అమరావతి: జర్నలిస్టుల సమస్యలపై సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో పత్రికా రంగం, మీడియాకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రెండున్నరేళ్లుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ప్రజా పక్షాన వార్తలు రాసే పత్రికలు, పాత్రికేయులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కోవిడ్ సమయంలో జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారని, విధినిర్వహణలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇంతవరకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందలేదన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదని, జర్నలిస్టులకు ఆరోగ్యబీమా పథకం అమలు కావడంలేదన్నారు. జర్నలిస్టులకు టీడీపీ హయాంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను రద్దు చేశారని, కక్షసాధింపు చర్యలను పక్కనపెట్టి జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే అనగాని ఆ లేఖలో డిమాండ్ చేశారు.