సమస్యల సాగరం

ABN , First Publish Date - 2021-04-11T06:42:46+05:30 IST

పాలకుల పాపం నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి శాపంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది.

సమస్యల సాగరం
త్రిపురారం మండలం అల్వాలపాడు-రాజేంద్రనగర్‌ గ్రామాల మధ్య నిలిచిన రహదారి పనులు

 ఎన్నికలప్పుడే హామీలు గుప్పుతున్న పార్టీలు
 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
 ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపని
నాగార్జునసాగర్‌ ప్రజాప్రతినిధులు
 ఎన్నికల వేళ సమస్యల ఏకరువు

 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)

పాలకుల పాపం నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి శాపంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడే హామీలను గుప్పిస్తున్న పార్టీలు ఆతర్వాత సమస్యలను గాలికొదిలేస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారంకాక సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. ఈ ఏడు మండలాల్లో కూడా తాగు నీటి సమస్య, అధ్వాన రోడ్లు, ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలు కూడా లేవు. ప్రతిసారి వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు తాము గెలిస్తే ఈ ఐదేళ్లలోనే రాష్ట్రంలోనే నాగార్జునసాగర్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పడం మినహా అభివృద్ధి గురించి పట్టించుకున్న వారే లేరని నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉద్ధండులే ఉన్నారు. అయినప్పటికీ ఏఒక్క వర్గానికి కూడా న్యాయం జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో అనుముల, పెద్దవూర, గుర్రంపోడు, నిడమనూరు, త్రిపురారం, తిరుమలగిరిసాగర్‌, మాడ్గులపల్లి మండలంలోని పది గ్రామాలు ఈనియోజకవర్గంలోనే ఉన్నాయి.
సమస్యల వలయంలో పల్లెలు
నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. గుర్రంపోడు మండల కేంద్రంలో ఇప్పటి వరకు బస్టాండు నిర్మాణం కాలేదు. దీనికి సంబంధించి స్థల సేకరణ కూడా జరగలేదు. రహదారులపై నిలబడి బస్సులు, ఆటోల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్లు, భవనాల శాఖకు సబంధించిన భవన స్థలాన్ని సేకరించి బస్టాండును ఏర్పాటు చేస్తామని దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హామీ ఇచ్చినప్పటికీ నేటికీ అమలుకు నోచలేదు. మండలంలో 7బీ డిస్ట్రిబ్యూటర్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జూనూతల గ్రామంవరకే ఈ కాల్వ నిర్మించారు. పోచంపల్లి గ్రామం వరకూ ఈ కాల్వను నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటివరకు సబ్‌మార్కెట్‌ యార్డు లేకపోవడంతో ఈ మండలానికి చెందిన రైతులు కొండమల్లేపల్లి, దేవరకొండ, హాలియా, చండూరుకు వెళ్లి ధాన్యాన్ని, పత్తిని విక్రయించాల్సి వస్తోంది.
అధ్వాన రహదారులతో అవస్థలు
త్రిపురారం మండలంలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జి నిర్మాణాలు కూడా చేపట్టలేదు. అల్వాలపాడు-రాజేంద్రనగర్‌ గ్రామాల మధ్య రోడ్లు అధ్వానంగా మారాయి. కొత్త మండలాల ఏర్పాటు సమయంలో యంత్రాంగం అనేక తప్పిదాలు చేసింది. పెద్దదేవులపల్లి గ్రామానికి సంబంధించి త్రిపురారం మండలంలో రెవెన్యూ పరిపాలన నడుస్తుండగా లాఅండ్‌ఆర్డర్‌ సమస్య మాత్రం మాడ్గులపల్లిలో ఉండడం గమనార్హం. ఈ రెండు మండలాల మధ్య చిన్నచెరువు, పెద్దచెరువు సమస్యగా మారింది. ఈ చెరువుల ప్రాంతంలో ఎవరైనా చనిపోయినా, గొడవలు జరిగినా రెండు పోలీ్‌సస్టేషన్ల యంత్రాంగం సైతం పట్టించుకున్న దాఖలాలులేవు. 
చివరి ఆయకట్టుకు నీరేది
పెద్దవూర మండలంలో ఏఎమ్మార్పీ కింద చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. జూనియర్‌ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్‌కు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు.
ఇదే మండలంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో రోగులు, ప్రజలు వైద్యంకోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు.
ప్రభుత్వ భూములకు అందని పట్టాలు
తిరుమలగిరి సాగర్‌ మండలంలో ప్రభుత్వం అందజేసిన భూములకు పట్టాలు ఇవ్వలేదు. కబ్జాలో ఉన్నట్లు మాత్రం ధ్రువీకరణపత్రాలు మాత్రం ఇచ్చారు. 2000 మంది లబ్ధిదారులు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మండలంలో ఏఒక్క ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనాలు లేవు. అరకొర సౌకర్యాలతో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
ఇక్కడ మురుగునీటి సమస్యే ప్రధానం
హాలియా మండలంలో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. మండల కేంద్రంలో ఆస్పత్రి ఉన్నప్పటికీ వైద్య సేవలకు సంబంధించి పరికరాలు అందుబాటులోలేవు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
పూర్తి కాని మిషన్‌ భగీరథ పనులు
నిడమనూరు మండలంలో మిషన్‌ భగీరథ పనులు పూర్తికాక ఇంకా 10 గ్రామాలకు కృష్ణాజలాలు అందడంలేదు. మండల కేంద్రంలో ఉన్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా రూపొందిస్తామని హామీ ఇచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇక్కడ మినీ స్టేడియం నేటికీ పనుల ప్రారంభానికి నోచలేదు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను నిడమనూరులో ఏర్పాటు చేస్తామన్నప్పటికీ స్థలసేకరణ చేపట్టలేదు.
లింకురోడ్లు లేక ఇబ్బందులు
మాడ్గులపల్లి మండలంలోని పది గ్రామాలు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఉన్నాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో లింకు రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూసలపాడు, లక్ష్మీపురం, కంపాలపల్లి లింకు రోడ్లు లేవు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో అలవికాని హామీలు ఇస్తున్న నేతలు, తమ నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యలు తీరడం లేదు
వర్థం సైదులు, త్రిపురారం

స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎన్నికలు వస్తే తప్ప ఏనాయకుడైనా అభివృద్ధి గురించి మాట్లాడరు. ఓట్లు వేశాక మమ్మల్ని చూసే వారు ఉండరు. నాయకుల మాటలను జనం నమ్మడం లేదు.
హామీలు షరా మూమూలే
శంకర్‌, నిడమనూరు

ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం, తర్వాత వాటి ఊసే ఎత్తకపోవడం షరా మూములే. మినీ ట్యాంక్‌ బండ్‌, స్పోర్ట్స్‌ స్టేడియం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వంటి వాటి నిర్మాణంపై నాయకులు దృష్టిసారించాలి.

Updated Date - 2021-04-11T06:42:46+05:30 IST