APలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన Ayyanna ఇంటి గోడ కూల్చివేత వ్యవహారం.. ఎవరు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-06-19T21:28:05+05:30 IST

Anakapalli జిల్లా: నర్సీపట్నం (Narsipatnam)లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది.

APలో రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారిన Ayyanna ఇంటి గోడ కూల్చివేత వ్యవహారం.. ఎవరు ఏమన్నారంటే..

Anakapalli జిల్లా: నర్సీపట్నం (Narsipatnam)లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇంటి గోడ కూల్చడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి (Padmavati)  మాట్లాడుతూ.. రాజకీయంగా ఉంటే ఏమైనా చూసుకోవాలి కానీ.. రాత్రికి రాత్రి ఇంటిగోడ కూల్చడమేంటని  ఆమె ప్రశ్నించారు. ఏనాడో నిర్మించిన ఇంటి విషయంలో ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటన్నారు. నిబంధనల ప్రకారమే తాము ఇల్లు కట్టుకున్నామన్నారు. ఇంటి గోడ కూల్చే క్రమంలో అధికారులు వ్యవహరించిన శైలిని ఆమె తప్పుపట్టారు. ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె నిలదీశారు. ఇంత దారుణం ఎక్కడైనా ఉందా? అన్నారు. తమకు వ్యక్తిత్వం లేదా? ప్రజల గురించి మాట్లాడే హక్కులేదా? బీసీలంటే అంత లోకువగా ఉందా? అంటూ పద్మావతి జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. నర్సీపట్నంలో అయ్యన్నను అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్‎పై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్న రాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అయ్యన్న ఇంటి వెనకాల గోడను జేసీబీతో కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు.


ఈ ఘటనపై అయ్యన్న పాత్రుడు  చిన్న కుమారుడు రాజేష్ ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చారు. ‘‘మేము ఇల్లు నిర్మించిన స్థలంలో ఆక్రమణ ఉంటే, జాయింట్ సర్వే చేయించి ఇయర్ మార్క్ చేసి ఇవ్వండి.. మేమే తొలగిస్తాం.. ఆక్రమణ లేనియెడల, ఆ గోడను యధావిధిగా నిర్మించి ఇవ్వాలని’’ వినతి పత్రంలో పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే విధంగా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు.


చింత‌కాయ‌ల‌ అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిగోడ కూల్చివేత‌ ముమ్మాటికీ వైసీపీ క‌క్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. టీడీపీలో బ‌ల‌మైన బీసీ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని అక్ర‌మ కేసులు, అరెస్టులు, దాడుల‌కు జ‌గ‌న్‌ పాల్ప‌డుతున్నారని తెలిపారు. చోడ‌వ‌రం మినీమ‌హానాడు వేదిక‌గా వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టాడ‌నే అక్క‌సుతోనే అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిపై చీక‌టి దాడులు చేయించాడని ఆరోపించారు. అయ్య‌న్న‌ అడిగిన ప్ర‌శ్న‌ల్లో ఏ ఒక్క‌దానికైనా స‌మాధానం ఇవ్వలేని, ద‌మ్ములేని జ‌గ‌న్‌ కూల్చివేతకి పాల్ప‌డ్డాడని విమర్శించారు.  


రోజురోజుకి తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్నవ్యతిరేకత ... చంద్రబాబుకు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక సైకోలా వ్యవహరిస్తున్నాడని టీడీపీ నాయకుడు పట్టాభి విమర్శించారు. అయ్యన్నపాత్రుడిది మచ్చలేని కుటుంబం అని..ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా జగన్‌పై పోరాటం చేస్తున్నారని తెలిపారు. అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకుంది 0.2 సెంట్లు.... అంటే 10 గజాలు లోపేనని.. దీనికి వంద మంది పోలీసులు, జేసీబీలు, ఐపీఎస్‌ అధికారులు అవసరమా? అని ప్రశ్నించారు.  పోలీస్‌ వ్యవస్థ అంటే వైసీపీ  చేతి కర్రగా మారడం బాధాకరమన్నారు.  


టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ.. బలమైన బీసీ గొంతుక అయ్యన్నపాత్రుడిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ముందస్తు నోటీసులు లేకుండా అర్ధరాత్రి ప్రహరీ కూల్చడమేమిటని ప్రశ్నించారు. అధికార మదాంధకారంతో జగన్ రెడ్డి చేస్తున్న వికృత విన్యాసాలకు అంతేలేకుండా పోతోందన్నారు. పాలకుల దుర్నీతిని గట్టిగా ఎండగడితే కక్ష సాధింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. రాజకీయాల్లో ఇలాంటి దుష్ట సంప్రదాయం మంచిది కాదన్నారు. ఇందుకు భవిష్యత్తులో జగన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు.

Updated Date - 2022-06-19T21:28:05+05:30 IST