‘Airportలో ఉన్నా.. ఈ ఒక్క సాయం చెయ్..’ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నిండా ముంచిన దొంగ NRI

ABN , First Publish Date - 2021-09-07T02:01:06+05:30 IST

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ 29ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఓ ఎన్నారై పరిచయమయ్యాడు. తన పేరు విజయ్ ఖరే అని, అమెరికాలో ఉంటున్న..

‘Airportలో ఉన్నా.. ఈ ఒక్క సాయం చెయ్..’  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నిండా ముంచిన దొంగ NRI

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ 29ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు మాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో ఓ ఎన్నారై పరిచయమయ్యాడు. తన పేరు విజయ్ ఖరే అని, అమెరికాలో ఉంటున్న ఎన్నారైనని చెప్పాడు. కొంతకాలం  పరిచయం తర్వాత ఇద్దరూ కలుసుకోవాలనుకను్నారు. తాను ఇండియాకు రాగానే కలుస్తానని ఆమెకు మాటిచ్చాడు. ఓ రోజు ఫోన్ చేసి తాను భారత్ వచ్చానని, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నానని ఆమెకు విజయ్ చెప్పాడు. ఆమె ఎంతో సంతోషపడింది. ఇంతలో మళ్లీ ఫోన్ చేసిన విజయ్.. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న తాను ఓ సమస్యలో చిక్కుకున్నానని, సాయం చేయాలని ప్రాథేయపడ్డాడు.


‘నాతో దాదాపు రూ.2 కోట్ల విలువైన డాలర్లు తీసుకొచ్చాను. కానీ అంతా ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు తీసేసుకున్నారు. ఆ డబ్బు వెనక్కి తీసుకోవాలంటే పెనాల్టీ కట్టాలని అధికారులు చెబుతున్నారు. నువ్వే నాకు సాయం చేయాలి’ అంటూ ఆమెను నమ్మబలికాడు. కావాలంటే అధికారితో మాట్లాడాలంటూ పక్కన మరో వ్యక్తితో మాట్లాడించాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారినంటూ ఫోన్‌లో మాట్లాడిన ఆ అధికారి విజయ్ చెప్పేదంతా నిజమేనని నమ్మించాడు.


ఫోన్‌లో ఇదంతా విన్న యువతి.. ఇష్టపడిన వ్యక్తి కష్టంలో ఉన్నాడనే కంగారులో వెంటనే విజయ్ కోరినట్లు సాయం చేసింది. కనీసం అతడి ముఖం కూడా చూడకుండానే రూ.4.22 లక్షల రూపాయలు ఆన్‌లైన్‌లో పంపింది. అయితే డబ్బు అతడికి చేరిన మరుక్షణం అతడి నిజస్వరూపం బయటపడింది. అతడి నుంచి కాల్స్ రావడం ఆగిపోయింది. కనీసం ఆమె కాల్స్ కూడా ఎత్తడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి.. కపిల్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-07T02:01:06+05:30 IST