వధువు మృతిపై వీడని మిస్టరీ

ABN , First Publish Date - 2022-05-14T05:59:03+05:30 IST

పెళ్లిపీటల మీద వరుడు జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన కేసులో మిస్టరీ కొనసాగుతోంది.

వధువు మృతిపై వీడని మిస్టరీ
సృజన (ఫైల్‌ ఫొటో)

విషం తీసుకోని ఉండవచ్చునని వైద్యుల అనుమానం

అనారోగ్యం వల్లే మృతిచెందిందన్న మృతురాలి సోదరుడు

రెండు రోజుల ముందు నుంచి ఆరోగ్య సమస్య

పెళ్లి రోజు ఉదయం కూడా ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు వెల్లడి

విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): పెళ్లిపీటల మీద వరుడు జీలకర్ర, బెల్లం పెడుతుండగా వధువు ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన కేసులో మిస్టరీ కొనసాగుతోంది. కేజీహెచ్‌లో శుక్రవారం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మధురవాడలో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన ముంజేటి ఈశ్వరరావు కుమార్తె సృజన(22)కు, మధురవాడ నగరపాలేనికి చెందిన టీఎన్‌టీయూసీ నాయకుడు నాగోతి శివాజీకి బుధవారం రాత్రి వివాహం జరుగుతుండగా వధువు కుప్పకూలిపోవడం, హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందడం తెలిసిందే. ఆమె మృతికి విషం తీసుకోవడం కారణమై ఉండవచ్చునని వైద్యులు అనుమానం వ్యక్తంచేయడం, ఆమె హ్యండ్‌బ్యాగ్‌లో గన్నేరుపప్పు లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చుననుకున్నారు. కానీ సృజన సోదరుడు విజయ్‌ శుక్రవారం మార్చురీ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ తన సోదరి మృతి విషయంలో మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆత్మహత్య చేసుకున్నట్టు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని, అనారోగ్య సమస్య తలెత్తడం వల్లే మృతి చెందివుంటుందని పేర్కొన్నారు. ముహూర్తానికి రెండు రోజులు ముందు నుంచి సృజనకు బాగుండడం లేదన్నారు. పెళ్లిరోజు ఉదయం ఆరు గంటలకు కూడా ఆస్పత్రికి తీసుకువెళ్లామని, రెండు సెలైన్లు ఎక్కించారని, తిరిగి కోలుకోవడంతో సాయంత్రం వేదిక వద్దకు తీసుకువచ్చామన్నారు. పెళ్లి రోజు ఆమెకు డేట్‌ (నెలసరి) కావడంతో మాత్రలు వేసుకుందని, దానివల్ల ఆమెకు కడుపునొప్పి వచ్చిందని, ఈ క్రమంలో ఆరోగ్య సమస్య ఏదైనా తలెత్తి మృతికి కారణమై ఉండవచ్చునని అనుమానం వ్యక్తంచేశారు. ఏదేమైనా పోస్టుమార్టం రిపోర్టు వస్తుందని, అందులో వాస్తవం తెలుస్తుందని అంతవరకూ అనవసర ప్రచారం చేయొద్దని కోరారు. పెళ్లికొడుకు కూడా తమకు బంధువేనని, ఇద్దరి సమ్మతితోనే ముహూర్తం పెట్టామన్నారు. కాగా పోలీసులు మాత్రం ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, ప్రచారం జరుగుతున్నట్టు ఇరువురిలో ఎవరికైనా ప్రేమ వ్యవహారం వంటిది ఏదైనా ఉందా? అనేదానిపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. పోస్టుమార్టంతోపాటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత మృతికి కారణమేమిటనే దానిపై స్పష్టత వస్తుందని సీఐ రవికుమార్‌ తెలిపారు.


Read more