వర్షాల రాకను తెలిపే యాప్స

ABN , First Publish Date - 2020-09-22T07:25:54+05:30 IST

భారత వాతావరణ శాఖ రూపొందించిన దామిని, మౌసమ్‌ యాప్‌ల ద్వారా వర్షాల రాకను తెలుసుకోవచ్చని

వర్షాల రాకను తెలిపే యాప్స

నగరంలో 2 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనాలు

ఐదేళ్లుగా సెప్టెంబర్‌లో అత్యధిక వర్షపాతాలు


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): భారత వాతావరణ శాఖ రూపొందించిన దామిని, మౌసమ్‌ యాప్‌ల ద్వారా వర్షాల రాకను తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి దామిని యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని, మనం ఉన్న ఏరియాను అందులో టైప్‌ చేస్తే 5 నుంచి 15 నిమిషాల్లో సమీప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చే అవకాశం ఉందా, లేదా అనేది చూపిస్తోంది. మౌసమ్‌ యాప్‌లో వర్షాలు పడే రోజులు, వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఈ రెండు యాప్‌ల సాయంతో వర్షాల ఆగమనాన్ని తెలుసుకునే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 


నగరం చుట్టూ ఆవరించిన అల్పపీడనాలు..

తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతోంది. ఇందులో 2 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనాలు గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టే వ్యాపించి ఉండడంతో గత 5 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 


ఐదేళ్లుగా సెప్టెంబర్‌ను వీడని వరుణుడు..

నగరంలో ఏటా సెప్టెంబర్‌లో వర్షాలు సాధారణం నుంచి గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 16న నగర వ్యాప్తంగా రెండున్నర గంటలపాటు కురిసిన వర్షంతో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 17న 10, 18న 10.5, 19న 8.5, 20న 10 సెంటీమీటర్లు కురిసింది. ఐదేళ్ల నుంచి కూడా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో నగరంలో వర్షాలు అధికంగా కురుస్తున్నట్లు వాతావరణశాఖ రికార్డులు చెబుతున్నాయి. 2015 సెప్టెంబర్‌ 10న అత్యధికంగా 46.8 మిల్లీమీటర్లు, 2016లో  23న 73.1, 2017లో సెప్టెంబర్‌ 6న 90.2, 2018 సెప్టెంబర్‌ 18న 25.9, 2019 సెప్టెంబర్‌ 27న 89.7, 2020 సెప్టెంబర్‌ 16న 48 మిల్లీమీటర్ల వర్షపాతం నగరంలో నమోదైంది.


ఐదేళ్లలో సెప్టెంబర్‌లో కురిసిన వర్షపాతం 

సంవత్పరం వర్షపాతం (మిల్లీమీటర్లలో)

2015 141.3

2016 439.7

2017 187.3

2018 93.2

2019 321.7

2020(ఇప్పటివరకు) 138.8 (సుమారుగా)

Updated Date - 2020-09-22T07:25:54+05:30 IST