Tiger: ఎల్లుప్పిలో పులి

ABN , First Publish Date - 2022-08-08T02:20:28+05:30 IST

అనకాపల్లి జిల్లా (Anakapalli District) సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామంలో పులి (Tiger) మరోసారి కలకలం రేపింది.

Tiger: ఎల్లుప్పిలో పులి

సబ్బవరం: అనకాపల్లి జిల్లా (Anakapalli District) సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామంలో పులి (Tiger) మరోసారి కలకలం రేపింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో నల్లకొండ అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న రైతు కొట్యాడ అప్పలరాము కల్లం వద్ద రెండు ఆవులపై దాడిచేసి చంపేసింది. మరో గేదెపై దాడి చేసి గాయపరిచింది. ఒక ఆవును అడవిలోకి ఈడ్చుకుపోయింది. ఈ దృశ్యాన్ని రైతు అప్పలరాము దూరం నుంచి చూసి భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ సిబ్బంది దాడి చేసింది పులేనని నిర్ధారణకు వచ్చారు. పులి మళ్లీ తిరిగి వస్తుందని భావించి ఆదివారం అక్కడ నిఘా పెట్టారు. ఆ ప్రాంతంలో బోను ఏర్పాటు చేస్తామని పెందుర్తి ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ రామారావు తెలిపారు. సుమారు ఇరవై రోజుల క్రితం ఎల్లుప్పిలో ఆవు పెయ్యిపై దాడిచేసి చంపేసిన ప్రదేశానికి శనివారం పులి మళ్లీ రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఎల్లుప్పి, కోటపాడు, సబ్బవరం, చోడవరం మండలం వెంకన్నపాలెం వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర నల్లకొండ ఫారెస్టు విస్తరించి ఉంది. దీంతో పులి ఆవాసానికి ఇది అనువుగా మారిందని అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2022-08-08T02:20:28+05:30 IST