సమస్యల సుడిలో ఆదర్శ బడి

ABN , First Publish Date - 2022-08-05T16:53:50+05:30 IST

ఆంగ్ల మాధ్యమం, ఆధునిక వసతులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, సృజనాత్మక పాఠ్యాంశాలు, వసతి గృహ సదుపాయం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో ఏర్పడిన ఆదర్శ పాఠశాలలు నేడు సమస్యలతో సతమతమవుతున్నాయి.

సమస్యల సుడిలో ఆదర్శ బడి

ఆంగ్ల మాధ్యమం, ఆధునిక వసతులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు(teachers), సృజనాత్మక పాఠ్యాంశాలు, వసతి గృహ సదుపాయం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో ఏర్పడిన ఆదర్శ పాఠశాలలు(ideal school ) నేడు సమస్యలతో సతమతమవుతున్నాయి.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 194 ఆదర్శ పాఠశాలల పరిధిలో 3,880 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 1053 బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తిస్థాయి పోస్టులు భర్తీ చేయకపోవడంతో కొన్నేళ్లుగా హవర్లీ బెస్ట్ టీచర్లతో పని చేయిస్తున్నారు. ఏటా వేసవి రాగానే వారిని తీసివేసి, పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పుడు తిరిగి తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ వారిని సకాలంలో తీసుకోకపోవడంతో తరగతుల నిర్వహణకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉన్న బోధన సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం ఇంకా క్యాడర్ విభజన జరగలేదు. ఆదర్శ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి సదుపాయం లేకపోవడం వల్ల పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఆసుపత్రుల పాలు, అప్పుల పాలు అవుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ సదుపాయం ఉన్నా, మోడల్ స్కూలు ఉపాధ్యాయులకు మాత్రం ఇవ్వడం లేదు. ఈ ఉపాధ్యాయులకు ప్రతి నెలా చెల్లించే జీతం విద్యాశాఖ కమిషనర్ చెక్ ద్వారా ప్రిన్సిపాల్ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల సకాలంలో జీతాలు అందడం లేదు. సర్వీస్‌లో ఉండి చనిపోయిన ఉపాధ్యాయుల స్థానంలో కారుణ్య నియమకాలు చేపట్టడం లేదు. గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు. సిపిఎస్ సొమ్ముకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం లేదు. ఒక్కో ఆదర్శ పాఠశాలలో 800–1000 మంది విద్యార్థులు ఉండగా, ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. 6 నుంచి 10 తరగతులకు, ఇంటర్ తరగతులకు ఓకే ఒక్క టి.జి.టి ఉపాధ్యాయుడు హిందీ బోధిస్తున్నాడు. దీనివల్ల హిందీ సబ్జెక్టులో నాణ్యమైన బోధన విద్యార్థులకు అందడం లేదు. అలాగే 6–10 తరగతుల విద్యార్థులకు వసతి గృహ సదుపాయం లేదు. ఇంటర్ ప్రవేశాలు పొందిన బాలికల్లో 33 శాతం మందికి మాత్రమే వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఆదర్శ పాఠశాలలో ఏటా 50 మంది ప్రథమ సంవత్సరం, మరో 50 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వసతి లభిస్తుంది. దీంతో మిగిలిన విద్యార్థులు ఇళ్ల నుంచి పాఠశాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమ్మాయిల రక్షణ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుల న్యాయమైన కోరికల్ని రాష్ట్ర ప్రభుత్వం తీర్చే ప్రయత్నం చేయాలి. మోడల్ స్కూల్‌కి సంబంధించి ఒకే నోటిఫికేషన్, ఒకే సెలక్షన్ లిస్టులో ఉండి వేర్వేరు విడతల్లో నియమించడంతో పలువురు సర్వీస్‌ను కోల్పోయారు. వీరి వేతనాల్లోను వ్యత్యాసం ఉంది. వీరందరికీ 43 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులు వర్తింపజేయాలి. 2013 నుంచి ఒకే చోట పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం బదిలీలు, పదోన్నతులు కల్పించాలి. సర్వీసులో ఉండి మరణిస్తున్న ఉపాధ్యాయులకు సిపిఎస్ డెత్ గ్రాట్యుటీ ఇవ్వాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఉపాధ్యాయులందరికీ సకాలంలో జీతాలు చెల్లించాలి. తెలంగాణ ఇంక్రిమెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1053 ఆదర్శ ఉపాధ్యాయుల పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలి. హిందీ బోధన కొరకు మరో పీజీటీ ఉపాధ్యాయుని కేటాయించాలి. 300 విద్యార్థులకు ఒక ఫిజికల్ డైరెక్టర్‌ను నియమించాలి. ఆదర్శ పాఠశాలలో చదువుతున్న బాలికలకైనా వసతి గృహ సదుపాయం కల్పించాలి. మౌలికవసతుల కల్పన జరిగినప్పుడే ఆదర్శ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల నాణ్యత పెరుగుతుంది. పేరులోనే ఉన్న ఆదర్శం సార్థకమవుతుంది.


-అంకం నరేష్

Updated Date - 2022-08-05T16:53:50+05:30 IST