ఉగ్రవాదిగా మారిన కంటి డాక్టర్‌

ABN , First Publish Date - 2022-08-03T09:16:43+05:30 IST

పుట్టింది ఈజిప్టులో.. చిన్నతనం నుంచి మత ఛాందస వాదం వైపు అడుగులు.. ఈజిప్టుతోపాటు, కొన్ని అరబ్‌ దేశాల్లో ఇస్లామిక్‌ చట్టాలు అమలయ్యేలా పోరాటం.

ఉగ్రవాదిగా మారిన కంటి డాక్టర్‌

  • ఈజిప్టులో జననం.. విద్యార్థి దశ నుంచే ఛాందస వాదం
  • అల్‌ కాయిదా ఆవిర్భావంతో చురుకుగా ఉగ్ర కార్యకలాపాలు
  • 9/11 దాడుల్లో కీలక పాత్ర.. పలు దేశాల్లో ఉగ్రదాడులు
  • భారత్‌పైనా గురి.. 2019లో కొత్త ఉగ్ర సంస్థ ఏర్పాటు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): పుట్టింది ఈజిప్టులో.. చిన్నతనం నుంచి మత ఛాందస వాదం వైపు అడుగులు.. ఈజిప్టుతోపాటు, కొన్ని అరబ్‌ దేశాల్లో ఇస్లామిక్‌ చట్టాలు అమలయ్యేలా పోరాటం.. అందుకోసం వైద్య వృత్తిని వీడి, తుపాకీ చేతపట్టి ఉగ్రవాదం వైపు ఉరుకులు, పరుగులు.. అల్‌ కాయిదాలో కీలక వ్యక్తిగా, ఓ దశలో అగ్రరాజ్యాలనే గడగడలాడించిన ఉగ్రసంస్థకు చీఫ్‌గా బాధ్యతలు.. చివరకు మారణహోమాలు తప్ప సాధించిందేమీ లేకుండా.. దారుణంగా హతం..! ఇదీ క్లుప్తంగా అల్‌ కాయిదా చీఫ్‌ అయ్‌మాన్‌ అల్‌-జవహరి(71) కథ..! జవహరి 1951 జూన్‌ 19న ఈజిప్టు రాజధాని కైరోలో ఓ మధ్యతరగతి విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. చాలా మంది వైద్యులు, స్కాలర్లు ఉన్న నేపథ్యం జవహరి కుటుంబానిది. తండ్రి మహమ్మద్‌-అల్‌-జవహరి కైరో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈయన తాత కూడా ఇదే వర్సిటీలో ఇమాం. తండ్రి బాటలోనే జవహరి కూడా ఈ వర్సిటీలో 1974లో మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు సర్జరీలో మాస్టర్స్‌ పూర్తి చేసి, కంటి శస్త్ర చికిత్స నిపుణుడిగా పనిచేశాడు. చదువుతోపాటే.. చిన్నతనం నుంచి.. ఇంకా చెప్పాలంటే బాల్యం నుంచే మత ఛాందసవాదాన్ని ఒంటబట్టించుకున్నాడు. 15ఏళ్ల వయసులోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ మిలిటెన్సీ ముఠాలో చేరి, అరెస్టయ్యాడు. తీవ్రవాద భావజాలం వల్ల.. వైద్యుడిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు.


తీవ్రవాదిగా ఇలా..

1973లో ఈజిప్టియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌ తీవ్రవాద ముఠా ఏర్పడగా.. జవహరి అందులో చేరాడు. 1981లో అప్పటి ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్‌ సదత్‌ కైరోలోని ఓ మిలిటరీ పరేడ్‌లో పాల్గొనగా.. కొంతమంది ముష్కరులు సైనికుల దుస్తుల్లో వచ్చి అతడిని హత్య చేశారు. ఈ ఘటన తర్వాత ఈజిప్టు పోలీసులు దేశవ్యాప్తంగా వందలాది మంది అనుమానితులు, ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అందులో జవహరి కూడా ఉ న్నాడు. అతను నిర్దోషి అని తేలినా.. ఆయుధాలు కలిగి ఉన్న కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో ఉన్న సమయంలో పోలీసులు అతడిని తీవ్రంగా కొట్టారని.. ఆ పరిణామాలు అతడిలో తీవ్రవాద భావజాలాన్ని మరింత పెంచాయని తోటి ఖైదీలు చెబుతారు.


లాడెన్‌తో స్నేహం..

1985లో జైలు నుంచి విడుదలైన తర్వాత జవహరి సౌదీ అరేబియా.. గల్ఫ్‌ దేశాలు, అఫ్ఘానిస్థాన్‌.. ఇలా పలు దేశాలు తిరిగాడు. ఈ క్రమంలో ఒసామా-బిన్‌-లాడెన్‌తో స్నేహం ఏర్పడింది. లాడెన్‌ అల్‌ కాయిదా పేరుతో ఉగ్రముఠాను ప్రారంభించినప్పుడు కూడా జవహరి అతని పక్కనే ఉన్నాడు. ఆ తర్వాత ఈజిప్టులో తాను నిర్వహించే మిలిటెన్సీ మూకను అల్‌ కాయిదాలో విలీనం చేశాడు. ఆ తర్వాత లాడెన్‌కు కుడిభుజంగా మారాడు. ఈజిప్టు ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా జవహరి దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు 12 వందల మంది సామాన్య పౌరులు చనిపోయారు. 1997లో అఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్‌కు మకాం మార్చాడు. లాడెన్‌ కూడా అక్కడి నుంచే తన ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేవాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఇతర ఇస్లామిక్‌ మూకలతో కలిసి ప్రపంచ ఇస్లామిక్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్‌ ద్వారా కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు జరిపి 228 మందిని పొట్టనబెట్టుకున్నారు.


9/11 దాడులతో

అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీవో) ట్విన్‌ టవర్స్‌పై.. ఆత్మాహుతి దళాలతో విమానాలను హైజాక్‌ చేయించి, లాడెన్‌ జరిపించిన ఉగ్రదాడిలో జవహరి కీలకంగా వ్యవహరించాడు. ఇందుకోసం జవహరి కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్‌ సమాజం నుంచి నిధులు సేకరించి.. ఆత్మాహుతి దళాలను తయారు చేసి, విమానాలు నడపడంలో శిక్షణనిప్పించి.. పకడ్బందీగా ఈ దాడులకు సిద్ధం చేశాడు. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం అల్‌ కాయిదాను మట్టుబెట్టేందుకు కంకణబద్ధమవ్వగా.. జవహరి అఫ్ఘానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో తలదాచుకుని.. ఉగ్ర సంస్థ బలోపేతానికి కృషిచేశాడు. ఇరాక్‌, మధ్య ఆసియా, యెమన్‌లో అల్‌ కాయిదాకు సుప్రీం లీడర్‌గా పనిచేశాడు. 2005లో లండన్‌లో ఉగ్రదాడి జరిపి 52 మందిని పొట్టనపెట్టుకున్నాడు. బాలి, మొంబాసా, రియాద్‌, జకర్తా, ఇస్తాంబుల్‌, మాడ్రిడ్‌లో ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. 2011లో లాడెన్‌ను అమెరికా దళాలు మట్టుబెట్టిన తర్వాత.. అల్‌ కాయిదా చీఫ్‌గా జవహరి బాధ్యతలు స్వీకరించి.. ఉగ్ర సంస్థను క్రియాశీలంగా తయారు చేశాడు. అమెరికా ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేరాడు.  జవహరి తలపై అమెరికా రూ. 196.25 కోట్ల(25 మిలియన్ల డాలర్లు) రివార్డును ప్రకటించింది.  


భారత్‌కూ ముప్పే..!

అల్‌ జవహరి భారత్‌ పాలిట కూడా ముప్పుగానే ఉండేవాడు. 2014 సెప్టెంబరులో అల్‌ కాయిదా ప్రాంతీయ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా అల్‌ కాయిదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌ కాంటినెంట్‌(ఏక్యూఐఎస్‌) ఏర్పాటైంది. ఈ సంస్థ ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌లో ఉంటూ.. భారత్‌పై కుట్రలు పన్నారు. దీనికి బంగ్లాదేశ్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ అల్‌ ఇస్లామి(హుజీ) సభ్యుడు ఆసీమ్‌ ఉమర్‌ చీఫ్‌గా పనిచేశాడు. 2019 సెప్టెంబరులో అమెరికా-అఫ్ఘాన్‌ సైనికులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఇతను హతమయ్యాడు.

Updated Date - 2022-08-03T09:16:43+05:30 IST