మంట గ్యాస్‌..

ABN , First Publish Date - 2022-05-09T11:45:46+05:30 IST

సామాన్యుడిపై ధరల మోత మోగతానే ఉంది. తగ్గేదేలా అన్నట్లు ఓ పక్క నిత్యావసర వస్తువులు భగభగమంటుండగా... మరో పక్క పెట్రో మంటలు రేగుతున్నాయి. ఇక స్విచ్‌ వేయకుండానే

మంట గ్యాస్‌..

సిలిండర్‌ పై రూ.50 పెంపు        

జిల్లా వాసులపై మళ్లీ రూ.4 కోట్లు భారం

(కడప-ఆంధ్రజ్యోతి): సామాన్యుడిపై ధరల మోత మోగతానే ఉంది. తగ్గేదేలా అన్నట్లు ఓ పక్క నిత్యావసర వస్తువులు భగభగమంటుండగా... మరో పక్క పెట్రో మంటలు రేగుతున్నాయి. ఇక స్విచ్‌ వేయకుండానే కరెంట్‌ చార్జీలు షాక్‌ కొడుతున్నాయి. బస్సు చార్జీలు బుసలు కొడుతున్నాయి. ఇక నూనె ధరలు సలసలా కాగుతుంటే... ఇవి చాలదన్నట్లు ప్రస్తుతం వంటింట్లో గ్యాస్‌ మంటలు ఎగిసి పడితున్నాయి. స్టవ్‌ వెలిగించిన వెంటనే భగ్గుమని మంట వస్తోంది. ఎందుకంటే 45 రోజుల వ్యవధిలోనే రెండోసారి సిలిండర్‌పై మరో రూ.50 చమురు సంస్థలు పెంచేశాయి. వెరసి ఉమ్మడి జిల్లా వాసులపై సుమారు రూ.40 కోట్ల భారం పడనుంది. 


ఇదేం బాదుడురా..

పొద్దున లేస్తే చాలు దేనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతాయోనని పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు గజగజ వణికిపోతున్నారు. కరోనా అందరి జీవితాలను చిదిమేసింది. నిజం చెప్పాలంటే పేద, సామాన్యుల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసింది. వరుసగా రెండేళ్ల పాటు క రోనా ఎఫెక్ట్‌ దినసరి కూలీలు పేద, మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల వాత పెడుతూనే ఉన్నాయి. ఓ పక్క పెట్రోల్‌, డీజల్‌ ధరలు బులియన్‌ మార్కె ట్‌ ధరలను తలదన్నేలా పెరుగుతున్నాయి. మరో పక్క ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నుల మోత మోగిస్తోంది. వాటి నుంచి కోలుకునేలోపే పట్టణాల్లో ఆస్తి పన్నుల, చెత్త పన్ను అమలు చేశారు. వెరసి పన్నుల భారం జనంపై పడింది. అంతలోపే కరెంట్‌, బస్సు చార్జీలు పెరిగాయి. ఈ దెబ్బతో సామాన్యుడు వామ్మో అనుకునేలోపే ప్రభుత్వ సంస్థలు సిలిండర్‌పై రూ.50 పెంచేశాయి. ఉమ్మడి జిల్లాలో 8,12,013 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెల సరాసరి రూ.8 లక్షల గ్యాస్‌ సిలిండర్లు వినియోగంలో ఉన్నాయి. ఇప్పటిదాకా కడపలో గ్యాస్‌ సిలిండర్‌ ధర 999.50 ఉండేది. అయితే ఇప్పుడు రూ.50 పెరగడంతో ఆ పెంపు 1050పై చిలుకు చేరుకుంది. దీనికి అనధికారిక రవాణా చార్జీలు కలుపుకుంటే రూ.1100 చెల్లించాలన్నమాట. రవాణా చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఉతుత్తి ప్రకటనలు చేస్తున్నారు తప్ప చర్యలు మాత్రం నామ మాత్రమే. 


జనంపై బాదుడే బాదుడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ టైంలో అధికారంలోకి వచ్చాయో గానీ జనంపై పన్నుల బాదుడు బాదుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తు న్న రైతు భరోసా, పీఎం కిసాన్‌, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాల ద్వారా అందించే పథకాల నిధులను ఇతర మార్గాల్లో లాగేస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక విధంగా జనంపై పన్నుల భారం మోపుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా ఒకటో తేదీ వస్తే చాలు జీతాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు సం స్థల్లో పని చేసే ఉద్యోగులు ఎదురు చూసే వారు. అయితే ఇప్పుడు పెట్రోల్‌, డీజల్‌ ఎంత పెరిగింది. కరెంట్‌  చార్జీలు ఎంత పెరిగాయి. ఆస్తి పన్ను, రిజిస్ర్టేషన్‌ ఇతర చార్జీలు ఎంత పెరుగుతాయోనని ప్రజలు ఎదురు చూడాల్సిన దిక్కుమాలిన పరిస్థితి. దీనిని బట్టి చూస్తే జనంపై పన్నుల భారం ఎంత బాధిస్తుందో అర్థం అవుతోంది. 7్ఙ


కట్టెల పొయ్యే మేలు..

- భాగ్యమ్మ, రాచాయపేట

కట్టెలతో వంట చేసుకుంటే కళ్లు దెబ్బతినడంతో పాటు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చా రు. ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీకి ఇవ్వడంతో అం దరూ కొనుగోలు చేశాం. అయితే ఇప్పుడు సిలిండర్‌ ధర బంగారంతో పోటీ పడుతోంది. ఇప్పుడు రూ.50 పెంపుతో సిలిండర్‌ కావాలంటే  రూ.1100 ఇవ్వాలి. అంత సొమ్ము చెల్లించేకన్నా కట్టెల పొయ్యిపై వంట చేసుకోవడం మేలు. 


సామాన్యుడు బతకాలంటే కష్టం..

- సుధాకర్‌రెడ్డి, బద్వేలు 

ప్రజలు ఆర్థికంగా బలపడడం లేదు. ఆర్థికంగా మెరుగుపడేందుకు ప్రభుత్వాలు ఏమి చేయడం లేదు. అయితే పన్నులు వేసి జనాన్ని భారీగా మోదేస్తున్నారు. మార్చిలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధర పై రూ.50 పెంచారు. ఇప్పుడు రూ.50 పెంచారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో సామాన్యుడు బతకడమే గగనంగా మారింది.


వంటగ్యాస్‌ సిలిండర్‌కు వర్ధంతి

వేంపల్లె మే 8: పదేపదే వంట గ్యాస్‌ ధర పెంచుతున్నందుకు నిరసనగా ఆదివా రం వేంపల్లెలో కాంగ్రెస్‌ నాయకులు వంటగ్యాస్‌ సిలిండరుకు వర్ధంతి జరిపా రు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి మా ట్లాడుతూ గత మార్చి 20వ తేదీ  మోడీ ప్రభు త్వం వంటగ్యాస్‌ సిలిండరు ధర రూ.50 పెంచింద న్నారు. మళ్లీ ఇంతలోనే మే 8న రూ.50 పెంచింద న్నారు. కాంగ్రెస్‌ పాలనలో సిలిండరు ధర రూ.410 ఉండి అందరికి అందుబాటులో ఉండేదన్నారు. మోడీ పాలనలో సిలిండరు ధర రూ.1035 అయిం దన్నారు. మహిళలు వంటింట్లోకి పోవా లంటే భయపడి పోతున్నారన్నారు. వాణిజ్య సిలిండరు ధర కూడా అమాంతంగా పెరిగి రూ.2500 అయిం దన్నారు. చిన్నచిన్న హోటళ్లు, మెస్సులు, తోపుడు బండ్ల మీద ఆహార పదార్థాలు అమ్మేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకవైపు అచ్చేదిన్‌ అంటూ మరోవైపు మోడీ ప్రజలకు చచ్చేదినాలు చూపిస్తున్నారన్నారు. మదర్స్‌ డే సందర్భంగా నరేంద్ర మోడీ మహిళలకు ఇచ్చిన గిఫ్ట్‌ ఇదేనా అని  ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సుబ్ర హ్మణ్యశర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, చెన్నకేశవ, వేంపల్లె మండల శాఖ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఉత్తన్న, రమణమ్మ, వెంకటేశ్‌, ఈశ్వరయ్య, సత్తార్‌, ఓబయ్య, రామిరెడ్డి, జానకిరామ్‌, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. 



Read more