Abn logo
May 23 2020 @ 21:26PM

‘జూమ్’ ద్వారా ‘అమృతం ద్వితీయం’ ట్రైలర్ విడుదల

బుల్లితెరపై ‘అమృతం’ పేరు తెలియని వారుండరు. 7 సంవత్సరాలపాటు నాన్‌స్టాప్‌గా ప్రేక్షకుల హృదయాలను గిలిగింతలు పెట్టిన ఈ కామెడీ సీరియల్ ఇప్పుడు ‘అమృతం ద్వితీయం’ అంటూ సరికొత్తగా ముస్తాబై రాబోతుంది. అయితే ఈసారి సీరియల్‌గా కాకుండా వెబ్ సిరీస్‌గా రాబోతుంది. గత సీజన్లో అమృతంగా నటించిన హర్షవర్ధన్, సర్వంగా నటించిన వాసు ఇంటూరి, అప్పాజీగా నటించిన శివన్నారాయణ, శాంతగా నటించిన రాగిణీ ఈ సీజన్‌లో సైతం అవే పాత్రల్లో కనిపించనున్నారు. ఇక అంజిగా నటించిన దివంగత నటుడు గుండు హనుమంతరావు పాత్రలో ప్రముఖ హాస్యనటులు, రచయిత ఎల్బీ శ్రీరామ్ నటిస్తున్నారు. అమృతం భార్య సంజీవినిగా హాస్యనటి సత్య కృష్ణన్, అమృతం మామ పరంథామయ్యగా కాశీ విశ్వనాధ్ నటిస్తున్నారు. ఉగాది కానుకగా ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్‌కూ కరోనా అడ్డు పడింది. ఇప్పటికే టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్‌కి మంచి స్పందన రావడంతో.. జీ5 వారు గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడలేదు. అందుకే ఆన్‌లైన్‌లో మీడియాతో ముచ్చటించిన ‘అమృతం ద్వితీయం’ టీమ్, ట్రైలర్‌ను విడుదల చేయడమే కాకుండా.. ఎప్పటి నుంచి ఈ షోలు టెలికాస్ట్ అవుతాయో కూడా తెలిపారు. ఈ లాక్‌డౌన్‌లో ఇలా ఆన్‌లైన్‌లో జరిగిన తొలి ప్రెస్ మీట్ ఈ ‘అమృతం ద్వితీయం’దే కావడం విశేషం.


‘జూమ్’ ద్వారా జరిగిన ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో జీ5 తెలుగు క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల, సందీప్ గుణ్ణం, హర్షవర్ధన్, ఎల్బీ శ్రీరామ్, శివన్నారాయణ, వాసు ఇంటూరి పాల్గొని.. మీడియావారితో ట్రైలర్‌ను విడుదల చేయించారు. ఇందులో నటించిన వారందరూ ‘అమృతం ద్వితీయం’తో వారికున్న అనుభవాలను ఈ సమావేశంలో పంచుకున్నారు. 


‘‘జీ5లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‌లను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇటువంటి షోస్ చేయగలిగిన టాలెంట్ ఉన్నవారికి మేం స్వాగతం పలుకుతున్నాం. ఇక ‘అమృతం ద్వితీయం’ విషయానికి వస్తే మే 27న స్పెషల్ ఎపిసోడ్స్ విడుదల అవుతున్నాయి. జూన్ 25 నుంచి రెగ్యులర్‌గా ‘అమృతం ద్వితీయం’ ఎపిసోడ్స్ మంత్లీ 3 చొప్పున రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నాం. ఎటువంటి బ్రేక్ లేకుండా అవి ప్రసారమవుతాయి. సహకరించిన అందరికీ ధన్యవాదాలు.. ’’ అని జీ5 తెలుగు క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement