Abn logo
Nov 22 2020 @ 17:12PM

‘అన‌గ‌న‌గా ఓ అతిథి’ మూవీ రివ్యూ

వ్యవథి: 93 నిమిషాలు

బ్యాన‌ర్‌: ట‌్రెండ్ లౌడ్‌

న‌టీన‌టులు:  పాయ‌ల్ రాజ్‌పుత్‌, చైత‌న్య‌కృష్ణ‌, అశోక్‌కుమార్‌, తోట‌ప‌ల్లి మ‌ధు త‌దిత‌రులు

ఆర్ట్‌:  విఠ‌ల్ కోస‌నం

మూల‌క‌థ‌:  మోహ‌న్ హ‌బ్బు

సంగీతం:  అరోల్ కొరోలి

ఎడిటింగ్‌:  ప్రీతి, బాబు ఎ.శ్రీవ‌త్స‌వ‌

కెమెరా:  రాకేశ్.బి

నిర్మాతలు:  రాజా రామ‌మూర్తి, చిదంబ‌రం న‌డేస‌న్‌

ద‌ర్శ‌క‌త్వం:  ద‌యాల్ ప‌ద్మ‌నాభ‌న్


ఆశ మనిషిని అజ్ఞానిని చేస్తుంది. చుట్టూ జరుగుతున్న విషయాలను పసిగట్టనీయదు. అంతే కాదు.. చేయరాని తప్పులను చేయిస్తుంది. ఈ పాయింట్‌తో చేసిన కన్నడ చిత్రం 'కరాళ కాళరాత్రి' కి రీమేక్‌గా తీసిన సినిమా  'అనగనగా ఓ అతిథి'. తొలి చిత్రం 'ఆర్‌.ఎక్స్‌ 100'తో గ్లామర్‌ హీరోయిన్‌గా ఆకట్టుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ తొలిసారి డీ గ్లామర్‌ రోల్‌లో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది. పాయల్‌కు నటిగా గుర్తింపు తెచ్చిందా?  లేదా? అసలు దర్శకుడు ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..


కథ:

ఒంటిల్లు సుబ్బయ్య(ఆనంద్‌ చక్రపాణి), అన్నపూర్ణమ్మ(వీణా సుందర్‌) ఊరికి దూరంగా నివసిస్తుంటారు. సుబ్బయ్య పేదరైతు. అన్నపూర్ణమ్మ మంత్రసానిగా పనిచేస్తుంటుంది. వీరికి కూతురు మల్లిక(పాయల్‌ రాజ్‌పుత్‌) ఉంటుంది. పేదరికం కారణంగా మల్లికకు వీరు పెళ్లి చేయలేకపోతుంటారు. సుబ్బయ్య తాగుబోతు కావడంతో ఉన్న పొలాన్ని కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఓ ఓరోజు దేశ సంచారి శ్రీనివాస్‌(చైతన్య కృష్ణ) వీరింటికి వచ్చి ఆశ్రయం కావాలని అడుగుతాడు. వారికి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారు. ఇంటికి వచ్చిన శ్రీనివాస్‌ దగ్గర కావాల్సినంత డబ్బు, నగలున్నాయని వారికి తెలుస్తుంది. పేదరికంతో బాధపడుతున్నవారు ఓ నిర్ణయం తీసుకుంటారు. ఇంతకూ వారు తీసుకునే నిర్ణయం ఏంటి? చివరకు వారికి తెలిసే నిజం ఏంటి?  నిజం తెలిసేసరికి వారు కోల్పోయేదేంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...


విశ్లేషణ:

కన్నడ నవల కరాళ కాళరాత్రి ఆధారంగానే దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నాడు. ఇలాంటి కథలు, యథార్థ ఘటనల ఆధారంగా సినిమాలు చేసేటప్పుడు కథనం విషయంలో దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పాత్రలను సరిగ్గా డిజైన్‌ చేయాలి. సినిమా బాగానే ఉన్నట్లు అనిపించింది. కానీ ఆసక్తికరంగా అనిపించదు. చివరి పదిహేను నిమిషాలు మాత్రం ఆసక్తికరంగా ఉంది. సినిమా ఏ కాన్సెప్ట్‌తో జరుగుతుందనే దానిపై ప్రారంభంలోనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే సినిమాను ఎలాగైనా రెండు గంటలు ఉండేలా చూడాలనుకుని సాగదీసే ప్రయత్నం చేయలేదు. 93 నిమిషాల్లోనే సినిమాను పూర్తి చేశాడు. అలాగే ప్రధానంగా నాలుగు పాత్రలతోనే సినిమాను రన్‌ చేయడం గొప్ప విషయం.


మిగిలిన పాత్రలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రలే. అరోల్‌ కొరెల్లి సంగీతంలో పాటలు సందర్భానుసారం బావున్నాయి. సినిమా నెమ్మదిగా సాగినట్లు ఉండటంతో సీరియల్‌ను చూసినట్లు అనిపిస్తుంది. అయితే చివరలో ఇచ్చిన ట్విస్ట్‌ బావుంది. నటీనటుల విషయానికి వస్తే.. పాయల్‌ రాజ్‌పుత్‌ పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. నటిగా గ్రేషేడ్స్‌ ఉన్నట్లు ఉండే తన పాత్రకు పాయల్‌ అతికినట్లు సరిపోయింది. చైతన్య కృష్ణ, వీణా సుందర్‌, ఆనంద్‌ చక్రపాణి అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఓటీటీలోనే కాబట్టి సినిమాను ఓసారి చూసేయవచ్చు. 


చివరగా.. అనగనగా ఓ అతిథి.. సీరియల్‌ను తలపించే సినిమా

రేటింగ్‌:  2.5/5

Advertisement
Advertisement
Advertisement