ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ABN , First Publish Date - 2022-08-08T05:17:55+05:30 IST

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది.

ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

 పురుగులమందు తాగి ఆత్మహత్మ

 జూలూరుపాడు మండలంలో ఘటన

 జూలూరుపాడు, ఆగస్టు 7: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వారి బంధాన్ని పెద్దలు అంగీకరించరని మనస్థాపం చెంది పురుగుల మందుతాగారు. రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ సంఘటన భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలోని వినోభానగర్‌లో జరిగింది. వినోభానగర్‌ గ్రామానికి చెందిన సిరికొండ ప్రశాంత్‌ (29), తాంబరపు ప్రసన్నజ్యోతి (25)ల మధ్య కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రసన్నజ్యోతికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా భర్తతో విభేదాలు తలెత్తడంతో రెండు సంవత్సరాల నుంచి వినోభానగర్‌లోని పుట్టింటి వద్దనే ఉంటోంది. పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన సదరు యువతి కొత్తగూడెంలో కోచింగ్‌ తీసుకుంటోంది. ఈ క్రమంలో పరీక్ష దగ్గరకు వచ్చిందని జూలూరుపాడు వెళ్లి హాల్‌ టిక్కెట్‌ తెచ్చుకుంటానని ఈ నెల 4వ తేదీన ప్రసన్నజ్యోతి తల్లిదండ్రులతో చెప్పి ఇంటినుంచి వెళ్లింది. సాయంత్రమైనా తన కూతురు  ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె  కోసం వెతికారు. అయితే అదే గ్రామానికి చెందిన సిరికొండ ప్రశాంత్‌, ప్రసన్నజ్యోతిలిద్దరు కలిసి జూలూరుపాడు నుంచి బయలుదేరి వినోభానగర్‌ గ్రామశివారులో 4వ తేదీ సాయంత్రం పురుగుమందు తాగి ఖమ్మం వెళ్లారు. అక్కడ కాల్వొడ్డు ప్రాంతంలోని లారీ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద బసచేశారు. అయితే 5వ తేదీన వారికి వాంతులు అవుతుండగా లారీ డ్రైవర్లు చూసి  వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లారు. తరువాత ఈ విషయాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఇద్దరూ అసప్మారక స్థితికి వెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ప్రశాంత్‌, ఆదివారం ఉదయం ప్రసన్నజ్యోతి మృతి చెందింది. ప్రశాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ప్రసన్నజ్యోతికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. వీరి పరిచయం వివాహేతర బంధంగా మారడంతో పెద్దలు అంగీకరించరనే మనస్తాపంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జూలూరుపాడు ఎస్‌ఐ పోటు గణేష్‌ తెలిపారు.


Updated Date - 2022-08-08T05:17:55+05:30 IST