12 సార్లు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్న 84 ఏళ్ల వృ‌ద్ధుడి విషయంలో సీన్ రివర్స్.. తాజా అప్‌డేట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-16T21:56:45+05:30 IST

బీహార్‌ మాధేపురా ప్రాంతానికి చెందిన బ్రహ్మదేవ్ మండల్ (84) అనే వ్యక్తి.. జనవరిలో 12డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి..

12 సార్లు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్న 84 ఏళ్ల వృ‌ద్ధుడి విషయంలో సీన్ రివర్స్.. తాజా అప్‌డేట్ ఏంటంటే..

బీహార్‌ మాధేపురా ప్రాంతానికి చెందిన బ్రహ్మదేవ్ మండల్ (84) అనే వ్యక్తి.. జనవరిలో 12డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బ్రహ్మదేవ్ మండల్ పరారీలో ఉన్నారు. ఒకే వ్యక్తికి 12 సార్లు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం విషయంలో వైద్య వ్యవస్థపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్‌ను అనుసరించి టీకాలు ఇవ్వాల్సి ఉండగా.. అన్ని సార్లు నిందుతుడు వ్యాక్సిన్ తీసుకుంటుంటే ఆరోగ్య శాఖ సిబ్బంది ఎలా గుర్తించలేకపోయారనే ప్రశ్న ప్రస్తుతం వినిపిస్తోంది. ఇదిలా వుండగా తాజాగా బ్రహ్మదేవ్ మండల్‌కు ఆర్జేడీ ఎమ్మెల్యే ప్రొ.చంద్రశేఖర్‌ మద్దతు లభించింది.


బ్రహ్మదేవ్ మండల్ అరెస్టుపై స్టే విధించాలని డిమాండ్ చేస్తూ మాధేపురా ఎస్పీ రాజేష్ కుమార్‌కు ఆర్జేడీ ఎమ్మెల్యే లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలను లేవనెత్తారు. 12 వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా 84 ఏళ్ల వృద్ధుడు ఎలా సురక్షితంగా ఉన్నాడు? రెండు టీకా డోసుల మధ్య 84 రోజుల వ్యవధిని నిర్ణయించినప్పుడు.. 48 గంటల్లోనే రెండుసార్లు టీకా తీసుకున్నా కూడా సదరు వృద్ధుడిపై వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం ఎందుకు చూపలేదు? బ్రహ్మదేవ్ మండల్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా తన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పిన వాదనలో ఎంత మేర నిజం ఉంది? వ్యాక్సిన్‌లు నిజంగా పెయిన్‌కిల్లర్‌గా పనిచేస్తాయా?.. తదితర ప్రశ్నలను ఆయన లేవనెత్తారు.

టికెట్ కౌంటర్ ఒక రాష్ట్రంలో.. బాత్రూం మరో రాష్ట్రంలో.. భారత్‌లోనే అరుదైన రైల్వేస్టేషన్ కథ ఇదీ..!


అలాగే వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని ఎమ్మెల్యే ఎండగట్టారు. ఆధార్ ప్రకారం టీకా ఇస్తున్నప్పుడు.. వృద్ధుడికి అన్నిసార్లు టీకాలు ఎలా వేశారని ప్రశ్నించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. తన ప్రశ్నలకు పోలీసులు, వైద్య నిపుణులు సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు, జన్ అధికార్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాధేపురా మాజీ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కూడా బ్రహ్మదేవ్ మండల్‌‌కు మద్దతు తెలిపారు. ఈ అంశంపై మధేపురా ఎస్పీ మాట్లాడుతూ వివిధ గుర్తింపుకార్డులు, ఫోన్ నంబర్లను ఉపయోగించి వృద్ధుడు వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. విచారణకు నిందితుడితో పాటూ అంతా సహకరించాలని కోరారు.

బీకాం విద్యార్థినిని ఆమె తల్లితో సహా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం చేసేవాళ్లంటే..

Updated Date - 2022-01-16T21:56:45+05:30 IST