లోకేశ్‌తో ఆనం కుమార్తె భేటీ

ABN , First Publish Date - 2022-05-29T09:20:31+05:30 IST

లోకేశ్‌తో ఆనం కుమార్తె భేటీ

లోకేశ్‌తో ఆనం కుమార్తె భేటీ

ఆత్మకూరు టికెట్‌ కోసమే?

ఇప్పటికే ఇన్‌చార్జి రేసులో బొమ్మిరెడ్డి, కొమ్మి, కన్నబాబు

ఉప ఎన్నికకు కాదు.. 2024 కోసం!


ఒంగోలు, మే 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి శనివారమిక్కడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిశారు. ఆమె భర్త రితీశ్‌ ఇప్పటికే టీడీపీలో ఉన్నారు. ఆమె అత్త విజయమ్మ కడప జిల్లా బద్వేలు మాజీ ఎమ్మెల్యే (ఈమె మాజీ మంత్రి బి.వీరారెడ్డి కుమార్తె). కైవల్య తన భర్తతో కలిసి టంగుటూరులో బస చేసిన లోకేశ్‌తో మాట్లాడినట్లు సమాచారం. అత్తగారి కుటుంబం ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నా ఆమె ఇంతవరకూ తెర ముందుకు రాలేదు. ఇప్పుడు తండ్రి ఆశీస్సులతో ఆమె రంగప్రవేశం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారని అంటున్నారు. ఆత్మకూరులో కొంత భాగానికి (అప్పట్లో రాపూరు నియోజకవర్గంలో ఉండేది) గతంలో ఆమె తండ్రి ఆనం ప్రాతినిధ్యం వహించారు. ఆ ప్రాంతంతో ఆనం కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రామనారాయణరెడ్డి ప్రస్తుతం దానికి పొరుగునే ఉన్న వెంకటగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కైవల్యారెడ్డి రంగ ప్రవేశంతో ఆత్మకూరు టీడీపీ టికెట్‌కు పోటీ పెరిగింది. జడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, పార్టీ సీనియర్‌ నేత కన్నబాబు ఈ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి పోటీ పడుతున్నారు. ఇప్పుడు కైవల్య రంగ ప్రవేశంతో వాతావరణం వేడెక్కనుంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఆత్మకూరు స్థానానికి వచ్చే నెల 23న ఉప ఎన్నిక జరగనుంది. గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి వైసీపీ తరఫున పోటీచేయనున్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఉప ఎన్నికలో అభ్యర్థిగా బరిలో నిలిస్తే పోటీ పెట్టరాదన్నది టీడీపీ విధానం. ఆ సంప్రదాయం ప్రకారమే పోటీపెట్టడం లేదని లోకేశ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు టికెట్‌ ఆశిస్తున్న వారంతా 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 


ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం: సోమిరెడ్డి

టీడీపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని నెల్లూరు జిల్లా సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ‘కైవల్య భర్త టీడీపీలోనే ఉన్నారు. ఆమె మెట్టినిల్లు టీడీపీ. ఆమె మా పార్టీ కుటుంబ సభ్యురాలు. ఆమె ఆత్మకూరు టికెట్‌ ఆశిస్తున్నారో లేదో నాకు తెలియదు. అయినా అది రెండేళ్ల తర్వాతి విషయం’ అని చెప్పారు. ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ టీడీపీలోకి వస్తారని జరిగిన ప్రచారం గురించి అడిగినప్పుడు సోమిరెడ్డి నేరుగా స్పందించలేదు. ‘నెల్లూరు జిల్లా రాజకీయాలు ప్రత్యేకమైనవి. అక్కడ అనేక పరిణామాలు జరుగుతుంటాయి. మేం ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నాం. ఎటూ పోయేవాళ్లం కాదు. అదే సమయంలో ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. అది మా బాధ్యత’ అని బదులిచ్చారు.


కేసీఆర్‌ ఇప్పటికైనా ఎన్టీఆర్‌ను గుర్తించారు

ఎన్టీఆర్‌ శత జయంతి కార్యక్రమాల సందర్భంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించడంపై వేసిన ప్రశ్నకు సోమిరెడ్డి స్పందించారు. ‘గతంలో కేసీఆర్‌ ఆయన్ను విస్మరించారు. శత జయంతి సందర్భంగా ఇప్పుడైనా గుర్తించి నివాళులు అర్పించడం సంతోషం. దాని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేదా అన్నది నాకు తెలియదు. ఎన్టీఆర్‌ను ప్రపంచమంతటా తెలుగువారు స్మరించుకుంటున్నారు. నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అదేపని చేయడం సంతోషదాయకం’ అని అన్నారు.

Updated Date - 2022-05-29T09:20:31+05:30 IST