వినోద ద్వీపం

ABN , First Publish Date - 2022-05-03T06:01:02+05:30 IST

చిన్నపిల్లలకు వినోదాన్ని అందించేందుకు భవానీద్వీపం ప్రత్యేకంగా సిద్ధమవుతోంది.

వినోద ద్వీపం

భవానీ ద్వీపంలో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌!

పీపీపీ విధానంలో ఏర్పాటుకు అడుగులు

ముందుకొచ్చిన ప్రైవేటు సంస్థ 

ద్వీపంలో స్థలాన్ని అప్పగించిన బీఐటీసీ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : చిన్నపిల్లలకు వినోదాన్ని అందించేందుకు భవానీద్వీపం ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ద్వీపంలో పిల్లల కోసం అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ రూపుదిద్దుకోనుంది. ప్రైవేట్‌ అండ్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో దీనిని భవానీ ఐల్యాండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (బీఐటీసీ) ఏర్పాటు చేయిస్తోంది. దీనిని ఏర్పాటు చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థ ముందుకు రాగా, అవసరమైన స్థలాన్ని బీఐటీసీ అప్పగించింది. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఆ సంస్థ జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను చేపడుతోంది. 


పార్కులో రైడ్స్‌ ఇవీ.. 

అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ప్రధానంగా చిన్నపిల్లల రైడ్స్‌ ఉంటాయి. ఇవన్నీ పిల్లలకు వినోదాన్ని పంచుతాయి. చోటా భీమ్‌ రైడ్‌, స్పెషల్‌ రోలర్‌ కోస్టర్‌, హ్యాపీ వీల్స్‌, హమ్టీ ఫాల్స్‌, లాచ్‌నెస్‌ ఎక్స్‌ప్లోరర్స్‌, మ్యాజిక్‌ కారోసల్‌, వ్యాగన్‌ ఓ-ఓ వీల్స్‌ వంటి వాటితో పాటు రోటర్‌, హంటెడ్‌ మాన్సియన్‌, లాక్‌ రైడ్స్‌, బంపర్‌ కార్స్‌, స్ర్కాంబ్లర్‌, ఇన్సానిటీ, ఫెర్రిస్‌ వీల్‌ వంటి అనేక రైడ్స్‌ పిల్లల్ని ఆకట్టుకుంటాయి. వీటికి తోడు మధ్య మధ్యలో కృత్రిమ ఉద్యానవనం, పచ్చిక బయళ్లు ఇతర అనేక ప్రత్యేక ఆకర్షణలు ఉంటాయి. పనులు వేగంగా జరిగితే జూలై నాటికి భవానీద్వీపంలో పిల్లల కోసం అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ అందుబాటులోకి వస్తుంది.


ఆకట్టుకుంటున్న వర్చువల్‌ నెట్‌ క్రికెట్‌  

భవానీద్వీపంలో పిల్లల్ని ఆకట్టుకునేందుకు ఇప్పటికే వర్చువల్‌ నెట్‌ క్రికెట్‌ అందుబాటులోకి వచ్చింది. ద్వీపానికి వచ్చిన సందర్శకులు ఎక్కువగా వర్చువల్‌ క్రికెట్‌ ఆడటానికి ఇష్టపడుతున్నారు. 


స్కై టవర్‌కు రీ టెండర్లు

భవానీద్వీపంలో స్కై టవర్‌ హోటల్‌కు బీఐటీసీ టెండర్లు పిలిచింది. దీని ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మరోసారి టెండర్లు పిలవటానికి బీఐటీసీ సంసిద్ధమవుతోంది. 

Read more