషయం కాదు. అనుష్క పాటిల్ జీవితంలో ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. #SheIsOnTheRise హ్యాష్‌ట్యాగ్‌తో అనుష్క పాటిల్ స్టోరీని Rise Storyగా మహీంద్ర చీఫ్ కస్టమర్ అండ్ బ్రాండ్ ఆఫీసర్‌ ఆషా ఖర్గా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ను ఆనంద్ మహీంద్ర ట్యాగ్ చేశారు.


మనం కోరుకుంటున్న Gender Diversity సాధించడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, కానీ.. మనం ఈ విషయంలో వేగంగా అడుగులేయకపోతే ఇలాంటి టాలెంట్‌ ఉన్నవారిని కోల్పోతామని ఆనంద్ మహీంద్ర అనుష్క పాటిల్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. 700 మంది ఉద్యోగులను ముందుండి నడిపిస్తున్న అనుష్క పాటిల్ ఇలాగే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ టాలెంట్‌ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. వ్యాపారవేత్తలు కేవలం డబ్బు వేటలోనే తలమునకలవ్వకూడదని, స్వశక్తితో ఎదగాలని తపన ఉన్నా, నైపుణ్యం ఉన్నా అవకాశం లేక మరుగునపడిన వారిన వెన్నుతట్టి ప్రోత్సహించాలని ఆనంద్ మహీంద్ర భావిస్తుంటారు.

Updated Date - 2022-05-02T19:37:37+05:30 IST