ఆరేళ్లుగా.. అరకొరే

ABN , First Publish Date - 2021-07-20T04:57:36+05:30 IST

పట్టణాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు చేపట్టిన అమృత్‌ పథకం ముందుకు సాగడంలేదు. పథకం ప్రారంభించి అరేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికి నోచుకోవడంలేదు.

ఆరేళ్లుగా.. అరకొరే
నరసరావుపేటలో అమృత్‌ పథకం కింద కొనుగోలు చేసిన పైపులు

సాగుతున్న అమృత్‌ పనులు

అమృత్‌ పథకానికి నిధుల కొరత

నిధులు కేటాయించని మున్సిపాల్టీలు

నత్తనడకన రక్షిత మంచినీటి పథకాల విస్తరణ 

ఇంకా ప్రారంభమే కాని రెండో విడత పనులు

చిలకలూరిపేట పథకానికి రూ.30 కోట్ల రుణం


అమృత్‌ పథకంతో మున్సిపల్‌ పట్టణాల్లో  మౌళిక వసతులు ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వం తలచింది. జిల్లాలో గుంటూరు కార్పొరేషన్‌తో పాటు చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి మున్సిపాలిటీలను ఈ పథకం కింద ఆరేళ్ల క్రితం ఎంపిక చేసింది.   ఆయా పట్టణాల్లో  తాగునీరు, ఉద్యానవనాలు, మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధి పనులు ఆరేళ్లుగా అరకొరగానే సాగుతున్నాయి. ఈ పథకం కింద పనులకు కేంద్ర, రాష్ట్ర పభుత్వాలలో పాటు మునిసిపాల్టీలు కూడా నిధులు కేటాయించాలి. రెండు విడతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేశాయి. తొలి విడతగా 2015లో రూ.54.46 కోట్లు, 2016 ఆర్థిక సంవత్సరంలో రెండో విడత కింద రూ.104 కోట్లు మంజూరయ్యాయి. మొదట విడత పనులే పూర్తికి నోచుకోలేదు. రెండో విడత పనులు వివిధ మునిసిపాలిటీలలో ఇంకా ప్రారంభమే కాలేదు. ఆయా పురపాలక సంఘాలు వాటి వాటా ధనాన్ని చెల్లించలేక సతమతమవుతున్నాయి. దీంతో పనులు ముందుకు సాగక లక్ష్యాలు నీరుగారిపోతున్నాయి.  


నరసరావుపేట, జూలై 19: పట్టణాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు చేపట్టిన అమృత్‌ పథకం ముందుకు సాగడంలేదు. పథకం ప్రారంభించి అరేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికి నోచుకోవడంలేదు. తొలి విడత విడుదలైన నిధులతో గుంటూరు కార్పొరేషన్‌ సహా మూడు మునిసిపాలిటీలలో రక్షిత మంచి నీటి పథకాల విస్తరణ, పార్కుల అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ పనులు పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు. రక్షిత మంచి నీటి పథకాల విస్తరణలో భాగంగా తాగునీటి పైపులైన్లు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండో విడత విడుదలైన నిఽధులు కేటాయింపులో మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యం కల్పించారు. మొదటి విడత చేపట్టిన పనులే పూర్తికి నోచుకోలేదు. రెండో విడత పనుల్లో సగానికి ఇప్పటికీ ప్రారంభించలేదు. నత్తనడకన పనులు సాగుతుండటంతో అమృత్‌ పథకం ముందడుగు వేయటం లేదు.


నిధులు విడుదల ఇలా..    

అమృత్‌ పథకం కింద ఐదేళ్ల పాటు పట్టణాలలో అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. దీనిలో భాగంగా పనుల ప్రతిపాదనలను గుంటూరు కార్పొరేషన్‌తో పాటు మిగిలిన మూడు పురపాలక సంఘాలు ప్రభుత్వానికి అందజేయగా ఆమోద ముద్ర పడింది. తెనాలి పురపాలక సంఘంలో రూ.210.55 కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నరసరావుపేట పురపాలక సంఘంలో రూ.84.95 కోట్లు, చిలకలూరిపేట రూ.326.03 కోట్లు, గుంటూరు కార్పొరేషన్‌లో రూ.1337 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించారు. అయితే తొలి విడతగా చిలకలూరిపేట పురపాలక సంఘానికి రూ.8.82 కోట్లు, నరసరావుపేటకు రూ.13.53 కోట్లు, గుంటూరు కార్పొరేషన్‌కు రూ.22.52 కోట్లు, తెనాలి మునిసిపాలిటీకి రూ.9.09 కోట్లు విడుదలయ్యాయి. రెండో విడత కింద నరసరావుపేట మునిసిపాలిటీకి రూ.5 కోట్లు, చిలకలూరిపేటకు రూ.52.75 కోట్లు, గుంటూరు కార్పోరేషన్‌కు రూ.25.75 కోట్లు, తెనాలి పురపాలక సంఘానికి రూ.19 కోట్లు విడుదల చేశారు. రెండో విడత తెనాలి మునిసిపాలిటీలో మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికి రూ.18.50 కోట్లు విడుదల చేశారు. చిలకలూరిపేట మునిసిపాలిటీలో నీటి పథకం విస్తరణకు రూ.42 కోట్లు, మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధికి రూ.9.75 కోట్లు, గుంటూరు కార్పొరేషన్‌లో తాగునీటి పథకం విస్తరణకు రూ.25 కోట్లు విడుదలయ్యాయి.


పనులపై అధికారుల నిర్లక్ష్యం

అమృత్‌ పథకం కింద  ఇంటింటికి కుళాయి కనెక్షన్‌ తప్పనిసరి చేశారు. బీపీఎల్‌ కుటుంబాలకు రూ.200లకే కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలి. కుళాయి కనెక్షన్లు కూడా ఒక్క నరసరావుపేటలో నూరు శాతం అమలైంది. గుంటూరు, తెనాలి, చిలకలూరిపేటలలో కుళాయిలు ఇవ్వడంలో వెనుకబడ్డాయి.  నరసరావుపేట మునిసిపాల్టీలో ఈ పథకం కింద నిర్మించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌, చెరువుకు నీరు ఎక్కించే పైపులైనును పనులు పూర్తి అయినా వినియోగించడంలో అధికారులు నిర్లక్షాన్ని ప్రదర్శిస్తున్నారు. నరసరావుపేటలో 14వ ఆర్థిక సంఘం నిఽధులను అమృత్‌ పథకానికి మళ్లించారు. చిలకలూరిపేటకు సంబంధించిన తాగునీటి పథకం పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం తాండవిస్తున్నది.  ప్రభుత్వ గ్యారంటీతో రూ.30 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నట్టు పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అమృత్‌ పనులు  పూర్తి చేస్తే ఆయా పట్టణాలలో తాగునీరు, మురుగు నీటి సమస్యలకు శాశ్విత పరిష్కారం లభిస్తుందని ప్రజలు సూచిస్తున్నారు. 


 

Updated Date - 2021-07-20T04:57:36+05:30 IST