రోజుకు సగటున 77 అత్యాచారాలు, 80 హత్యలు

ABN , First Publish Date - 2021-09-16T08:48:27+05:30 IST

భారత్‌లో గత ఏడాది రోజుకు సగటున 77 అత్యాచార కేసులు, 80 హత్య కేసులు నమోదైనట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) బుధవారం వెల్లడించింది.

రోజుకు సగటున 77 అత్యాచారాలు, 80 హత్యలు

  • హత్యలు, కిడ్నాప్‌లలో తొలిస్థానంలో యూపీ
  • ఇదీ గత ఏడాది భారత్‌లో నేరాల పరిస్థితి.. 
  • ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికలో వెల్లడి


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో గత ఏడాది రోజుకు సగటున 77 అత్యాచార కేసులు, 80 హత్య కేసులు నమోదైనట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) బుధవారం వెల్లడించింది. మొత్తంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదయ్యాయని, 2019లో ఈ సంఖ్య 4,05,326గా ఉందని తెలిపింది. గత ఏడాది అత్యాచార కేసుల్లో 28,153మంది బాధితులుండగా 25,498 మంది 18 ఏళ్లకు పైబడిన వారని.. మిగిలినవారు మైనర్లని వివరించింది. అత్యధికంగా రాజస్థాన్‌లో 5310 అత్యాచార కేసులు, ఉత్తర ప్రదేశ్‌లో 2769, మధ్యప్రదేశ్‌లో 2339, మహారాష్ట్రలో 2061, అసోంలో 1657 కేసులు నమోదయ్యాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో కేసులు(997) తక్కువగా నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 62,300 కేసులు అపహరణ, 85,392 కేసులు మహిళలపై హింస, 3741 కేసులు అత్యాచార యత్నం, 6966 కేసులు వరకట్న హత్యలు, 105 కేసులు యాసిడ్‌ దాడికి సంబంధించినవి ఉన్నాయి. హత్యల విషయానికొస్తే.. గత ఏడాది రోజుకు సగటున 80 హత్యలు జరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. ఏడాది మొత్తంలో 29,193మంది హత్యలకు బలయ్యారు. 


2019లో రోజుకు 79 హత్యలు నమోదయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 3779 హత్యలు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో బిహార్‌ (3150), మహారాష్ట్ర (2163), మధ్యప్రదేశ్‌ (2101), పశ్చిమ బెంగాల్‌ (1948) ఉన్నాయి. ఢిల్లీలో 472 హత్య కేసులు నమోదయ్యాయి. అపహరణల్లోనూ ఉత్తరప్రదేశే తొలిస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 12,913మంది గత ఏడాది అపహరణకు గురయ్యారు. తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌ (9309), మహారాష్ట్ర (8103), బిహార్‌ (7889), మధ్యప్రదేశ్‌ (7320) ఉన్నాయి. మొత్తం 88,590 మంది అపహరణ బాధితులుండగా.. వారిలో 56,591మంది చిన్నారులే. అపహరణలు 2019తో పోలిస్తే గత ఏడాది 19శాతం తగ్గాయి. 


రాష్ట్రంలో మైనర్లపై పెరిగిన నేరాలు

తెలంగాణకు సంబంధించిన నివేదిక చూస్తే.. రాష్ట్రంలో గత ఏడాది మైనర్లపై జరిగిన నేరాలకు సంబంధించి 4200 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య 2019లో 3855గా ఉంది. అప్పటితో పోలిస్తే మైనర్లపై 8 శాతం నేరాలు పెరిగాయి. మొత్తంగా రాష్ట్రంలో 77 మంది చిన్నారులు హత్యలకు బలయ్యారని ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది. ముగ్గురు చిన్నారులు అత్యాచారానికి గురవడంతో పాటు హత్యకు గురయ్యారు. మొత్తం 1275 మంది బాలల అపహరణ కేసులు నమోదయ్యాయి. అందులో 218 మంది బాలికల అపహరణల కేసుల్లో అపహరించిన వారు, బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఇక.. మైనర్లపై దాడి చేసినందుకు 153 కేసులు నమోదయ్యాయి. 1429 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆయా కేసుల్లో 1411 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


బాలలపై జరిగిన నేరాల్లో 421 కేసుల్లోనే నిందితులకు శిక్ష పడటం గమనార్హం. 688 కేసులు వీగిపోయాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. కేసుల్లో చార్టీషీట్ల దాఖలు 75 శాతమే ఉందని వివరించింది. గత ఏడాది మొత్తంగా 3100 మంది బాలబాలబాలికలు అదృశ్యమయ్యారు. వారిలో 1230 మంది బాలలు, 1870 మంది బాలికలున్నారు. 2978 మంది ఆచూకీ లభించగా.. వారిని పోలీసులు కుటంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు.. మైనర్లు చేస్తున్న నేరాలు సైతం ఎక్కువగానే నమోదవుతుండటం గమనార్హం. గత ఏడాది మైనర్లపై 23 హత్య కేసులు నమోదయ్యాయి. 50 కేసుల్లో మైనర్లు మహిళలపై దాడికి యత్నించారు. 72 అత్యాచార కేసుల్లో మైనర్లే ప్రధాన నిందితులు కావడం ఆందోళనకరం. 


నివేదికలో ప్రధానాంశాలు

రాష్ట్రంలో ఎస్సీ అట్రాసిటీ కేసులు గత ఏడాది 1959 నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 14 శాతం పెరిగాయి. 28 మంది ఎస్సీలు హత్యకు గురయ్యారు. ఎస్టీ అట్రాసిటీ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఆర్థిక నేరాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. 18,528 కేసులతో రాజస్థాన్‌ మొదటిస్థానంలో ఉండగా.. ఉత్తరప్రదేశ్‌(16,708) రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో గత ఏడాది 12,985 ఆర్థిక నేరాల కేసులు నమోదు కావడం గమనార్హం. వాటిలో 12,396 మోసాలకు సంబంధించిన కేసులే ఉన్నాయి. 

Updated Date - 2021-09-16T08:48:27+05:30 IST