జిల్లా కేంద్రంగా అనకాపల్లి

ABN , First Publish Date - 2022-01-27T06:21:01+05:30 IST

అనకాపల్లి కేంద్రంగా ఏడు నియోజకవర్గాలతో కొత్త జిల్లా రూపుదిద్దుకోనుంది.

జిల్లా కేంద్రంగా అనకాపల్లి

ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలతో ఏర్పాటు

సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని సామాన్యుల ఆశాభావం


అనకాపల్లి టౌన్‌, జనవరి 26: అనకాపల్లి కేంద్రంగా ఏడు నియోజకవర్గాలతో కొత్త జిల్లా రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం గజిట్‌ విడుదల చేసింది. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటవుతుంది.  


వసతి సమస్య

అనకాపల్లిలో ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే తీవ్ర వసతి సమస్య ఉంది. అనేక ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఆవిర్భవిస్తే ఈ సమస్య మరింత అధికమవుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.


కలెక్టరేట్‌గా ఆర్డీవో కార్యాలయం?

అనకాపల్లికి ఆనుకుని వున్న కొత్తూరులో ఇప్పటికే ఆర్డీవో కార్యాలయ నూతన భవనం నిర్మాణంలో ఉంది. ఈ భవనాన్ని తాత్కాలికంగా కలెక్టర్‌ కార్యాలయంగా వినియోగించుకోవచ్చు. అలాగే ప్రస్తుతం క్వార్టర్స్‌ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ కార్యాలయం భవన నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. 


అందుబాటులో అధికారులు

అనకాపల్లి జిల్లాగా మారితే గ్రామీణ ప్రాంత ప్రజలకు పరిపాలన అందుబాటులోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇప్పటికే పట్టణం వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఉన్నాయి. అంతేకాకుండా పట్టణానికి ఆనుకుని జాతీయ రహదారి ఉంది. అలాగే 200 పడకల ఎన్టీఆర్‌ వైద్యాలయం ఉంది. దీనికితోడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని 50 ఎకరాల్లో మెడికల్‌ కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుచేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రాంతీయ రవాణా శాఖ, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. అనకాపల్లి జిల్లా కేంద్రమైతే సుమారు 30 వరకు ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల చేరుకలోకి రానున్నాయి. సమస్యలను ఆయా శాఖల ఉన్నతాధికారులు వేగంగా పరిష్కరించడానికి అవకాశం వుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అనకాపల్లి జిల్లా

జిల్లా కేంద్రం: అనకాపల్లి

విస్తీర్ణం: 4,412 చ.కి.మీ.

జనాభా: 18.73 లక్షలు

రెవెన్యూ డివిజన్లు: 2 (అనకాపల్లి, నర్సీపట్నం)

మండలాలు: 25

అసెంబ్లీ నియోజకవర్గాలు: 7 (అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయకరావుపేట)


రాష్ట్రంలోనే కీలక జిల్లాగా అనకాపల్లి

సత్యవతి, ఎంపీ

కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పూర్తిగా గ్రామీణ ప్రాంతంతో కూడిన అనకాపల్లి పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం సంతోషం. జిల్లా ఏర్పాటుతో పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట సెగ్మెంట్‌లలో గల పారిశ్రామిక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం కలగనున్నది. ఉపాధి అవకాశాలతోపాటు ఆదాయం పెరగనున్నాయి. రాష్ట్రంలోనే అనకాపల్లి కీలక జిల్లాగా మారబోతుంది.

Updated Date - 2022-01-27T06:21:01+05:30 IST