జగన్ ప్రభుత్వంపై ఆనందయ్య సీరియస్

ABN , First Publish Date - 2021-06-23T20:14:35+05:30 IST

కరోనా నివారణ కోసం తయారు చేస్తున్న మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం..

జగన్ ప్రభుత్వంపై ఆనందయ్య సీరియస్

ఒంగోలు: కరోనా నివారణ కోసం తయారు చేస్తున్న మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. సరైన సామాగ్రి లేక మందు తయారీ విషయంలో వెనుకబడ్డానని ఆనందయ్య చెప్పారు. అయినా ప్రతి జిల్లాలో దాతల సహకారంతో ప్రజలకు మందు అందజేస్తున్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అడిగినవారందరికీ మందు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే బడ్డి బంకుల్లో తన మందు అమ్ముతున్నారంటే.. అది ప్రభుత్వ లోపమని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆనందయ్య కోరారు.


కరోనా బాధితులు ఎంతమంది ఉన్నా అందరికీ ఉచితంగా మందు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆనందయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రజా ప్రతినిధుల ద్వారా మందు అందజేస్తున్నామని చెప్పారు. మొదటి నుంచి తనకు వెన్నుదన్నుగా నిలబడిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మందు పంపిణీ పార్టీలకు అతీతంగా చేస్తున్నామని, ఏయే జిల్లాల్లో ఎన్ని పాజిటీవ్ కేసులు ఉన్నాయో ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకుని ఏ విధంగా చేయాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆనందయ్య కోరారు.

Updated Date - 2021-06-23T20:14:35+05:30 IST