న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ భవిష్యత్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే)లోకి అడుగుపెట్టాలనుకుంటున్నాడా? ఏమో.. సాధారణంగా చెస్ రాజకీయాల గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడని ఆనంద్.. ప్రస్తుతం ఫిడే పరిపాలనా వ్యవహారాలపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. అందులో భాగంగానే ప్రస్తుత ఫిడే అధ్యక్షుడు అర్కాడే వొర్కోవిచ్ రీ ఎలక్షన్ బిడ్‌కు తాను మద్దతిస్తున్నట్టు ఆనంద్ శుక్రవారం స్పష్టం చేశాడు. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నై వేదికగా చెస్ ఒలింపియాడ్ జరగనుంది. ఈ సందర్భంగా చెన్నైలోనే ఫిడే కాంగ్రెస్ కూడా నిర్వహించనున్నారు.
అప్పుడే ఫిడే నూతన కార్యవర్గం ఎన్నికలపై కూడా చర్చిస్తారు. ప్రస్తుత ఫిడే చీఫ్ అర్కాడే తిరిగి అదే పదవిలో కొనసాగాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇందుకు ఆనంద్ మద్దతు తనకుందనీ, అతడిని తమ జట్టులోకి తీసుకుంటున్నట్టు అర్కాడే వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆనంద్ వద్ద ప్రస్తావిస్తే.. ‘అర్కాడేతో నేను చర్చించా. కానీ, అందులో నా పాత్ర ఏంటన్నది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని విషీ బదులిచ్చాడు. ఇన్నాళ్లూ ఆటగాడిగా అద్భుత విజయాలు చవిచూసిన ఆనంద్.. భవిష్యత్‌లో చెస్ పరిపాలనా వ్యవహారాల్లోనూ తనదైన ముద్ర వేస్తాడేమో చూడాలి.