టీమిండియా ఆటగాళ్లకు ఆనంద్ మహింద్రా సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు!

ABN , First Publish Date - 2021-01-23T23:42:06+05:30 IST

టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఆ దేశ గడ్డపైనే ఓడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన

టీమిండియా ఆటగాళ్లకు ఆనంద్ మహింద్రా సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు!

న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఆ దేశ గడ్డపైనే ఓడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన భారత క్రికెటర్లకు మహింద్రా గ్రూప్ చైర్మన్, బిలియనీర్ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించారు. అనేక సవాళ్ల మధ్య ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడిన ఆరుగురు క్రికెటర్లకు ఎస్‌యూవీలు బహుమతిగా ఇవ్వనున్నట్టు వరుస ట్వీట్లలో ప్రకటించారు. 


టీమిండియా ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్‌లను ఆనంద్ మహింద్రా కొనియాడారు.  కలలు కనడం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం వంటి విషయాల్లో భవిష్యత్ తరాలకు వారు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారని ప్రశంసించారు. వారందరికీ తన సంతోషం కోసం ‘థార్’ ఎస్‌యూవీలను తన సొంత ఖర్చుతో బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిపారు. దీనితో కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.  తమను తాము విశ్వసించే యువకులను ప్రోత్సహించడమే ఈ గిఫ్ట్ వెనక ఉన్న ప్రధాన ఉద్దేశమని మహింద్రా చెప్పుకొచ్చారు. 


ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ భారత్‌కు నిజంగా ఓ పెద్ద సవాలుగా మారింది. గాయాలబారినపడి కీలక ఆటగాళ్లందరూ జట్టుకు దూరమైన వేళ.. దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా ఇరగదీసింది. ఆరుగురు ఆటగాళ్లకు అంతకముందు ఒక్క మ్యాచ్ కూడా ఆడిన అనుభవం లేదు. అందులో కొందరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికీ ఆసీస్ గడ్డపై ఎదురైన సవాళ్లను అధిగమించి మరీ జట్టును ముందుకు నడిపారు. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. 


మహ్మద్ సిరాజ్ మూడు మ్యాచుల్లో 13 వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరచగా, బ్రిస్బేన్ టెస్టులో  శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లు అటు బంతితోను, ఇటు బ్యాట్‌తోనూ ఆసీస్ పనిపట్టారు. ఇద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 123 పరుగులు జోడించి 30 ఏళ్లనాటి భారత టెస్టు రికార్డును బద్దలుగొట్టారు. అలాగే, నటరాజన్ కూడా. వీరందరూ  ఆసీస్ భరతం పట్టడంలో కీలకంగా వ్యవహరించారు.

Updated Date - 2021-01-23T23:42:06+05:30 IST