అమూల్‌ ఢమాల్‌!

ABN , First Publish Date - 2022-05-23T05:19:09+05:30 IST

జిల్లాలో జగనన్న పాల వెల్లువ వెలవెలబోతోంది. ఈపథకం ద్వారా గుజరాత్‌కు చెందిన అమూల్‌ కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకొని పాల సేకరణ చేస్తున్న విషయం విదితమే. అయితే ప్రస్తుత వేసవిలో రోజువారీ 3.50 లక్షల లీటర్ల పాలు గృహ అవసరాలకు పోను వివిధ డెయిరీలకు రైతులు పోస్తుండగా అందులో అమూల్‌కు వస్తున్నది కేవలం 10వేల లీటర్లలోపు మాత్రమే. ఈ ప్రకారం చూస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ పథకాన్ని పాడిరైతులు ఏమాత్రం విశ్వసించడం లేదన్న విషయం స్పష్టమవుతోంది.

అమూల్‌ ఢమాల్‌!
కొత్తపట్నం మండలం అల్లూరులో వెలవెలబోతున్న అమూల్‌ పాల కేంద్రం

ఆ ప్రాజెక్టుకు ఆదరణ కరువు

వెలవెలబోతున్న జగనన్న పాలవెల్లువ 

రోజువారీ ఉత్పత్తిలో 5శాతం కూడా రాని వైనం

మొక్కుబడి  తంతుగా సాగుతున్న ప్రక్రియ

పోటీపడి సేకరణ పెంచుకుంటున్న ప్రైవేటు డెయిరీలు


ఒంగోలు, మే 22 (ఆంధ్రజ్యోతి): 


జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభించి ఏడాదిన్నర గడుస్తున్నా పాడిరైతుల ఆదరణను పొందలేకపోయింది. పెద్దఎత్తున ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యం ఉన్నా ఆశించిన ఫలితం కన్పించడం లేదు. ప్రభుత్వం తరఫున నిధులు వెచ్చించి క్షేత్రస్థాయిలో పాలసేకరణ, యంత్ర సామగ్రి ఏర్పాటు చేసినా కనీస స్థాయిలో కూడా సేకరణ చేయలేకపోతున్నారు. జిల్లాలో జరిగే పాల ఉత్పత్తిలో కనీసం ఐదు శాతం కూడా జగనన్న పాలవెల్లువలో చేపట్టిన అమూల్‌కు రాని పరిస్థితి. పాడిరైతులకు పాదయాత్ర సమయంలో జగన్‌ చెప్పిన రాయితీలు అమలు కాకపోవడం, అమూల్‌ అమలు తొలిరోజుల్లో చోటుచేసుకున్న పలు లోటుపాట్లు, అవకతవకలతో పాడి రైతులు విశ్వసించడం లేదు.

జిల్లాలో జగనన్న పాల వెల్లువ వెలవెలబోతోంది. ఈపథకం ద్వారా గుజరాత్‌కు చెందిన అమూల్‌ కంపెనీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకొని పాల సేకరణ చేస్తున్న విషయం విదితమే. అయితే ప్రస్తుత వేసవిలో రోజువారీ 3.50 లక్షల లీటర్ల పాలు గృహ అవసరాలకు పోను వివిధ డెయిరీలకు రైతులు పోస్తుండగా అందులో అమూల్‌కు వస్తున్నది కేవలం 10వేల లీటర్లలోపు మాత్రమే. ఈ ప్రకారం చూస్తే ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ పథకాన్ని పాడిరైతులు ఏమాత్రం విశ్వసించడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. జిల్లాలో జరిగే పాల ఉత్పత్తికి రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా మంచిపేరు ఉంది. ఉత్పత్తి అధికంగా ఉండే సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు రోజువారీ దాదాపు 8లక్షల లీటర్ల పాల ఉత్పత్తి ఉంటుంది. అందులో 3లక్షల వరకు గృహావసరాలకు, ఇతర స్థానిక విక్రయాలు పోను 5లక్షల లీటర్లదాకా వివిధ డెయిరీలకు పోస్తుంటారు. అదే అన్‌సీజన్‌ అయిన వేసవిలో అయితే ఉత్పత్తి 6లక్షలకు తగ్గి సగం గృహావసరాలకు, సగం డెయిరీలకు పోతుంటాయి. 


మన పాలకు మంచి పేరు

జిల్లాలో వందలాది గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. అధిక పాల ఉత్పత్తితోపాటు దేశంలోనే మంచి పేరుండటంతో పెద్దసంఖ్యలో ప్రైవేటు డెయిరీలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. అలా చిన్నా పెద్ద కలిపి 60 నుంచి 70 డెయిరీలు ప్రస్తుతం నడుస్తున్నాయి.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు సహకార రంగంలోని ఒంగోలు డెయిరీ ప్రధానంగా ఉండగా, 400 గ్రామాల నుంచి సీజన్‌లో లక్ష లీటర్ల వరకు, వేసవిలో 50వేల లీటర్ల పాలు వచ్చేవి. ధరల కల్పన, డబ్బు గ్యారెంటీ, దాణా సరఫరా, గేదెల కొనుగోలుకు రుణాలు ఇలా రకరకాలుగా పాడిరైతులకు ప్రయోజనాలు ఉండేవి. ఇతర డెయిరీలు కూడా ఒంగోలు డెయిరీ పోకడకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండేవి. అయితే ఒంగోలు డెయిరీ ఆర్థికపరమైన చిక్కుల్లో పడి సంక్షోభంలో కూరుకుపోగా, గత టీడీపీ ప్రభుత్వం రుణసహాయం చేసి కంపెనీ చట్టంలోని బోర్డును రద్దుచేసి అధికారుల పర్యవేక్షణలోకి తెచ్చి కార్యకలాపాలను కొనసాగించింది.


డెయిరీ మూత.. అమూల్‌కు అప్పగింత

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా సహకార డెయిరీలను సమాధి చేస్తూ గుజరాత్‌కు చెందిన అమూల్‌ కంపెనీని రాష్ట్రంలోకి తెచ్చింది. తొలివిడత అమూల్‌ కార్యకలాపాలు జిల్లాలోనే ప్రారంభించింది. అలా 2020 నవంబరు 21న అమూల్‌ పాలసేకరణ జిల్లాలో ప్రారంభించగా తొలుత 200 గ్రామాల్లో పాలు సేకరించి దశల వారీగా అన్ని గ్రామాల్లో చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దాదాపు 125కు పైగా గ్రామాల్లో ప్రభుత్వమే నిధులు భరించి ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్‌(ఏఎంసీయూ)లను ఏర్పాటు చేసి అవసరమైన ఆఽధునిక యంత్ర సామగ్రి, ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రక్రియ ప్రారంభించి ఏడాదిన్నర గడుస్తున్నా ఆశించిన స్థాయిలో కాకపోయినా కనీస స్థాయిలో కూడా రైతుల ఆదరణను పొందలేకపోయింది. 


ఇంకా పడిపోయిన సేకరణ

అమూల్‌ కార్యకలాపాలు తొలుత ఒంగోలు డెయిరీ కేంద్రంగా ప్రారంభించారు. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ రోజుకు 18వేల లీటర్లను ఒంగోలు డెయిరీ సేకరించేది. అయితే అమూల్‌ పరిస్థితి పరిశీలిస్తే మంచి సీజన్‌గా భావించే నవంబరులో గరిష్ఠంగా రోజువారీ 22 వేల లీటర్లు సేకరణ చేయగా ప్రస్తుత వేసవిలో 10వేల లీటర్లలోపు మాత్రమే వస్తున్నాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ స్వీయ పర్యవేక్షణలో పశుసంవర్థక, సహకార, డీఆర్‌డీఏ, మండల పరిషత్‌లతో పాటు పలు ఇతర శాఖలకు చెందిన వందలాది మంది అధికారులు, సిబ్బంది ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అవుతున్నారు. అయినా పాడిరైతుల నుంచి ఆదరణ లభించడం లేదు. తొలిరోజుల్లో జరిగిన అనేక లోపాలు, లోటుపాట్ల కారణంగా రైతుల్లో విశ్వాసం కోల్పోయారు. గతంలో అమూల్‌ గేదె పాలకు గరిష్ఠంగా లీటర్‌కు రూ.69 ఇవ్వగా ప్రస్తుతం రూ.72కు పెంచినట్లు సమాచారం. సగటున లీటర్‌కు రూ.54.50 రైతులకు అందుతున్నట్లు చెప్తున్నారు. 


 సవాల్‌ విసురుతున్న ప్రైవేటు డెయిరీలు

ప్రైవేటు డెయిరీలు జిల్లాలో అమూల్‌కు సవాల్‌ విసురుతూ పాల సేకరణను పెంచుతున్నాయి. కృష్ణా మిల్క్‌(విజయ డెయిరీ), సంగం, దొడ్ల, హెరిటేజ్‌ వంటి సంస్థలు పాల సేకరణను అధికం చేశాయి. దీంతో పాడి రైతులు ఆవైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఏడాదిన్నర గడిచినా అమూల్‌ సేకరణ పెరగకపోగా కనీసం 200 గ్రామాల్లోని కేంద్రాల్లో లక్ష్యం కూడా చేరలేకపోయింది. జిల్లా విభజన నాటికి 180గ్రామాల నుంచి సేకరణ జరుగుతుండగా అందులో 36 బాపట్ల జిల్లాకు, మరో ఆరు నెల్లూరు జిల్లాకు పోయాయి. ప్రస్తుతం జిల్లాలో 138 కేంద్రాలు ఉండగా 9,500 లీటర్లు రోజువారీ సేకరణ మాత్రమే జరుగుతోంది. రైతులకు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నా పాలు సేకరించే వారికి హ్యాండ్లింగ్‌ చార్జీలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 


అన్‌సీజన్‌తో సేకరణ తగ్గింది

అమూల్‌ ప్రాజెక్టు భవిష్యత్‌ కార్యాచరణపై జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ కాలేషావలి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రస్తుతం అన్‌ సీజన్‌ వల్ల కొంతమేర సేకరణ తగ్గిందన్నారు. పదిరోజుల క్రితం కలెక్టర్‌ సమీక్ష చేసి దిశానిర్దేశం చేశారన్నారు. ఆ ప్రకారం తక్షణం మరో 29 గ్రామాలు, అలాగే రానున్న సీజన్‌కు 150 గ్రామాల్లో పాలసేకరణ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 




Updated Date - 2022-05-23T05:19:09+05:30 IST