హెచ్చెల్సీ స్థలంపై కన్ను

ABN , First Publish Date - 2022-10-07T05:30:00+05:30 IST

హెచ్చెల్సీ స్థలాన్ని యథేచ్ఛగా కాజేస్తున్నారు. ఇప్పటికే భారీగా అన్యాక్రాంతం కాగా, తాజాగా అధికార పార్టీ కన్నేసింది. రూ.కోట్ల విలువైన స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది.

హెచ్చెల్సీ స్థలంపై కన్ను
కాజేసేందుకు యత్నిస్తున్న స్థలం ఇదే

అధికార పార్టీ కార్యాలయం పేరిట ఎత్తు

ఎకరన్నర లీజుకు ఇవ్వాలని ప్రతిపాదన

జలవనరుల శాఖలో కదులుతున్న లీజు ఫైల్‌


అనంతపురం క్లాక్‌టవర్‌ : హెచ్చెల్సీ స్థలాన్ని యథేచ్ఛగా కాజేస్తున్నారు. ఇప్పటికే భారీగా అన్యాక్రాంతం కాగా, తాజాగా అధికార పార్టీ కన్నేసింది. రూ.కోట్ల విలువైన స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. లీజు పేరిట ఎకరన్నర స్థలంలో జెండా పాతేదిశగా జలవనరుల శాఖలో పావులు కదుపుతోంది. జలవనరుల శాఖ పరిధిలోని హెచ్చెల్సీకి రూ.కోట్ల విలువైన స్థలం నగరంలో ఉంది. 1959లో ఐదు ఎకరాల్లో 52 క్వార్టర్స్‌ను నిర్మించారు. కొన్నేళ్ల తరువాత ఆ ప్రాంతంలో దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగాయి. దీంతో ఉద్యోగులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ కారణంగా 20 ఏళ్లుగా ఆ స్థలం ఖాళీగా ఉంటోంది. మొదట 37 ఎకరాలు ఉన్న హెచ్చెల్సీ స్థలం.. ఆక్రమణలు పోనూ 26 ఎకరాలకు పరిమితం అయింది. అందులో మరో నాలుగు ఎకరాలను కాజేశారు. చివరకు మిగిలిన 22 ఎకరాలలో 3 ఎకరాలను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. తాజాగా జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న 19 ఎకరాలలో ఒకటిన్నర ఎకరం లీజుకు ఇవ్వాలని అధికార పార్టీ నుంచి ప్రతిపాదన వెళ్లింది. 


ప్రభుత్వ..  ప్రైవేటు అవసరాలకు..

హెచ్చెల్సీ క్వార్టర్స్‌ ఉన్న స్థలాన్ని ఇప్పటికే పలు కార్యాలయాలకు కేటాయించారు. ఇందులో త్రీటౌన, దిశ పోలీ్‌సస్టేషన్లు, మైనింగ్‌, అగ్రికల్చర్‌ జేడీ, హంద్రీనీవా కార్యాలయాలు తదితరవాటికి 3 ఎకరాలకుపైగా స్థలాలను కేటాయించారు. కళ్యాణమండపం ఏర్పాటు చేసి, అందులో గ్రంథాలయాన్ని అందుబాటులోకి తెస్తామని ఓ ట్రస్టువారు హామీ ఇచ్చి స్థలం తీసుకున్నారు. కానీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయలేదు. కళ్యాణమండపాన్ని మాత్రమే ఏర్పాటు చేయడంతో అనేకమార్లు వివాదం తలెత్తింది. ఈ విషయంలో అధికారులు నోరుమెదపడం లేదు. ఇలా రూ.కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వ, ప్రైవేటు  అవసరాలకు వాడుకుంటున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ కొందరు స్థలాన్ని కాజేస్తున్నారు. మొత్తం 37 ఎకరాలలో ఇప్పటికి 19 ఎకరాలకు మాత్రమే మిగిల్చారు. 




యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

హెచ్చెల్సీ స్థలంలో అనుమతి లేకుండా ఎన్నో నిర్మాణాలు జరిగాయి. వీటికి అద్దె వసూలు చేస్తున్నదెవరో.. అనుభవిస్తున్నవారు ఎవరో తెలియని పరిస్థితి. విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అడిగేనాథుడే లేడు. అక్రమ నిర్మాణాలకు, అద్దె భవనాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీంతో బకాయి ఉన్నవారు అద్దె మొత్తాన్ని చెల్లించారు. అయితే, ఇప్పటి వరకు ఉన్న లీజులు రద్దు చేస్తామని, రెన్యువల్‌ చేసుకోవడానికి వీలు లేదని, స్థలం మొత్తం జలవనరుల శాఖకు అప్పగించాలని అధికారులు సూచింనట్లు తెలుస్తోంది. ఇది అమలు కాకుండా, అధికారపార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 



అధికార పార్టీ కన్ను

 పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు హెచ్చె ల్సీ స్థలంలో ఒకటిన్న ఎకరాలను 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆ పార్టీ ఇచ్చిన లేఖ జలవనరుల శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది. స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు మెజార్టీ అధికారులు ససేమిరా అంటున్నారు. అయితే జలవనరుల శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న ఓ అధికారి గుట్టుగా సహకరిస్తున్నారని ఆ శాఖ అధికారులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ లేఖపై స్పందించిన అధికారి, ఈ పరిశీలించి, అడిగిన స్థలాన్ని కేటాయించాలని సిఫారసు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. లీజు పేరుతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు వక్రమార్గంలో ప్రధాన రాజకీయ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.


మా పరిధిలో లేదు.. - రాజశేఖర్‌, హెచ్చెల్సీ ఎస్‌ఈ

హెచ్చెల్సీ క్వార్టర్స్‌కు సంబంధించిన రూ.కోట్ల విలువ చేసే స్థలాన్ని కాపాడుకుంటాం. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వస్తే, కార్యాలయాలకు స్థలం కేటాయించక తప్పదు. అయితే ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు స్థలం ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు. ఓ రాజకీయ పార్టీ నుంచి స్థలం లీజు ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే. ఆ లేఖను జలవనరుల శాఖ ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే ఆ స్థలంలో జలవనరుల శాఖ సీఈ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. స్థలం కేటాయింపులు, లీజుపై ఉన్నతాధికారులు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. మా పరిధిలో ఉండదు. 


Updated Date - 2022-10-07T05:30:00+05:30 IST