ఉత్తరాంధ్రలోనూ ‘అమూల్‌’ పాగా!

ABN , First Publish Date - 2021-04-16T10:24:22+05:30 IST

గుజరాత్‌కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ ‘అమూల్‌’ ఉత్తరాంధ్రలోనూ అడుగుపెట్టబోతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ ఇప్పటివరకూ విశాఖ డెయిరీ

ఉత్తరాంధ్రలోనూ ‘అమూల్‌’ పాగా!

మహిళా డెయిరీ సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు

ఆ బాధ్యత జిల్లా సహకార శాఖలకు అప్పగింత

సంఘాలతో త్వరలో త్రైపాక్షిక ఒప్పందం

ఒక్కో జిల్లాలో 700 సంఘాలు!

వచ్చే ఏడాది నుంచి పాల సేకరణ


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గుజరాత్‌కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ ‘అమూల్‌’ ఉత్తరాంధ్రలోనూ అడుగుపెట్టబోతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ ఇప్పటివరకూ విశాఖ డెయిరీ అగ్రగామిగా ఉంది. ఆ తరువాత హెరిటేజ్‌, విజయతోపాటు ఇతర డెయిరీలు ఉన్నాయి. ఆ డెయిరీలన్నీ కలిపి రోజుకు 20లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నాయి. అందులో ఒక్క విశాఖ డెయిరీనే 7.5-9 లక్షల లీటర్ల వరకూ సేకరిస్తోంది. విశాఖ డెయిరీ వార్షిక టర్నోవర్‌ రూ.2 వేల కోట్లు. కాగా, అమూల్‌ రాక విశాఖ డెయిరీపై ప్రభావం చూపుతుందని పాడి రైతులు అంటున్నారు.


రాష్ట్రంలో పాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, అమూల్‌ రాకపై స్థానిక డెయిరీలు, విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న విశాఖ డెయిరీ పాలకవర్గం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అమూల్‌ను రానీయొద్దని, తామే పాడి రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌తో పాటు పలువురు డైరెక్టర్లు వైసీపీలో చేరారు. దీంతో అమూల్‌ ఉత్తరాంధ్రలో అడుగుపెట్టదని అంతా భావించారు. అయితే, ఉన్నత స్థాయిలో ఏం జరిగిందో గానీ, ఉత్తరాంధ్రలో అమూల్‌ పాల సేకరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు మహిళా డెయిరీ సహకార సంఘాల, పాల శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు పూర్తిచేయడంతోపాటు పాల సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. 


ఒక్కో సంఘంలో పది మంది..

మహిళా డెయిరీ సహకార సంఘాల్లో పది మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు అధ్యక్షురాలిగా ఉంటారు. సంఘం కార్యకలాపాలు చూసేందుకు పాలు సరఫరా చేయని కుటుంబం నుంచి ఒకరిని నియమిస్తారు. సంఘాల ఏర్పాటు తరువాత సభ్యుల పేరిట జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచీలలో ఖాతాలు తెరుస్తారు. పాలు పోసే సభ్యుల ఖాతాలకు పది రోజులకొకసారి అమూల్‌ నగదు చెల్లిస్తుంది. సభ్యులు తీసుకున్న రుణానికి ప్రతినెలా వాయిదాలు చెల్లించాలి. మూడేళ్లలో రుణం మొత్తం చెల్లించాల్సి ఉంది. కాగా, గ్రామ పరిధిలో ఎవరైనా అమూల్‌ కేంద్రానికి పాలు పోయవచ్చు. ఈ విషయంలో ఎటువంటి నిబంధనలూ లేవు. కానీ, సంఘంలో సభ్యులకు మాత్రమే డీసీసీబీ రుణాలు ఇస్తుంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో మహిళా డెయిరీ సహకార సంఘాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టనున్నట్టు సంబంధిత అఽధికారి ఒకరు తెలిపారు. 


విశాఖ జిల్లాలో 700 సంఘాలు

గ్రామ స్థాయిలో పాల సేకరణకు మహిళలతో డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ జిల్లాలో 700 సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ 600-700 సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఘాల ఏర్పాటు బాధ్యతను జిల్లా సహకార శాఖకు అప్పగించారు. ఇందుకోసం జిల్లాకొక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా సహకార శాఖ అధికారి, డీఆర్‌డీఏ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, డీసీసీబీ సీఈవో ఉంటారు. సంఘాల ఏర్పాటులో భాగంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో సభ్యుల పేరిట ఖాతాలు తెరుస్తారు.


మహిళా డెయిరీ సహకార సంఘాలు, అమూల్‌, డీసీసీబీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుతారు. దీని ప్రకారం గేదెలు, ఆవులు కొనుగోలు, అవసరమైతే షెడ్ల ఏర్పాటుకు మహిళా సభ్యులకు డీసీసీబీ రుణం అందిస్తుంది. తొమ్మిది శాతం వడ్డీపై సంఘానికి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు రుణం ఇస్తుంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా సంఘాల ఏర్పాటు పూర్తిచేసి పాల సేకరణ చేపట్టాలని జిల్లా కమిటీలను ప్రభుత్వం ఆదేశించింది. 

Updated Date - 2021-04-16T10:24:22+05:30 IST