అభిషేకం టిక్కెట్ల వ్యవహారంపై విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2022-08-10T06:21:08+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో 52 శాశ్వత అభిషేకం టిక్కెట్లను ఒకే వ్యక్తి పేరిట జారీ చేసిన వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

అభిషేకం టిక్కెట్ల వ్యవహారంపై విచారణ జరిపించాలి
సామాన్య భక్తులకు న్యాయం చేయాలని కోరుతున్న ప్రతాప రామకృష్ణ

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడ, ఆగస్టు 9: వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో 52 శాశ్వత అభిషేకం టిక్కెట్లను ఒకే వ్యక్తి పేరిట జారీ చేసిన వ్యవహారంపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ‘శాశ్వత పూజల పేరిట గోల్‌మాల్‌’ అనే శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఆలయ ఏఈవో, ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంకేపల్లి హరికిషన్‌ను కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల తప్పుడు నిర్ణయాలకు వత్తాసు పలికి కిందిస్థాయి ఉద్యోగులను బలిపశువులను చేయవద్దని, ధనవంతుడైన ఓ వ్యక్తికి అక్రమంగా టికెట్లు కేటాయించిన వైనంపై లోతుగా విచారణ చేయాలని కోరారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన ఈవో రమాదేవికి దేవాదాయ శాఖపై  అవగాహన లేదని, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని అన్నారు. అనంతరం ప్రతాప రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ దేవుని కోసం, సామాన్య భక్తుల కోసం కోసం పనిచేయాల్సిన అధికారులు వీఐపీలు, కోటీశ్వరులకు మాత్రమే సేవ చేస్తున్నారని, ఎమ్మెల్యేలను సైతం సోమవారం  గర్భాలయంలోకి అనుమతించని ఆలయ ఈవో రమాదేవి వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తిని ప్రతీ సోమవారం నిబంధనలకు విరుద్ధంగా గర్భాలయంలోకి ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఆలయ ఈవోగా రమాదేవి విధులు స్వీకరించిన మరుసటి రోజే కేవలం 1.56 లక్షలకే పదేళ్ల పాటు చెల్లుబాటయ్యే విధంగా 52 అభిషేకం టిక్కెట్లు సదరు వ్యక్తి పేరిట జారీ చేశారన్నారు. అవినీతికి పాల్పడిన ఐఏఎస్‌ అధికారులు సైతం జైలుకు వెళ్లిన ఘటన మరిచిపోవద్దని, సాక్షాత్తూ దేవాదాయ శాఖ కమిషనర్‌ సైతం రబ్బరు స్టాంపుగా మారారని అన్నారు. ఈ అంశంపై మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, కేటీఆర్‌   సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా జారీ చేసిన టిక్కెట్లను వెంటనే ్ల రద్దు చేసి బాఽద్యులపై చర్యలు తీసుకోవాలని, సామాన్య భక్తులను ప్రతీ సోమవారం  గర్భాలయంలోకి అనుమతించాలని కోరారు.  ఆలయ ఈవో రమాదేవిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ పట్టణ కార్యదర్శి ముప్పిడి శ్రీధర్‌ మాట్లాడుతూ అక్రమంగా టికెట్లు జారీ చేసిన వ్యవహారంపై విజిలెన్సు విచారణ జరిపించాలని, ఆలయ ఈవో ఎల్‌.రమాదేవిని సస్పెండ్‌ చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-08-10T06:21:08+05:30 IST