సరోవరం.. సాగదీత

ABN , First Publish Date - 2022-07-25T05:42:55+05:30 IST

మిషన్‌ అమృత్‌ సరోవర్‌.. నీటి సంరక్షణ, నీటి వనరుల అభివృద్ధి, పునరుద్ధరణ ఈ మిషన్‌ లక్ష్యం.

సరోవరం.. సాగదీత
నరసరావుపేట మండలం ఇస్సపాలెం చెరువు

నత్తనడకన చెరువుల అభివృద్ధి పనులు

అమృత్‌ సరోవరం పథకంలో 79 ఎంపిక

66 చెరువు పనులు ప్రారంభం.. ఒకటే పూర్తి  

కష్టసాధ్యంగా.. ఆగస్టు 15కి పూర్తి చేయాలనే లక్ష్యం 

నరసరావుపేట, జూలై 24: మిషన్‌ అమృత్‌ సరోవర్‌.. నీటి సంరక్షణ, నీటి వనరుల అభివృద్ధి, పునరుద్ధరణ ఈ మిషన్‌ లక్ష్యం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణ, చెరువుల నిర్మాణం మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకం కింద చేపట్టారు. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన పనులను ఆగస్టు 15వ తేదీకల్లా పూర్తి చేసి ఆ ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు లక్ష్యం నిర్దేశించింది. అయితే జూలై నాలుగో వారంలోకి ప్రవేశించినా ఈ పథకం పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో 79 చెరువులను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే పనులు జరుగుతున్న తీరు చూస్తే ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి పూర్తయ్యే పరిస్థితులు కానరావడం లేదు. ఈ పథకం కింద జిల్లాలో 79 చెరువులను గుర్తించగా 66 చెరువుల్లో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికి బొల్లాపల్లి మండలంలో ఒక్క చెరువు పని మాత్రమే పూర్తి చేశారంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. ఎంపిక చేసిన వాటిలో 13 చెరువులకు సంబంధించి ఇప్పటికీ పనులే ప్రారంభం కాలేదు. 

అభివృద్ధి చేస్తే పుష్కలంగా నీరు..

ఈ పథకంలో చెరువుల్లో పూడికతీత, కట్టలను పటిష్టపరచడం, అలుగులు, తూముల నిర్మాణం వంటి పనులను చేపట్టాలి. ఒక్కొక్క చెరువు అభివృద్ధికి రూ.లక్ష నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అంతేగాక చెరువుల అభివృద్ధికి, నిధుల సేకరణకు దాతల సహకారం కూడా తీసుకోవచ్చు.  ఒక ఎకరం పైబడిన చెరువులను మాత్రమే అభివృద్ధి చేయాలని నిబంధన విధించింది. ఈ చెరువుల అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించే అవకాశాన్ని కేంద్రం కల్పించినా అధికారులు తాత్సారం చేస్తున్నారు. చెరువు అడుగున 10 వేల ఘనపుటడుగుల మేర నీరు నిల్వ ఉండేలా పనులు చేపట్టాలి. చెరువు స్థలాల్లో ఉన్న ఆక్రమణలు తొలగించాలి. ఈ పథకంలో చెరువుల అభివృద్ధి వల్ల తాగు, సాగుకు నీటి వనరులు పుష్కలంగా ఏర్పడతాయి. ఈ వనరులను వినియోగించుకుంటే సాగు, తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. అలాగే భూగర్భ జలాలు పెరుగుతాయి. అయితే ఎందువలనో అధికారులు తాత్సారం చేస్తున్నారు.  


Updated Date - 2022-07-25T05:42:55+05:30 IST