అలుపెరుగని యోధుడు

ABN , First Publish Date - 2021-04-20T06:11:03+05:30 IST

40ఏళ్ళ రాజకీయ అనుభవంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా...

అలుపెరుగని యోధుడు

40ఏళ్ళ రాజకీయ అనుభవంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, అనుక్షణం ప్రజల పక్షాన నిలిచి, నికార్సైన రాజకీయాలకు నిలవెత్తు నిదర్శనంగా పేరు పొందారు నారా చంద్రబాబు నాయుడు. 70 యేళ్ల వయస్సులోనూ అదే ఉత్సాహంతో, అదే దీక్షతో నవ్యాంధ్ర కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 


కాలేజీలో చదివే రోజుల్లోనే రాజకీయ చైతన్యం ఆయనలో మొగ్గ తొడిగింది. విద్యార్థి నాయకుడిగా తిరుపతిలోని వెంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్, హిస్టరీలో కాలేజీ విద్యను ముగించారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం ఎంఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా పొందారు. ఈ దశలోనే క్రియాశీల రాజకీయాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. 1977లో దివిసీమ ఉప్పెన సందర్బంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయనలోని సామాజిక సేవాభిలాషకు, మానవత్వానికి, నాయకత్వ పటిమకు అద్దం పట్టాయి. 


చంద్రబాబు నాయకత్వ ప్రతిభను గమనించిన అగ్రనాయకులు 1978లో చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఇరవై ఎనిమిదేళ్ళ వయస్సులో సినిమాటోగ్రఫి, పురావస్తుశాఖ, సాంకేతిక విద్యా శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. తదనంతర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలో జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపటట్టం చారిత్రాత్మకం. 1989లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైనప్పుడు, ఎన్టీఆర్‌ అసెంబ్లీని బహిష్కరించినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి చట్టసభల్లో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.


1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. ఒక ముఖ్యమంత్రి జిల్లా కేంద్రాలకు వెళ్లడమే గగనమనుకునే రోజుల్లో ఆయన గ్రామ గ్రామానికీ చొరవగా వెళ్ళారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రాన్ని ప్రగతి రథం వైపు పరుగులు తీయించారు. ప్రభుత్వ పథకాల లోటుపాట్లను స్వయంగా సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు పారిశ్రామిక బోర్డును ఏర్పాటు చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు, కంప్యూటర్‌ విద్య, మహిళా కండక్టర్లు వంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. దార్శనికతతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపాలు. అమెరికా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను హైదరాబాద్‌ తీసుకురాగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా యువతకు కళ్లు చెదిరే జీతాలొచ్చాయి. రైతు బిడ్డలనూ రత్నాలుగా మార్చారు. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు.


యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లౌకికవాదానికి కట్టుబడి బైట నుండి షరతులతో కూడిన మద్దతు ఇచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో మద్దతు తెలిపారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు. 


అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే. మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు అన్న పానీయాలు విడిచి నిరవధిక నిరహారదీక్ష చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ హైకమాండ్‌ రాష్ట్ర విభజన అంశాన్ని వినియోగించుకొని తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టడంపై ఢిల్లీ స్థాయిలో నిలదీశారు. ఏపీ భవన్‌లో ఆరు రోజులపాటు నిరవధిక దీక్ష చేసి తెలుగు వారి సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా అరవై మూడేళ్ళ వయసులో కాళ్లు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా 208 రోజులు/ 7 నెలలపాటు దాదాపు 2,817 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచారు. 


చంద్రబాబునాయుడి జీవితంలో నేర చరిత్ర లేదని ప్రతిపక్ష నేతలే ఒప్పుకుంటారంటే అతిశయోక్తి కాదు. ఆయనపై అవినీతి మరక అంటించేందుకు ప్రత్యర్థులు కోర్టుల్లో వేసిన కేసులన్నీ నీరుగారిపోయాయి. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమనిధిని ఏర్పాటు చేసి ప్రతీ కార్యకర్తకు నూటికి నూరుశాతం సంక్షేమనిధి ద్వారా న్యాయం జరిగేలా చేశారు. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీలోనూ ఇలా కార్యకర్తలకు అండగా నిలిచిన పార్టీ లేదు. కార్యకర్తలలో నాయకత్వ లక్షణాలు పెంచి, వారిని సమర్థవంతమైన నాయకులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో నాయకత్వ శిక్షణా శిబిరం పేరిట ప్రకాశం జిల్లాలోని కందుకూరు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాలోని నల్లజర్ల, విజయనగరం జిల్లా కేంద్రంలోనూ శిక్షణా శిబిరాలను చంద్రబాబు నాయుడు నిర్వహించారు. సుమారు నలభై ఆరు వేల మంది కార్యకర్తలకు శిక్షణనిచ్చారు. బలహీన వర్గాలకు చెందిన వేలాది మందిని నాయకులుగా తీర్చిదిద్దారు.


ఇంటి పెద్ద సమర్థుడైతే ఆ కుటుంబం అన్ని విధాలుగానూ ముందంజ వేస్తుంది. అలాగే సమర్థవంతమైన నాయకుడి వల్ల ఆ ప్రాంతం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. పట్టుదల, సేవాతత్వం వంటి స్వతస్సిద్ధ లక్షణాలతో అత్యున్నతమైన నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎదిగారు. రాష్ట్ర విభజనతో తెలుగుజాతి ప్రభావం జాతీయ స్థాయిలో తగ్గింది. మళ్లీ తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకొచ్చే నాయకుడు ఎవరంటే ప్రజలకు మొదట గుర్తుకొచ్చింది చంద్రబాబునాయుడే. అదే నమ్మకంతో 2014 ఎన్నికలలో పార్టీకి పట్టం కట్టారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్, 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటుతో రాజధాని, నిధులు లేకుండా పాలన మొదలుపెట్టి కేవలం ఐదేళ్ళల్లో దేశంలో ఎక్కడా అమలు కానన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపే వరకు ప్రమాణస్వీకారం కూడా చేయని మహోన్నతమైన వ్యక్తి. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న పోలవరాన్ని రికార్డు సమయంలో 69% నిర్మించారు. పట్టిసీమ ద్వారా 40 వేల కోట్ల విలువైన పంటను కాపాడారు. రూ.70వేల కోట్లను కేవలం జలవనరులకు కేటాయించి తొలి ప్రాధాన్యతను ఇచ్చారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా ఉపశమనం, ఫైబర్‌గ్రిడ్‌, నదుల అనుసంధానం వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. పేదరికం లేని, ఆర్థిక అసమానతలు లేని, ఆనందమయ, ఆరోగ్యకర రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేశారు. 


జయాపజయాలు రాజకీయ నాయకులకు సహజం. కానీ వాటితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ జనంలోనే ఉంటూ వారిలో ఒకడిగా మమేకమయ్యే లక్షణమే చంద్రబాబు నాయుడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసానిస్తూ ధైర్యం నింపుతున్నారు. చివరగా చెప్పాలంటే ప్రజలే చంద్రబాబుకు లోకం, ప్రజలకే చంద్రబాబు ఎల్లప్పుడూ దాసోహం. 

ఆలపాటి రాజేంద్రప్రసాద్

మాజీ మంత్రి 

(నేడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం)

Updated Date - 2021-04-20T06:11:03+05:30 IST